చావు ముహూర్తాన్ని తానే పెట్టుకున్నాడు..
లండన్: కచ్చితంగా చస్తామని తెలిశాక జీవించడం ఎంతో కష్టం. చాలా మంది చావు వెంటాడుతుంటే అనుక్షణం చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ జీవచ్ఛవంలా తయారవుతారు. 51 ఏళ్ల బ్రిటన్ వ్యాపారవేత్త సైమన్ బిన్నర్ వారికి భిన్నం. తన చావు ముహూర్తాన్ని తానే పెట్టుకున్నారు. అంతవరకు తన భార్య, ఇద్దరు కూతుళ్లతోపాటు విహార యాత్రలకు వెళ్లి వచ్చారు. మిత్రులను పిలిచి విందు పార్టీలు ఏర్పాటు చేశారు. చివరి క్షణాలు ఉల్లాసంగా గడిపారు. స్విడ్జర్లాండ్‌లోని ‘సూసైడ్ క్లినిక్’లో భార్య చేతులు పట్టుకొని చిద్విలాసంగా తుదిశ్వాస విడిచారు.
మోటార్ న్యూరాన్ డిసీస్‌తో బాధపడుతున్న సైమన్ తాను గడిపిన చివరి పది నెలల గురించి బీబీసీ2 గురువారం ప్రసారం చేసిన గంటన్నర డాక్యుమెంటరీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో దీనికి ప్రశంసలతోపాటు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని 12 లక్షల మంది వీక్షించారు. ఇది చావుకు కొత్త నిర్వచనం ఇస్తుందని కొంత మంది వాదిస్తుంటే రోగుల్లో నిర్వేదం నింపుతుందని, వారిని ఆత్మహత్యలవైపు పురిగొలుపుతోందని మరికొందరు వాదిస్తున్నారు. కారుణ్య మరణాలకు కరదీపిక అని ఇంకొంత మంది అంటున్నారు.
వాస్తవానికి గతేడాది అక్టోబర్ 19వ తేదీన సైమన్ స్విస్ సూసైడ్ క్లినిక్‌లో ఎనస్తీషియా ఎక్కించుకోవడం ద్వారా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన గత రెండేళ్లుగా మోటార్ న్యూరాన్ డిసీస్‌తో బాధ పడుతున్నారు. ఈ వ్యాధిగ్రస్థులు క్రమక్రమంగా అవయవాల కదలికను, మాటను కోల్పోతారు. కనీసం మింగలేరు, శ్వాసతీసుకోలేరు. బతికినంతకాలం చూడగలరు. అనుభూతి పొందగలరు. వ్యాధి వచ్చిన ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు. కాళ్లు చేతులు ఆడుతున్నప్పుడే, మాట కోల్పోకముందే చనిపోవాలని, కుటుంబానికి భారం కారాదని సైమన్ నిర్ణయించుకున్నారు. నవంబర్ రెండవ తేదీన తన చావు ముహూర్తం పెట్టుకున్నారు.
చావు నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా బంధు, మిత్రుల నుంచి ఒత్తిడి రావడంతో మధ్యలో కాస్త ఊగిసలాడారు. క్రమంగా మాట్లాడడంపై పట్టు కోల్పోతుండడంతో ముహూర్తాన్ని ముందుకు జరుపుకున్నారు. తాను భార్య డెబ్బీ, ఇద్దరు ఆడపిల్లలను జీవితంలో ఎంతగా ప్రేమించిందో చివరి మాటలుగా చెబుతూ అక్టోబర్ 19వ తేదీన భార్యా నలుగురు మిత్రుల మధ్య తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణానికి పది నెలల ముందునుంచి టీవీ చానెల్ కెమేరా ఆయన వెన్నంటే ఉండి ఆయన ప్రతి కదలికను రికార్డు చేస్తూ డాక్యుమెంటరీని రూపొందించింది. ‘హౌ టు డై: సైమన్స్ చాయిస్’ టైటిల్‌తో ప్రసారమైన ఈ డాక్యుమెంటరీ తనకు అద్భుతంగా ఉందని, కారుణ్య మరణాలపై చర్చను లేవదీసిందని భార్య డెబ్బీ వ్యాఖ్యానించారు. ఎవరి మాట ఎలా ఉన్నా లక్షలాది మంది వీక్షకులు ఇది తమను తీవ్రంగా కదిలించింది, కలచివేసిందంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.