Suicide Pods Are Now Legal In Switzerland: హిట్లర్.. నాజీ సైన్యం తమ శత్రువులను గ్యాస్ ఛాంబర్‌లో పెట్టి చంపేదని, పారిపోయేందుకు ప్రయత్నించే వాళ్లను కిమ్ జోంగ్ ఉన్ గ్యాస్ ఛాంబర్‌లో తోసేసి శిక్షించేవాడని కథనాలు చదివాం కదా. ఇది అందుకు ఏమాత్రం తీసిపోని విషయం. అందుకే జనాలకు అంతలా తిట్టిపోస్తున్నారు.
‘చావుపుట్టుకలు మన చేతుల్లో ఉండేవి కావు’.. ఇది ఎప్పటికీ అక్షర సత్యం. కానీ, చావును సైతం చెప్పుచేతుల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది?. ప్రత్యేక చట్టాలు అనుమతితో కారుణ్య మరణాలు కొనసాగుతున్న వేళ.. విమర్శలెన్ని వినిపించినా ‘తగ్గేదే లే’ అంటున్నాయి కొన్ని దేశాలు.
తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. నొప్పి లేకుండా కేవలం నిమిషాల్లో.. అదీ ప్రశాంతంగా చనిపోవచ్చంటూ ప్రత్యేక క్యాప్సూల్స్ వాడకానికి అనుమతులు ఇచ్చింది స్విస్ ప్రభుత్వం. సార్కో క్యాప్సూల్‌గా పిలిచే ఈ పేటికలను లోపల పడుకునే వ్యక్తే ఆపరేట్ చేసుకోగలగడం, ఎక్కడికంటే అక్కడికి మోసుకెళ్లడమే అసలు ప్రత్యేకతలు.
ఈ ప్యాడ్‌లో పడుకున్న వ్యక్తిని ముందుగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత యాక్టివ్ బటన్‌ను నొక్కేందుకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇస్తారు. బటన్ నొక్కగానే నైట్రోజన్ వాయువు రిలీజ్ అవుతుంది. కేవలం 30 సెకన్లలో ఆక్సిజన్ లెవల్ 21 శాతం నుంచి 1 శాతానికి పడిపోతుంది. స్పృహ కోల్పోయిన వ్యక్తి నిమిషాల వ్యవధిలోనే ప్రాణం విడుస్తాడు. ఈ ప్రాసెస్‌లో కణజాలానికి తక్కువ ఆక్సిజన్ పంపిణీ (hypoxia) రక్తంలో కార్బన్ డై యాక్సైడ్ లెవల్ తక్కువ కావడం(hypocapnia) ద్వారా మరణం సంభవిస్తుంది.
క్యాబిన్‌లో ఉన్న వ్యక్తి స్పృహలోకి జారుకునే క్రమంలో.. కంటి చూపు తప్ప శరీర కదలికలు పని చేయవు. తద్వారా ప్రాణం పోయేటప్పుడు గిలగిలలాడేందుకు వీలు కూడా ఉండదు అంటున్నారు డాక్టర్ ఫిలిప్ నిట్స్‌చెకే. ఆస్ట్రేలియాకు చెందిన ఎగ్జిట్ ఇంటర్నేషనల్ (నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్) డైరెక్టర్, డాక్టర్ డెత్‌గా పేరున్న ఫిలిప్ నిట్స్‌చెకే ఈ క్యాప్సుల్‌ను రూపొందించాడు.
చట్టబద్ధత ఉంది!
అసిస్టెడ్ సూసైడ్‌కు స్విట్జర్లాండ్‌లోనూ చట్టబద్దత ఉంది. కిందటి ఏడాది 1,300 మంది ఇలా చనిపోయారు కూడా(ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు). అదీ లిక్విడ్ సోడియం పెంటోబార్బిటల్‌ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి చనిపోయేలా చేసేవాళ్లు. ఇక ఇప్పుడు సార్కో క్యాప్సూల్స్ ద్వారా అనుమతి ఇచ్చారు. అయితే ఈ అనుమతి ఆత్మహత్యలకు వుసిగొల్పేలా ఉందంటూ ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ స్విస్ ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. ఇక ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ఇప్పటికే రెండు మోడల్స్ సార్కో లను తయారు చేసింది. ఇప్పుడు రూపొందించింది త్రీడీ ప్రింట్ టైప్. కాకపోతే వచ్చే ఏడాది నుంచి ఇది స్విస్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
ఈ ఆర్టికల్ కేవలం సమాచారం అందించే ఉద్దేశంతో రాయబడింది
Comments
Please login to add a commentAdd a comment