సూసైడ్ క్లినిక్ లో చనిపోయాడు..
లండన్: ‘బ్రిటన్‌లో మానవునికి బతికే హక్కు ఉన్నట్లే చనిపోయే హక్కు కూడా ఉండాలి. అందుకు మీరంతా పోరాడండి’ అంటూ ప్రజలకు ఆఖరి పిలుపునిచ్చి, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి ప్రశాంతంగా వెళ్లి పోయారు 57 ఏళ్ల సైమన్ బిన్నర్. బెడ్ పక్కనున్న 51 ఏళ్ల భార్య డెబ్బీ, కూతురు హన్నా, 85ఏళ్ల తల్లీకి వీడ్కోలు చెప్పి ‘స్విస్ సూసైడ్ క్లినిక్’లో సోమవారం శాశ్వతంగా కన్నుమూశారు బిన్నర్. ధైర్యానికి మారుపేరు, ధీరోదాత్తుడు అంటూ సోషల్ వెబ్‌సైట్లు ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి.
గత కొన్నేళ్లుగా ‘మోటార్ న్యూరాన్ డిసీస్ (పాణాంతక నరాల జబ్బు)’తో బాధ పడుతున్న బిన్నర్ ఇంకా కొంతకాలం కుటుంబ సభ్యుల మధ్య బతకాలని, ఆ తర్వాత తనకు నచ్చిన రోజు నాడు తనువు చాలించాలని కలలు కన్నారు. కనీసం భార్యా పిల్లలతో కలసి ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆశించారు. అందుకు బ్రిటన్ చట్టాలు అనుకూలించలేదు. స్వచ్ఛందంగా చనిపోయే హక్కు బ్రిటన్‌లో లేదు. రోగి తనంతట తాను చనిపోయేందుకు ప్రయత్నించినా, అందుకు ఎవరు సహకరించినా బ్రిటన్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసు దాఖలు చేసి విచారిస్తారు.
నరాల జబ్బు కారణంగా ఇప్పటికే వీల్ చైర్‌కు పరిమితమైన బిన్నర్ మానవునికి చనిపోయే హక్కు కల్పిస్తున్న స్విట్జర్లాండ్ లోని ‘సూసైడ్ క్లినిక్’కు వెళ్లి అక్కడ తనవు చాలించాలని తీర్మానించుకున్నారు. జబ్బు ముదిరి జీవచ్ఛవంలా తయారయ్యాక స్విస్‌కు వెళ్లే బదులు, కాస్త బాగున్నప్పుడే అక్కడికెళ్లి ప్రాణం వీడాలనుకున్నారు. భార్యతో కలసి విమానంలో స్విస్‌కు వెళ్లారు. తల్లీ, కూతురు మరో విమానంలో అక్కడికి వెళ్లారు. సోమవారం నాడు తాను చనిపోవాలని నిర్ణయించుకున్నానని, నవంబర్, శుక్రవారం 13వ తేదీన తన శవానికి అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ వెబ్‌సైట్ ‘లింక్డ్‌ఇన్’ పేజీలో మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలిపారు.
ధీరోధాత్తుడివంటూ మిత్రులు నివాళులర్పించారు. ఇప్పటికైనా మానవతా హృదయంతో బ్రిటన్ చట్టాలను సమీక్షిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి క్షణాలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడపాలంటూ శ్రేయోభిలాషులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. వారి ఆకాంక్ష మేరకు భిన్నర్ తనతోపాటు 14 ఏళ్లపాటు కాపురం చేసిన భార్య దెబ్బీతో ఆదివారం సాయంత్రం స్విస్ వీధుల్లో షికారు చేశారు. ‘మై బ్యూటిఫుల్ ఇనిస్సిరేషన్స్’ ట్యాగ్‌తో తల్లిదండ్రులు కలిసున్న ఫొటోను కూతురు హన్నా సోషల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. లండన్‌లోని ఓ కంపెనీ డెరైక్టర్‌గా పనిచేస్తూ వచ్చిన తన తండ్రి పని రాక్షసుడే కాకుండా సమయం చిక్కినప్పుడు కొండలెక్కేవారని, టెన్నీస్ ఆడేవారని కూతురు హన్నా తెలిపారు.
స్విట్జర్లాండ్ లోని బేసల్ నగరానికి బయల్దేరి వెళ్లడానికి ముందు దక్షిణ లండన్, ప్యూర్లేలోని తన ఇంట్లో బిన్నర్‌పై కొన్ని వీడియోలను చిత్రీకరించారు. మనిషికి చనిపోయే హక్కు కావాలని ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్న ‘బ్రిటీష్ హ్యూమనిస్ట్ అసోసియేషన్’ ఈ వీడియోలను చిత్రీకరించింది. రోజు రోజుకు క్షీణిస్తున్న బిన్నర్ పరిస్థితి చూస్తుంటే ప్రతిరోజు పీడకలతో లేచినట్టుగా ఉంటోందని ఒక వీడియోలో భార్య డెబ్బీ వ్యాఖ్యానించారు. క్రిస్మస్ రాకుండానే ఈ లోకంవీడి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంద న్నారు.
మోటార్ న్యూరాన్ డిసీస్ అంటే....ప్రాణాంతకమైన నరాల జబ్బు. క్రమక్రమంగా రోగి శరీరమంతా పక్షవాతంలా చచ్చుపడిపోతుంది. కదలలేరు, మెదలలేరు, మాట్లాడలేరు. ఏదీ మింగలేరు. శ్వాసకూడా సరిగ్గా తీసుకోలేరు. కానీ చూడగలరు, వినగలరు, అనుభూతి చెందగలరు. సాధారణంగా 50 నుంచి 70 ఏళ్ల మధ్యవారికి ఈ జబ్బు వస్తుంది. బ్రిటన్ లో ఈ జబ్బుతో బాధపడుతున్నవారు ఏ రోజైనా సరాసరి ఐదువేల మంది ఉంటారు. వీరిలో పదిశాతం మందికి జన్యుకారణంగా ఈ రోగం సంక్రమిస్తుంది. మిగతావారికి ఎందుకొస్తుందో ఇప్పటికీ కనుక్కోలేక పోయారు. అందుబాటులో ఉన్న మందులతో రోగి జీవితకాలాన్ని ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు.