irigation
-
జలయజ్ఞ ప్రదాత రాజన్న
సాక్షి, విజయనగరం: భూమి ఉన్నా నీరు లేక... అదను దాటిపోతున్నా దున్నుకోలేక.. సొంత పొలమున్నా సాగులేక... బతుకు తెరువు కోసం పరాయి పంచన కూలీలై కష్టాలు పడుతున్న జిల్లా రైతుల పాలిట రాజశేఖరరెడ్డి అపర భగీరథుడయ్యారు. ఆసియాలోనే తొలి రబ్బరు డ్యామ్‌ను జంఝావతి నదిపై నిర్మించారు. పెద్దగెడ్డ నుంచి పంట చేలకు సాగునీరందేలా రిజర్వాయర్ కట్టించారు. తోటపల్లి ప్రాజెక్టును తొంభైశాతం పూర్తి చేశారు. సాగు, తాగునీరు ఇబ్బందుల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు పూర్తిస్థాయిలో చేయూతనందించి ఇక్కడి అన్నదాతలకు దేవుడయ్యారు. ఆ మహనీయుని 71వ జయంతి నేడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుతూ తోటపల్లి సాగునీటి కాలువ ఏర్పడింది. రూ. 84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని చీపురుపల్లి నియోజకవర్గానికి మంజూరు చేశారు. వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌గా తీర్చిదిద్దాలని నిధులు మంజూరు చేశారు. మక్కువ మండలంలో సురాపాడు ప్రాజెక్టు నిర్మించారు. వెంగళరాయ సాగర్ రిజర్వాయర్‌కు సంబంధించిన కాలువలు అభివృద్ధి పనులు చేశారు. అరుదైన రబ్బర్ డ్యామ్ కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976లో జంఝావతి డ్యామ్‌నకు శ్రీకారం చుట్టారు. కానీ పూర్తిస్థాయిలో భూ సమీకరణ చేపట్టకపోవడంతో ఒడిశాతో వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని తొలగించేందుకు అటు ఒడిశా, ఇటు ఏపీ ప్రభుత్వాలు పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ ఒడిశా ప్రభుత్వం ముంపు గ్రామాలను వదులు కోవడానికి ససేమిరా అనడంతో అక్కడ డ్యామ్ రివర్ గ్యాప్ మూసివేయకుండా వదిలేశారు. దీనివల్ల నదిగుండా ప్రవహించే నీరు వృథాగా పోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదన గమనించిన మహానేత 2006లో ఆ్రస్టియా టెక్నాలజీతో రూ.5 కోట్లతో ఆసియాలోనే మొట్టమొదటి సారిగా రబ్బరు డ్యామ్‌ను నిర్మించారు. రబ్బరు డ్యామ్ ద్వారా నీటిని నిల్వచేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పొలాలకు సాగునీటిని అందించే అవకాశం కలిగింది. డ్యామ్ లోపలి భాగంలో 0.03 టీఎంసీల నీరు నిల్వ ఉండి లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుకూలమైంది. దీని ద్వారా 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. తోటపల్లితో మారిన దశ గరుగుబిల్లి మండలంలో తోటపల్లి ప్రాజెక్టుకు రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. సింహభాగం పనులు టీడీపీ అధికారం చేపట్టకముందే జరిగాయి. తోటపల్లి చానల్ ద్వారా సుమా రు 3వేల ఎకరాలకు నీరందించేందుకు పైలాన్ ప్రారంభోత్సవాన్ని వైఎస్ అప్పట్లో చేశారు. పార్వతీపురం మండలం అడారుగెడ్డ నిర్మాణానికి కూడా రాజశేఖరరెడ్డి హయాంలోనే నిధులు కేటాయించారు. విజయనగరం పట్టణానికి తాగునీటి కోసం నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు 2007లో సుమారు రూ.187 కోట్లను విడుదల చేశారు. నెల్లిమర్ల పట్టణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థం మంచినీటి పధకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. తొలి జలయజ్ఞ ఫలం పెద్దగెడ్డ పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ రిజర్వాయర్ పేరు చెప్పగానే అక్కడి ప్రజలకు గుర్తుకొచ్చేది వైఎస్సార్. జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ.100 కోట్లతో పెద్దగెడ్డ రిజ ర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ను 2006లో ఆయనే ప్రారంభించారు. ఈ సమయంలోనే సమీపంలోని అరుకు–పాచిపెంట ప్రాంతాల్లో హెలికాఫ్టర్ ద్వారా ఏరి యల్ సర్వే నిర్వహించారు. ఇక్కడ అందాలను చూసి అబ్బురపడ్డారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు చేశారు. అప్పుడే సుమారు 2 ఎకరాల పా ర్క్ ఏర్పాటయ్యింది. రిజర్వాయర్‌లో ఉండే నాటు పడవల స్థానంలో విశాఖపట్నం నుంచి మిషన్బోట్లు తీసుకువచ్చా రు. ఇవే గాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనే రూపకల్పన చేసి వాటి ఫలాలను జిల్లాకు అందించారు. -
కాళేశ్వరం డీపీఆర్ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం పేరు మీద కార్పొరేషన్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఏమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజల ముందు డీపీఆర్‌ను ఎందుకు పెట్టలేదని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వల్లే సాధ్యమైందని ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో గతంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని గుర్తుచేశారు. అదే ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ హాల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జాతీయ హోదా కోసం పోరాడితే 95 శాతం నిధులు కేంద్రమే ఇచ్చేదని, కానీ కమీషన్ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు పోరాడలేదని ఆరోపించారు. రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. దీనికి ఏటా రూ.5 వేల కోట్ల విద్యుత్ ఖర్చు అవుతుందన్నారు. ప్రాజెక్టు టెండర్లన్నీ ఇరిగేషన్ వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ప్రారంభానికి రాష్ట్ర నేతలను పిలవకుండా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుస్తున్నారని, ఇదెక్కడి సంప్రదాయమని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా పార్టీ అవసరాలకు ఆర్థిక వనరులు సమకూర్చే వనరుగా మార్చారని, అభివృద్ధి కోసం మండిపడ్డారు. పార్టీకి, డబ్బులు కావాల్సినప్పుడల్లా కాళేశ్వరాన్ని కామధేనువులా వాడుకుంటున్నారని ఆరోపిం చారు. ఈ ప్రాజెక్టులో అవినీతి చిట్టా బయటపెడతారన్న భయంతోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు రాజ్యాంగాన్ని కాపాడేలా ఉన్నాయని కితాబిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా టీఆర్ఎస్లో చేర్చుకోవడం దుస్సంప్రదాయమని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా చేవెళ్లకు నీళ్లు రావాలని గతంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాదయాత్ర చేశారని, ఈ ప్రాజెక్టు నుంచి రావాల్సిన నీటి వాటా ఇస్తామని టీఆర్ఎస్ వాళ్లు చెప్పారా అని ఆమెను భట్టి ప్రశ్నించారు. నీళ్లివ్వనప్పుడు టీఆర్ఎస్లో ఎందుకు చేరారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఆ రైతులు ఇంకా....నీరు పేదలే..
‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ గ్రామాల్లో పంటపొలాలకు మడ్డువలస కాలువ ద్వారా సాగునీరు అందిస్తా. మాకు ఓటు వేసి గెలిపించండి. ఒక్క అవకాశం ఇవ్వండి. నేను అధికారంలోకి రాగానే మొదటి పనిగా మీకు సాగునీరు అందిస్తా. నీరు వస్తే మీ పల్లెలు సస్యశ్యామలంగా మారిపోతాయి. అప్పుడు ఎవ్వరూ వలసలు వెళ్లవలసిన అవసరం లేకుండా చేస్తా.’ మీరు నన్ను నమ్మండి అంటూ 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన కిమిడి కళావెంకటరావు ఆ గ్రామాల ప్రజలకు హమీలు గుప్పించారు. ఆయన ఆ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి చేపట్టి నేటికి ఐదేళ్లు పూర్తయినా ఇంతవరకు ఆ గ్రామాలకు చుక్క సాగునీరు అందలేదు. దీంతో ఆ గ్రామాల రైతులు తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు. మడ్డువలస ప్రాజెక్ట్ ద్వారా నీటిని విడిచిపెట్టి 13 ఏళ్లు కావస్తోంది. ప్రాజెక్ట్ పరిధిలో ఆయకట్టు కాలువల విస్తరణ జరిగి కూడా 13 ఏళ్లే కావస్తోంది. ఇంతవరకూ ప్రాజెక్ట్‌ను ఆధునికీకరించకపోవడం ఓ సమస్య కాగా, కాలువల విస్తరణ జరగకపోవడం మరో సమస్య. సాక్షి, శ్రీకాకుళం: మండలంలోని పలు గ్రామాలకు మడ్డువలస ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందని పరిస్థి«తి ఉన్నా అధికారులు పట్టించు కోవడంలేదు. దేవరవలస, మంగమ్మపేట, వాండ్రంకి, బోట్లపేట తదితర గ్రామాల్లో కాలువ 56 అడుగులకు పైగా లోతులో ఉంది. ఇంజినీరింగ్ ప్లాన్లు ఈ ప్రాంతంలో ఆయకట్టుకు సాగునీరు అందించని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు నీరు రాక ఈ ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో ఆయకట్టు భూములకు ఆరుతడి అధారంగా సాగు మారింది. ఆయకట్టు పరిధిలో రైతులకు మాత్రం నీటి తీరువా చెల్లించడం తప్పడం లేదు. దీంతో మడ్డువలస విస్తరణతో పాటు సాగునీరు రావాలంటే ఆధునికీకరణ నిమిత్తం రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. ఆందోళనలో రైతులు మడ్డువలస ప్రధాన కుడికాలువ ద్వారా వాండ్రంగి పంట పొలాలకు సాగునీరు రావాలంటే 2009వ సంవత్సరంలో చేపట్టిన మొదటి అలైన్మెంట్ ద్వారా పనులు చేస్తేనే పంట పొలాలకు సాగునీరు అందుతుందని, లేకపొతే భూములన్నీ బీడుగా మారుతాయని మాజీ సర్పంచ్ బూరాడ వెంకటరమణ తెలిపారు. ఈ విషయంపై గతంలో రాష్ట్ర మంత్రి కళా వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. 2009వ సంవత్సరంలో చేపట్టిన భూసేకరణ ప్రకారమే పనులు చేయాలని కోరారు. వాండ్రంగి గ్రామానికి మడ్డువలస ప్రధాన కుడి కాలువ ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని ఎన్నికల ముందుకూడా ప్రజలకు హామీ ఇచ్చాన్నారని మంత్రికి గుర్తు చేశామన్నారు.అయినా నేటి వరకు మడ్డువలస సాగునీరు కోసం ఎలాంటి పనులు చేయలేదని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వెలిబుచ్చారు. గ్రామంలో సుమారు 9 వందల ఎకరాలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఆయకట్టుకూ అందని నీరు మడ్డువలస ప్రధాన కుడికాలువ ద్వారా మండలంలో ప్రస్తుతం 5,200 ఎకరాలకు సాగునీటి కాలువ ఉంది. పలుచోట్ల పిల్ల కాలువలు లేకపోవడంతో ఈ ప్రధాన కాలువ నీరు కూడా ఆయకట్టుకు అందడంలేదు. రెండోవిడతలో మండలంలో 6,500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కాలువను విస్తరించాల్సి ఉంది. మండలంలోని నాగులవలస గ్రామం వద్ద ప్రారంభమైన ఈ కాలువ 16 గ్రామాల మీదుగా నల్లిపేట చెరువు వరకూ ఉంది. ఈ కాలువ నుంచి ఖరీఫ్ ప్రారంభంలో సాగునీరు అందడం గగనం కాగా, వరి పంట కోత దశలో ఉన్న సమయంలో చివరి తడికి కూడా ఆయకట్టు రైతులకు కష్టాలే. నల్లిపేట నుంచి కప్పరాం, దేవరవలస, మంగమ్మపేట మీదుగా లావేరు మండలానికి కాలువను విస్తరించాల్సి ఉండగా మధ్యలోనే నిలిపివేశారు. -
రైతులకు అందేనా నీరు?
ఖమ్మంఅర్బన్: రైతుల పంట పొలాలకు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు(లిఫ్టులు) చాలాచోట్ల నిరుపయోగంగా మారాయి. ఆయకట్టులో పంటలు పండించాలనుకున్న రైతుల ఆశలు ఆవిరై.. జలాలందక ఎండిన పైర్లతో వీరి తలరాతలు మారని దైన్యం నెలకొంది. జిల్లాలో సాగర్ కాల్వ నీరే ఆధారం. ఈ కాల్వలపై, అడపా దడపా పారే ఏర్లపై పలుచోట్ల నిర్మించిన ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లావ్యాప్తంగా 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనేది లక్ష్యం. పైపులు, విద్యుత్ మోటార్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ లిఫ్టులు మూలనపడ్డాయి. రైతుల భాగస్వామ్యంతోనే మరమ్మతులు చేయించుకోవాల్సి ఉండడంతో..పట్టించుకునేవారు కరువయ్యారు. పంటల పెట్టుబడి, నష్టాలతోనే సాగుదారులు అవస్థ పడుతున్న క్రమంలో ఈ మరమ్మతుల వ్యయం వీరికి పెనుభారంగా మారుతోంది. చివరి భూములకు నీరందడం లేదని ఆ రైతులు విముఖత చూపుతుండడంతో మరింత నిర్లక్ష్యం నెలకొంటోంది. ఖమ్మం జిల్లాలో 135 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. 35 లిఫ్టులు పాక్షికంగా పని చేస్తుండగా.. 10,991 ఎకరాలకు నీరందుతోంది. మరో 49 ఎత్తిపోతల పథకాలు అసలు పనిచేయట్లేదు. ఇవి వ్యవసాయ భూములకు చుక్కనీరు అందించలేకపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 51 లిఫ్టుల ద్వారా 30,247 ఎకరాలకు మాత్రమే పుష్కలంగా నీరందుతోంది. మూడు కొత్త పథకాలకు రూ.29కోట్లు జిల్లాలో మూడు కొత్త లిఫ్టు ఇరిగేషన్ పథకాల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం రూ.29.41కోట్లు మంజూరు చేసింది. కల్లూరు మండలం కొర్లకుంట, మధిర మండలం మాధవీపురం, బోనకల్ మండలం రాపల్లెలో వీటిని నిర్మించనున్నారు. వీటి ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. మరమ్మతుల నిధులు ఇలా.. జిల్లాలో మూడు ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు గతంలో రూ.4.12కోట్లు మంజూరయ్యాయి. రఘునాథపాలెం మండలం జాన్‌బాద్‌తండా లిఫ్టు, కూసుమంచి మండలం నరసింహులగూడెం, చింతకాని మండలం కొదుమూరు లిఫ్ట్‌కు అదనపు పైపులైన్ల కోసం కేటాయించారు. జిల్లాలో లిఫ్టుల రిపేర్ల కోసం రూ.2కోట్లతో గతంలోనే అంచనాలు పంపినట్లు సమాచారం. మోటార్ల మరమ్మతులు, పంపు సెట్లు, పైపులైన్ల పనులు చేసే అవకాశముంది. పాలేరు నియోజకవర్గంలోని కామంచికల్ లిఫ్టు నిర్మాణానికి రూ.12కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు వెళ్లాయి. రైతుల భాగస్వామ్యం ఉండాలి.. లిఫ్టు ఇరిగేషన్ల నిర్వహణలో రైతుల భాగస్వామ్యం ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. జిల్లాలో పనిచేయని ఎత్తిపోతల పథకాల మరమ్మతు కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. కొన్నింటికి నిధులు మంజూరయ్యాయి. కొన్ని కొత్త పథకాలు కూడా వచ్చాయి. ఇంకా.. కొన్నింటి ప్రక్రియ నడుస్తోంది. రైతులంతా కలిసికట్టుగా ఉంటే.. సాగునీటి కష్టాలు తొలగుతాయి. – విద్యాసాగర్, ఐడీసీ ఈఈ -
యాంత్రీకరణకు గ్రహణం
