'అమ్మ ఆశీర్వాదం కోసం వచ్చా'
విజయవాడ : భార్యాభర్తల మధ్య అనుబంధాలు, కోపతాపాలను చక్కగా తెరపై చూపిన చిత్రం 'పెళ్లిపుస్తకం' అని మా అధ్యక్షుడు, టాలీవుడ్ ప్రముఖ నటుడు జి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో రాజేంద్రప్రసాద్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల రాజేంద్రప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... బాపు, రమణలు చక్కగా తెరకెక్కించిన పెళ్లి పుస్తకం చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆయన గుర్తు చేశారు.
ఈ సందర్బంగా అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చినట్లు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మా తరపున సినిమా కళాకారులందరికీ ఆరోగ్య కార్డులు జారీ చేసినట్లు చిత్ర పరిశ్రమలోని వారి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ వివరించారు. అంతకుముందు అధికారులు రాజేంద్రప్రసాద్కు ఆలయంలో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు రాజేంద్రప్రసాద్కు అందజేశారు.