'నేను సోమవారం చనిపోయాను'
లండన్: చావు దగ్గరకు వచ్చిందని ముందే తెలిస్తే బతుకంటే తెలియని తీపి.. మరికొన్ని రోజులుంటే బాగుంటుందనిపిస్తుంది. బతకాలి.. ఇంక బతుకుతాను అని ధైర్యంతో, ముందుకు నెట్టుకెళ్లాలనిపిస్తుంది. కానీ బ్రిటన్లో ఓ వ్యాపార వేత్త మాత్రం తాను బతికుండగానే చావును ప్రకటించేసుకున్నాడు. అలా చేస్తున్నందుకు తనకు ఎలాంటి ఆందోళన, బాధ లేదని చెప్పేశాడు. సైమన్ బిన్నర్ అనే వ్యక్తి సుట్టాన్లోని హెల్త్ అండ్ సోషల్ కేర్ ఆర్గనైజేషన్ కేర్ మార్క్ లో చాలాకాలంగా ఆపరేషన్స్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకున్న ఆయనకు గత జనవరిలో మోటార్ న్యూరోన్ డిసీజ్ (ఎంఎన్డీ) వచ్చింది. దీంతో ఆయన బాధ్యతలు మరో వ్యక్తికి అప్పగించి ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. వ్యాధి బాగా ముదిరిపోయింది. ఆ వ్యాధితో ఓ రకంగా నరకం అనుభవిస్తున్నారు. వైద్యులు తన ప్రాణం పోకుండా ప్రయత్నిస్తున్నారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో బతకననే విషయం మాత్రం తనకు తెలుసు. అందుకే ఏమనుకున్నారో ఏమో.. వెంటనే తాను ఉపయోగించే సామాజిక మాద్యమం లింక్ డెన్ ద్వారా 'నేను 2015 అక్టోబర్ 19న (సోమవారం) స్విట్టర్లాండ్లో చనిపోయాను. నా అంత్యక్రియలు 2015, నవంబర్ 13, 2015న ఉంటాయి' అంటూ బిన్నర్ తన ప్రొఫైల్ తో సహా లింక్ డన్ వెబ్ సైట్లో పోస్ట్ చేశాడు. ఎంఎన్ డీ వల్ల ప్రస్తుతం ఆయన నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతినడమే కాకుండా శరీరంలో అన్ని అవయవాలు పనిచేయడం మందగించాయి.
దీంతో మాట్లాడటం, నడవటం, తినడం, శ్వాసతీసుకోవడం లాంటి పనులు చేయలేకపోతున్నాడు. బిన్నర్ పరిస్థితి చూసి ప్రతిఒక్కరూ బాధపడుతున్నారు. తన మరణానికి వైద్యులు సహకరించాలని పరోక్షంగా ఈ సందేశం ద్వారా బిన్నర్ కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుత చట్టాలను మార్చేందుకు బిన్నర్ కథనే ఉదాహరణగా తీసుకోవాలని, నయంకానీ జబ్బుతో బాధపడేవారికి వైద్యుల సహాయంతో చనిపోయే అవకాశం ఉంటే.. వారి ఆరోగ్య పరిస్థితి అధ్వాన్నంగా తయారవడానికి ముందు ఆనందంగా తమ వారితో గడిపి తృప్తిగా వారు కన్నుమూస్తారని, అలాంటి చట్ట సవరణలు చేసుకోవాలని అవసరం ఉందని బ్రిటన్ మానవ హక్కుల సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రూకాప్సన్ తెలిపాడు.