మంత్రి ఓకే చేయలేదు... ప్రారంభం కాని రైతు రథం సాక్షి ప్రతినిధి, ఏలూరు : వ్యవసాయ శాఖలో యాంత్రీకరణకు గ్రహణం పట్టింది. ఈ ఏడాది ఖరీఫ్ పూర్తి అయ్యే దశకు చేరుకుంటున్నా ఇంతవరకూ యాంత్రీకరణ ప్రారంభం కాలేదు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి ఈ ఏడాది రూ. 110 కోట్లతో వ్యవసాయ శాఖకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యి ఆరు నెలలు గడిచినా ఇంతవరకూ ఆమోదం లేదు. గత ఏడాది కూడా కేవలం రూ. 24.56 కోట్ల రూపాయల విలువతో 4,892 మంది రైతులకు యంత్ర పరికరాలు అందచేశారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనాలు నాలుగింతలు పెంచి పంపినా ఇంతవరకూ ఆమోదానికి నోచుకోలేదు. ప్రస్తుతం రైతు రథం పథకం కింద సబ్సిడీ ట్రాక్టర్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. జిల్లాకు మొదట ఐదు వందల పైచిలుకు మంజూరు కాగా, వాటిని ఇప్పుడు 858కి పెంచారు. ఈ ప్రక్రియ మొత్తం ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉండటంతో అడుగు ముందుకు పడటం లేదు. జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేలకు లబ్ధిదారులు ఎంపిక బాధ్యత అప్పగించారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదనలను జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదించాల్సి ఉంటుంది. మొత్తం 858 ట్రాక్టర్లలో 140 ట్రాక్టర్లు 4 వీల్ రకం ఉండగా, మిగిలినవి 2 వీల్ రకం. 4 వీలర్ రకం ట్రాక్టర్లకు అదనంగా యంత్రపరికరాలు ఉంటే రూ. 2.50 లక్షలు, మామూలు వాటికి రూ. 2 లక్షలు సబ్సిడీ కాగా, 2 వీల్ ట్రాక్టర్‌కు అదనపు హంగులు ఉంటే రూ. 2 లక్షలు, మామూలు వాటికి రూ. 1.50 రూపాయల సబ్సిడీ ఉంది. వీటికి రైతుల నుంచి పోటీ ఎక్కువ ఉంది. ఎమ్మెల్యేలపై కూడా స్థానిక నాయకుల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి లబ్ధిదారుల ఎంపిక తమకు తలనొప్పిగా మారిందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే వ్యతిరేకత పెరుగుతుందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంఛార్జి మంత్రి కూడా ఈ జాబితాకు ఆమోద ముద్ర వేయకపోవడంతో రైతు రథం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రైతు రథంలో ఇచ్చే ట్రాక్టర్లు కూడా రైతు కోరుకున్న కంపెనీవి కాకుండా తమకు అనుకూలమైన వాటినే ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. అమరావతిలో మంత్రిని కలిసి అమోద ముద్ర వేయించుకున్న బ్రాండ్లకు మాత్రమే ఇందులో ఆమోదం లభించినట్లు తెలిసింది. జిల్లాలో ఎక్కువగా వినియోగించే కంపెనీలకు చెందిన ట్రాక్టర్లకు ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న ట్రాక్టర్ల బ్రాండ్లపై రైతుల్లో వ్యతిరేకత వస్తోంది. మరోవైపు వ్యవసాయ శాఖలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేరుగా వినియోగదారునికే లబ్ధి అనే పథకం కింద జిల్లాకు రూ. 23.45 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఇదివరకు ఇచ్చే సబ్సిడీ యంత్రాలకు భిన్నమైన పథకం. ఈ స్కీం ఇప్పటి వరకూ ప్రారంభించలేదు. ఇటువంటి పథకం ఒకటి ఉందన్న విషయం కూడా రైతులకు తెలియలేదు. జిల్లాలో యాంత్రీకరణ ప్రక్రియ మాత్రం ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. -
’అధికార’ దందా
అటవీ భూమిని కాజేసి..సాగులోకి.. కొంత భాగం రొయ్యల చెరువుల తవ్వకం... ఎత్తిపోతల కింద భూములు పోయినట్లుగా అక్రమ రికార్డులు పరిహారం డబ్బులు అప్పనంగా జేబులోకి... చోద్యం చూస్తున్న అధికారులు కలరాయనగూడెంలో టీడీపీ నేత భూబాగోతం సాక్షి ప్రతినిధి, ఏలూరు: అయన అధికార పక్ష నాయకుడు... ఓ పదవి కోసం పోటీలో ఉన్నారు...