Simon Binner
-
చావు ముహూర్తాన్ని తానే పెట్టుకున్నాడు..
లండన్: కచ్చితంగా చస్తామని తెలిశాక జీవించడం ఎంతో కష్టం. చాలా మంది చావు వెంటాడుతుంటే అనుక్షణం చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ జీవచ్ఛవంలా తయారవుతారు. 51 ఏళ్ల బ్రిటన్ వ్యాపారవేత్త సైమన్ బిన్నర్ వారికి భిన్నం. తన చావు ముహూర్తాన్ని తానే పెట్టుకున్నారు. అంతవరకు తన భార్య, ఇద్దరు కూతుళ్లతోపాటు విహార యాత్రలకు వెళ్లి వచ్చారు. మిత్రులను పిలిచి విందు పార్టీలు ఏర్పాటు చేశారు. చివరి క్షణాలు ఉల్లాసంగా గడిపారు. స్విడ్జర్లాండ్లోని ‘సూసైడ్ క్లినిక్’లో భార్య చేతులు పట్టుకొని చిద్విలాసంగా తుదిశ్వాస విడిచారు. మోటార్ న్యూరాన్ డిసీస్‌తో బాధపడుతున్న సైమన్ తాను గడిపిన చివరి పది నెలల గురించి బీబీసీ2 గురువారం ప్రసారం చేసిన గంటన్నర డాక్యుమెంటరీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో దీనికి ప్రశంసలతోపాటు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని 12 లక్షల మంది వీక్షించారు. ఇది చావుకు కొత్త నిర్వచనం ఇస్తుందని కొంత మంది వాదిస్తుంటే రోగుల్లో నిర్వేదం నింపుతుందని, వారిని ఆత్మహత్యలవైపు పురిగొలుపుతోందని మరికొందరు వాదిస్తున్నారు. కారుణ్య మరణాలకు కరదీపిక అని ఇంకొంత మంది అంటున్నారు. వాస్తవానికి గతేడాది అక్టోబర్ 19వ తేదీన సైమన్ స్విస్ సూసైడ్ క్లినిక్‌లో ఎనస్తీషియా ఎక్కించుకోవడం ద్వారా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన గత రెండేళ్లుగా మోటార్ న్యూరాన్ డిసీస్‌తో బాధ పడుతున్నారు. ఈ వ్యాధిగ్రస్థులు క్రమక్రమంగా అవయవాల కదలికను, మాటను కోల్పోతారు. కనీసం మింగలేరు, శ్వాసతీసుకోలేరు. బతికినంతకాలం చూడగలరు. అనుభూతి పొందగలరు. వ్యాధి వచ్చిన ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు. కాళ్లు చేతులు ఆడుతున్నప్పుడే, మాట కోల్పోకముందే చనిపోవాలని, కుటుంబానికి భారం కారాదని సైమన్ నిర్ణయించుకున్నారు. నవంబర్ రెండవ తేదీన తన చావు ముహూర్తం పెట్టుకున్నారు. చావు నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా బంధు, మిత్రుల నుంచి ఒత్తిడి రావడంతో మధ్యలో కాస్త ఊగిసలాడారు. క్రమంగా మాట్లాడడంపై పట్టు కోల్పోతుండడంతో ముహూర్తాన్ని ముందుకు జరుపుకున్నారు. తాను భార్య డెబ్బీ, ఇద్దరు ఆడపిల్లలను జీవితంలో ఎంతగా ప్రేమించిందో చివరి మాటలుగా చెబుతూ అక్టోబర్ 19వ తేదీన భార్యా నలుగురు మిత్రుల మధ్య తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి పది నెలల ముందునుంచి టీవీ చానెల్ కెమేరా ఆయన వెన్నంటే ఉండి ఆయన ప్రతి కదలికను రికార్డు చేస్తూ డాక్యుమెంటరీని రూపొందించింది. ‘హౌ టు డై: సైమన్స్ చాయిస్’ టైటిల్‌తో ప్రసారమైన ఈ డాక్యుమెంటరీ తనకు అద్భుతంగా ఉందని, కారుణ్య మరణాలపై చర్చను లేవదీసిందని భార్య డెబ్బీ వ్యాఖ్యానించారు. ఎవరి మాట ఎలా ఉన్నా లక్షలాది మంది వీక్షకులు ఇది తమను తీవ్రంగా కదిలించింది, కలచివేసిందంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. -
సూసైడ్ క్లినిక్ లో చనిపోయాడు..
లండన్: ‘బ్రిటన్‌లో మానవునికి బతికే హక్కు ఉన్నట్లే చనిపోయే హక్కు కూడా ఉండాలి. అందుకు మీరంతా పోరాడండి’ అంటూ ప్రజలకు ఆఖరి పిలుపునిచ్చి, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి ప్రశాంతంగా వెళ్లి పోయారు 57 ఏళ్ల సైమన్ బిన్నర్. బెడ్ పక్కనున్న 51 ఏళ్ల భార్య డెబ్బీ, కూతురు హన్నా, 85ఏళ్ల తల్లీకి వీడ్కోలు చెప్పి ‘స్విస్ సూసైడ్ క్లినిక్’లో సోమవారం శాశ్వతంగా కన్నుమూశారు బిన్నర్. ధైర్యానికి మారుపేరు, ధీరోదాత్తుడు అంటూ సోషల్ వెబ్సైట్లు ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి. గత కొన్నేళ్లుగా ‘మోటార్ న్యూరాన్ డిసీస్ (పాణాంతక నరాల జబ్బు)’తో బాధ పడుతున్న బిన్నర్ ఇంకా కొంతకాలం కుటుంబ సభ్యుల మధ్య బతకాలని, ఆ తర్వాత తనకు నచ్చిన రోజు నాడు తనువు చాలించాలని కలలు కన్నారు. కనీసం భార్యా పిల్లలతో కలసి ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆశించారు. అందుకు బ్రిటన్ చట్టాలు అనుకూలించలేదు. స్వచ్ఛందంగా చనిపోయే హక్కు బ్రిటన్‌లో లేదు. రోగి తనంతట తాను చనిపోయేందుకు ప్రయత్నించినా, అందుకు ఎవరు సహకరించినా బ్రిటన్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసు దాఖలు చేసి విచారిస్తారు. నరాల జబ్బు కారణంగా ఇప్పటికే వీల్ చైర్‌కు పరిమితమైన బిన్నర్ మానవునికి చనిపోయే హక్కు కల్పిస్తున్న స్విట్జర్లాండ్ లోని ‘సూసైడ్ క్లినిక్’కు వెళ్లి అక్కడ తనవు చాలించాలని తీర్మానించుకున్నారు. జబ్బు ముదిరి జీవచ్ఛవంలా తయారయ్యాక స్విస్‌కు వెళ్లే బదులు, కాస్త బాగున్నప్పుడే అక్కడికెళ్లి ప్రాణం వీడాలనుకున్నారు. భార్యతో కలసి విమానంలో స్విస్‌కు వెళ్లారు. తల్లీ, కూతురు మరో విమానంలో అక్కడికి వెళ్లారు. సోమవారం నాడు తాను చనిపోవాలని నిర్ణయించుకున్నానని, నవంబర్, శుక్రవారం 13వ తేదీన తన శవానికి అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ వెబ్సైట్ ‘లింక్డ్ఇన్’ పేజీలో మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలిపారు. ధీరోధాత్తుడివంటూ మిత్రులు నివాళులర్పించారు. ఇప్పటికైనా మానవతా హృదయంతో బ్రిటన్ చట్టాలను సమీక్షిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి క్షణాలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడపాలంటూ శ్రేయోభిలాషులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. వారి ఆకాంక్ష మేరకు భిన్నర్ తనతోపాటు 14 ఏళ్లపాటు కాపురం చేసిన భార్య దెబ్బీతో ఆదివారం సాయంత్రం స్విస్ వీధుల్లో షికారు చేశారు. ‘మై బ్యూటిఫుల్ ఇనిస్సిరేషన్స్’ ట్యాగ్‌తో తల్లిదండ్రులు కలిసున్న ఫొటోను కూతురు హన్నా సోషల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. లండన్‌లోని ఓ కంపెనీ డెరైక్టర్‌గా పనిచేస్తూ వచ్చిన తన తండ్రి పని రాక్షసుడే కాకుండా సమయం చిక్కినప్పుడు కొండలెక్కేవారని, టెన్నీస్ ఆడేవారని కూతురు హన్నా తెలిపారు. స్విట్జర్లాండ్ లోని బేసల్ నగరానికి బయల్దేరి వెళ్లడానికి ముందు దక్షిణ లండన్, ప్యూర్లేలోని తన ఇంట్లో బిన్నర్పై కొన్ని వీడియోలను చిత్రీకరించారు. మనిషికి చనిపోయే హక్కు కావాలని ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్న ‘బ్రిటీష్ హ్యూమనిస్ట్ అసోసియేషన్’ ఈ వీడియోలను చిత్రీకరించింది. రోజు రోజుకు క్షీణిస్తున్న బిన్నర్ పరిస్థితి చూస్తుంటే ప్రతిరోజు పీడకలతో లేచినట్టుగా ఉంటోందని ఒక వీడియోలో భార్య డెబ్బీ వ్యాఖ్యానించారు. క్రిస్మస్ రాకుండానే ఈ లోకంవీడి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంద న్నారు. మోటార్ న్యూరాన్ డిసీస్ అంటే....