’అధికార’ దందా
’అధికార’ దందా
Published Fri, Aug 4 2017 11:58 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM
అటవీ భూమిని కాజేసి..సాగులోకి..
కొంత భాగం రొయ్యల చెరువుల తవ్వకం...
ఎత్తిపోతల కింద భూములు పోయినట్లుగా అక్రమ రికార్డులు
పరిహారం డబ్బులు అప్పనంగా జేబులోకి...
చోద్యం చూస్తున్న అధికారులు
కలరాయనగూడెంలో టీడీపీ నేత భూబాగోతం
సాక్షి ప్రతినిధి, ఏలూరు:
అయన అధికార పక్ష నాయకుడు... ఓ పదవి కోసం పోటీలో ఉన్నారు...ఆ చుట్టుపక్కల ఆయన మాటే శాసనం... దీంతో ఆయన చెలరేగిపోయారు. తన భూముల పక్కన ఉన్న అటవీ శాఖ భూములను కూడా తన పొలంలో కలిపేసుకున్నారు... అందులో రొయల్య చెరువుతో పాటు పామాయిల్ తోటలను కూడా వేసుకున్నారు.... చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ తన పొలాల పక్కనే ఉన్న అటవీ శాఖ భూమిలో నుంచి వెళ్తోంది. దీన్ని కూడా సొమ్ము చేసుకోవాలనుకున్న ఆ నేత రెవెన్యూ అధికారులను ఉపయోగించి అది తన సొంత భూములు ఉన్న సర్వే నెంబర్‌గా చూపించి నష్టపరిహారం కూడా కొట్టేయడానికి ప్లాన్ చేశారు.
లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత తన కుటుంబ సభ్యులు కలసి గత కొన్నేళ్లుగా ఆర్‌ఎస్ నెంబరు 269 అటవీ భూమిలో సుమారు 18 ఎకరాలు సాగుచేస్తున్నారు. ఈ భూమికి పక్కనే ఆర్‌ఎస్ నెంబరు 264/3, 264/4లో ఈ నేతకు సొంత జిరాయితీ భూమి ఉంది. ఈ భూమికి పక్కనే తాను ఆక్రమించుకున్న అటవీ శాఖ భూముల గుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వెళ్లింది. అటవీ భూములకు నష్టపరిహారం రాదు. దీంతో తన సొంత భూమి ఉన్న ఆర్‌ఎస్ నెంబర్‌లో కొంత భూమి కాల్వకు పోయినట్లుగా చూపిస్తున్నారు. రెవిన్యూ సిబ్బంది కుమ్మక్కు కావడంతో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌లో అటవీ భూమి అని కాకుండా దాని పక్కన ఉన్న సర్వే నెంబర్లను నోటిఫికేషన్‌లో ఇచ్చింది. కలరాయనగూడెంలో ఇటీవల చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా సర్వేచేసి, భూసేకరణ చేసి నోటిఫికేషన్ ఇచ్చింది. వాస్తవంగా జరుగుతున్న భూసేకరణకు, నోటిఫికేషన్‌లో ప్రకటించిన భూమి విస్తీర్ణానికి సంబంధించి చాలా అవకతవకలు జరిగినట్లు ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. కాలువకు సంబంధించి భూసేకరణ కోసం సర్వే అధికారులు వచ్చి కొలతలు నిర్వహించారు. ఆ సమయంలో ఈ నాయకుడు అటవీ భూమిలో అనుమతులు లేకుండా గత కొన్నేళ్లుగా రెండు చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్న విషయాన్ని గుర్తించినా వారు అధికార పార్టీ నేత కావడంతో మౌనంగా ఉండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. అటవీ శాఖ భూమిలో అక్రమంగా తవ్విన రొయ్యల చెరువులకు ప్రభుత్వం వారు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. సింగల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టి 24 గంటలపాటు నీటిని మోటార్‌తో తోడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదు. రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ శాఖలకు చెందిన స్ధానిక అధికారులకు ఈ నేతతో మంచి సంబంధాలు ఉండటంతో ఇక్కడ అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ భూ బాగోతాలపై సమగ్ర విచారణ జరిపించి అక్రమంగా సాగుచేస్తున్న అటవీ భూములతోపాటు ఎత్తిపోతల పథకం కాలువకు సంబంధించి సొమ్మును కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Advertisement