ఆ చుట్టుపక్కల ఆయన మాటే శాసనం... దీంతో ఆయన చెలరేగిపోయారు. తన భూముల పక్కన ఉన్న అటవీ శాఖ భూములను కూడా తన పొలంలో కలిపేసుకున్నారు... అందులో రొయల్య చెరువుతో పాటు పామాయిల్ తోటలను కూడా వేసుకున్నారు.... చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ తన పొలాల పక్కనే ఉన్న అటవీ శాఖ భూమిలో నుంచి వెళ్తోంది. దీన్ని కూడా సొమ్ము చేసుకోవాలనుకున్న ఆ నేత రెవెన్యూ అధికారులను ఉపయోగించి అది తన సొంత భూములు ఉన్న సర్వే నెంబర్‌గా చూపించి నష్టపరిహారం కూడా కొట్టేయడానికి ప్లాన్ చేశారు. లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత తన కుటుంబ సభ్యులు కలసి గత కొన్నేళ్లుగా ఆర్ఎస్ నెంబరు 269 అటవీ భూమిలో సుమారు 18 ఎకరాలు సాగుచేస్తున్నారు. ఈ భూమికి పక్కనే ఆర్ఎస్ నెంబరు 264/3, 264/4లో ఈ నేతకు సొంత జిరాయితీ భూమి ఉంది. ఈ భూమికి పక్కనే తాను ఆక్రమించుకున్న అటవీ శాఖ భూముల గుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వెళ్లింది. అటవీ భూములకు నష్టపరిహారం రాదు. దీంతో తన సొంత భూమి ఉన్న ఆర్ఎస్ నెంబర్లో కొంత భూమి కాల్వకు పోయినట్లుగా చూపిస్తున్నారు. రెవిన్యూ సిబ్బంది కుమ్మక్కు కావడంతో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్లో అటవీ భూమి అని కాకుండా దాని పక్కన ఉన్న సర్వే నెంబర్లను నోటిఫికేషన్లో ఇచ్చింది. కలరాయనగూడెంలో ఇటీవల చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా సర్వేచేసి, భూసేకరణ చేసి నోటిఫికేషన్ ఇచ్చింది. వాస్తవంగా జరుగుతున్న భూసేకరణకు, నోటిఫికేషన్లో ప్రకటించిన భూమి విస్తీర్ణానికి సంబంధించి చాలా అవకతవకలు జరిగినట్లు ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. కాలువకు సంబంధించి భూసేకరణ కోసం సర్వే అధికారులు వచ్చి కొలతలు నిర్వహించారు. ఆ సమయంలో ఈ నాయకుడు అటవీ భూమిలో అనుమతులు లేకుండా గత కొన్నేళ్లుగా రెండు చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్న విషయాన్ని గుర్తించినా వారు అధికార పార్టీ నేత కావడంతో మౌనంగా ఉండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. అటవీ శాఖ భూమిలో అక్రమంగా తవ్విన రొయ్యల చెరువులకు ప్రభుత్వం వారు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. సింగల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి 24 గంటలపాటు నీటిని మోటార్‌తో తోడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదు. రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ శాఖలకు చెందిన స్ధానిక అధికారులకు ఈ నేతతో మంచి సంబంధాలు ఉండటంతో ఇక్కడ అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ భూ బాగోతాలపై సమగ్ర విచారణ జరిపించి అక్రమంగా సాగుచేస్తున్న అటవీ భూములతోపాటు ఎత్తిపోతల పథకం కాలువకు సంబంధించి సొమ్మును కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
చి’వరి’లో కలవరం
మార్చి 29 నాటికి కాలువలకు నీరు నిలిపివేత కలెక్టర్ ప్రకటనతో అన్నదాతల్లో ఆందోళన 80వేల ఎకరాలకు నీరందడం గగనమే! మార్చి నెలాఖరు నాటికి పంట కాలువలకు నీరు నిలిపివేస్తామంటూ కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేసిన ప్రకటన అన్నదాతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఇప్పటికే తీవ్ర సాగునీటి ఎద్దడి ఉన్నా.. అష్టకష్టాలు పడి పంటలను బతికించుకున్న రైతులు ఇప్పుడు పూర్తిగా నీరు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటా అని మదనపడుతున్నారు. ఏప్రిల్ 15వరకూ నీటి విడుదలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కొవ్వూరు : పశ్చిమ డెల్టా ప్రాంతంలో ఇప్పటికే రైతులు తీవ్ర సాగునీటి ఎద్దడితో తల్లడిల్లుతున్నారు. అధికారులు వంతులవారీ విధానం అమలు చేస్తున్నా.. అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. రాత్రింబవళ్లు చేల వద్దే పడిగాపులు కాసి పంటలను కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అత్తిలి మండలంలో చుక్కనీరు అందక పొలాలు బీటలువారుతుంటే