ప్రాణాంతకమైన నరాల జబ్బు. క్రమక్రమంగా రోగి శరీరమంతా పక్షవాతంలా చచ్చుపడిపోతుంది. కదలలేరు, మెదలలేరు, మాట్లాడలేరు. ఏదీ మింగలేరు. శ్వాసకూడా సరిగ్గా తీసుకోలేరు. కానీ చూడగలరు, వినగలరు, అనుభూతి చెందగలరు. సాధారణంగా 50 నుంచి 70 ఏళ్ల మధ్యవారికి ఈ జబ్బు వస్తుంది. బ్రిటన్ లో ఈ జబ్బుతో బాధపడుతున్నవారు ఏ రోజైనా సరాసరి ఐదువేల మంది ఉంటారు. వీరిలో పదిశాతం మందికి జన్యుకారణంగా ఈ రోగం సంక్రమిస్తుంది. మిగతావారికి ఎందుకొస్తుందో ఇప్పటికీ కనుక్కోలేక పోయారు. అందుబాటులో ఉన్న మందులతో రోగి జీవితకాలాన్ని ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు. -
'నేను సోమవారం చనిపోయాను'
లండన్: చావు దగ్గరకు వచ్చిందని ముందే తెలిస్తే బతుకంటే తెలియని తీపి.. మరికొన్ని రోజులుంటే బాగుంటుందనిపిస్తుంది. బతకాలి.. ఇంక బతుకుతాను అని ధైర్యంతో, ముందుకు నెట్టుకెళ్లాలనిపిస్తుంది. కానీ బ్రిటన్‌లో ఓ వ్యాపార వేత్త మాత్రం తాను బతికుండగానే చావును ప్రకటించేసుకున్నాడు. అలా చేస్తున్నందుకు తనకు ఎలాంటి ఆందోళన, బాధ లేదని చెప్పేశాడు. సైమన్ బిన్నర్ అనే వ్యక్తి సుట్టాన్లోని హెల్త్ అండ్ సోషల్ కేర్ ఆర్గనైజేషన్ కేర్ మార్క్ లో చాలాకాలంగా ఆపరేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకున్న ఆయనకు గత జనవరిలో మోటార్ న్యూరోన్ డిసీజ్ (ఎంఎన్డీ) వచ్చింది. దీంతో ఆయన బాధ్యతలు మరో వ్యక్తికి అప్పగించి ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వ్యాధి బాగా ముదిరిపోయింది. ఆ వ్యాధితో ఓ రకంగా నరకం అనుభవిస్తున్నారు. వైద్యులు తన ప్రాణం పోకుండా ప్రయత్నిస్తున్నారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో బతకననే విషయం మాత్రం తనకు తెలుసు. అందుకే ఏమనుకున్నారో ఏమో.. వెంటనే తాను ఉపయోగించే సామాజిక మాద్యమం లింక్ డెన్ ద్వారా 'నేను 2015 అక్టోబర్ 19న (సోమవారం) స్విట్టర్లాండ్‌లో చనిపోయాను. నా అంత్యక్రియలు 2015, నవంబర్ 13, 2015న ఉంటాయి' అంటూ బిన్నర్ తన ప్రొఫైల్ తో సహా లింక్ డన్ వెబ్ సైట్లో పోస్ట్ చేశాడు. ఎంఎన్ డీ వల్ల ప్రస్తుతం ఆయన నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతినడమే కాకుండా శరీరంలో అన్ని అవయవాలు పనిచేయడం మందగించాయి. దీంతో మాట్లాడటం, నడవటం, తినడం, శ్వాసతీసుకోవడం లాంటి పనులు చేయలేకపోతున్నాడు. బిన్నర్ పరిస్థితి చూసి ప్రతిఒక్కరూ బాధపడుతున్నారు. తన మరణానికి వైద్యులు సహకరించాలని పరోక్షంగా ఈ సందేశం ద్వారా బిన్నర్ కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుత చట్టాలను మార్చేందుకు బిన్నర్ కథనే ఉదాహరణగా తీసుకోవాలని, నయంకానీ జబ్బుతో బాధపడేవారికి వైద్యుల సహాయంతో చనిపోయే అవకాశం ఉంటే.. వారి ఆరోగ్య పరిస్థితి అధ్వాన్నంగా తయారవడానికి ముందు ఆనందంగా తమ వారితో గడిపి తృప్తిగా వారు కన్నుమూస్తారని, అలాంటి చట్ట సవరణలు చేసుకోవాలని అవసరం ఉందని బ్రిటన్ మానవ హక్కుల సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రూకాప్సన్ తెలిపాడు.