పాలకోడేరు మండలంలో నీటి ఎద్దడిని తాళలేక రైతులు పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. కాళ్ల, ఆకివీడు, ఉండి, మొగల్తూరు, గణపవరం మండలాల్లోని కొన్ని గ్రామాలల్లోనూ నీటి తడులు అందక అన్నదాతలు సతమతమవుతున్నారు. ఏప్రిల్ 15 వరకూ తడులు అవసరం జిల్లాలో పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలో 4.60లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీటి ఇబ్బందుల దృష్ట్యా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 11వేల హెక్టార్లు(27,500 ఎకరాలు) చేపల చెరువులుగా మారిపోయాయి. ఇంకా మిగిలిన 4.33 లక్షల ఎకరాల్లో డిసెంబర్ నెలాఖరు నాటికి అరవై శాతం నాట్లు పడినట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన ఆయకట్టులో జనవరి 15లోపు ఇరవై శాతం, అదే నెలాఖరులోపు మరో ఇరవై శాతం నాట్లు పడినట్టు సమాచారం. దాళ్వాలో వరిసాగు కాలం 110 నుంచి 120 రోజులు. దీనిలో 80వ రోజు నుంచి 95రోజుల మధ్య గింజపాలు పోసుకుని గట్టిపడే దశలో ఉంటుంది. ఈ సమయంలో నీరు అధికంగా అవసరం. నాట్లు పడిన తీరు ప్రకారం చూస్తే ఏప్రిల్ 15వ తేదీ వరకు చేలకు నీటితడుల అవసరం. అయితే 15 రోజులకు ముందే (మార్చినెలాఖరుకు) కాలువలకు నీటి విడుదలను నిలిపివేస్తే పంట కీలక దశలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతికి నాట్లు పడిన ఆయకట్టులో మార్చి నెలాఖరులో చివరి తడిపెడితే పంట గట్టెక్కినట్టేనని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే సంక్రాంతి తర్వాత సుమారు 80వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఈ ఆయకట్టుకు ఏప్రిల్ 15 వరకు నీరు అందించాల్సి ఉంది. కనీసం పది నుంచి పదిహేను శాతం ఆయకట్టుకు ఏప్రిల్ మొదటి వారంలో నీటితడులు ఇవ్వాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చినెలాఖరు నాటికి కాలువలు కట్టేయడం శ్రేయస్కరం కాదనే వాదన సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. చెరువులు నింపితే మరింత జఠిలం ఇదిలాఉంటే ఈఏడాది వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 35 డీగ్రీలు దాటాయి. దీంతో మార్చి 13 నుంచే జిల్లాలో ఉన్న 441 తాగునీటి చెరువులన్నీ పూర్తిస్థాయిలో నింపుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఇప్పటికే సాగునీటికి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మంచినీటి చెరువులు నింపితే సాగుకు నీటిఎద్దడి మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరిలోనూ అదే దుస్థితి ఎన్నడూ లేనిది ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం 13.11 అడుగులకు పడిపోయింది. ఒక వైపు సీలేరు నుంచి నీటి విడుదలను భారీగా పెంచినా సహజ జలాల లభ్యత పడిపోవడంతో నీటిమట్టం తగ్గిపోతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం పంటలు పాలు పోసుకునే, గింజపోసుకునే దశల్లో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఈనిక దశలో ఉన్నాయి. దీంతో నీటి వినియోగం పెరిగింది. ఈ దశలో మడిలో ఐదు సెంటీ మీటర్ల నీరు ఉండాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సీలేరు నుంచి 6,500 క్యూసెక్కుల నుంచి ఏడు వేల క్యూసెక్కులు వరకు వదులుతున్నా.. నీరు ఆవిరిరూపంలో కొంత వృథా అవుతోంది. దీంతో ఉండాల్సిన మేరకు చేలల్లో నీరు నిలచి ఉండడం లేదు. దీనికితోడు గత వారం నుంచి ఎండల తీవ్రత పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో గోదావరిలో నీటిమట్టం పడిపోతుండడం అటు అధికారుల్లోనూ, ఇటు రైతుల్లోనూ ఆందోళన రేపుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఈనెల 2న 13.20 మీటర్లున్న నీటిమట్టం క్రమేణా తగ్గుముఖం పట్టింది. ఆధునీకరణ పనుల పూర్తి కావాలని లక్ష్యం: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 80 డెల్టా ఆధునీకరణ పనుల్లో 18 పనులు మాత్రమే పూర్తయినందున ఈ సీజన్లో మిగిలిన 62 పనులు పూర్తి చేయాల్సి ఉంది.ఎనిమిది చోట్ల పాత షటర్ల స్ధానంలో కొత్త షటర్లు అమర్చాలని అధికారులు చెబుతున్నారు.మార్చి నెలాఖరు నాటికి కాలువలకు నీటివిడుదల నిలిపివేస్తే తప్పా ఈపనులు పూర్తి చేసే పరిస్ధితి ఉండదని అధికారులు భావిస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరిలో నీటిమట్టం గడిచిన వారం రోజుల నుంచి 13.20 మీటర్లు వద్ద నిలకడగా ఉంది. మూడు రోజుల నుంచి నీటి విడుదల నుంచి స్వల్పంగా పెంచడంతో నీటిమట్టం పడిపోతుంది.నాలుగురోజు నుంచి డౌన్‌పాల్ ప్రారంభమైంది. గత నాలుగు రోజుల్లో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం వివరాలు తేదీ నీటిమట్టం మార్చి 2న 13.20 మీటర్లు మార్చి 3న 13.17 మార్చి 4న 13.14 మార్చి 5న 13.11 మీటర్లు ............................................................ -
నీటి కష్టాలపై కస్సుబస్సులు
అడ్డుకట్టలు వేయాలనే ప్రతిపాదనలపై వాదోపవాదాలు వాడీవేడిగా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ సమావేశం తణుకు టౌన్ : సాగునీటి సరఫరాలో వంతులవారీ విధానం వల్ల ఏర్పడుతున్న సమస్యలు.. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తణుకు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ సమావేశం వాడీవేడిగా సాగింది. కాలువలకు, డ్రెయిన్లకు అవసరమైన చోట్ల అడ్డుకట్టలు నిర్మించాలనే ప్రతిపాదనలపై డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ల నుంచి విభిన్న వాదనలు వినిపించాయి. వాదోపవాదాల నడుమ సమావేశం వేడెక్కింది. కాలువలపై అడ్డుకట్టలు నిర్మించాలని కొందరు.. అడ్డుకట్టలు వేస్తే తమ ప్రాంత రైతులు నష్టపోతారని మరికొందరు వాదులాడుకున్నారు. అత్తిలి, భీమవరం ప్రాంతాల్లో నీటి ఎద్దడి పొంచివుందని, అత్తిలి కాలువలో నీటిమట్టాలను పెంచాలంటే.. ఏలూరు కాలువకు నందమూరు అక్విడెక్ట్ వద్ద అడ్డుకట్ట నిర్మించాలని అత్తిలి, భీమవరం నీటి పంపిణీ సంఘాల అధ్యక్షులు కోరారు. అక్కడ అడ్డుకట్ట నిర్మించేందుకు ఎక్కువ కాలం పడుతుందని, దానివల్ల ప్రయోజనం ఏముంటుందని తాడేపపల్లిఽగూడెం, గుండుగొలను నీటి పంపిణీ సంఘాల అధ్యక్షులు ప్రశ్నించారు. దీంతో దిగువ డెల్టా, ఎగువ డెల్టా ప్రాంతాలకు చెందిన అధ్యక్షుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీనిపై పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పొత్తూరి రామాంజనేయరాజు మాట్లాడుతూ నందమూరు వద్ద ఏలూరు కాలువ వెడల్పు 36 మీటర్లు ఉందని, ఇందులో 14 మీటర్ల మేర మాత్రమే రింగ్ బండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ఏడాది తలెత్తిన నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత సీజన్లో ఆ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించేందుకు అడ్డుకట్టలు నిర్మిస్తున్నామన్నారు. ఇందుకు తాడేపల్లిగూడెం, గుండుగొలను నీటి పంపిణీ సంఘాల అధ్యక్షులు చైర్మన్లు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. ఇది సాంకేతిక అంశం కాబట్టి అధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ప్రకటించారు. గుండుగొలను నీటి పంపిణీ సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ అడ్డుకట్ట వేసినా.. వేయకపోయినా గుండుగొలను వద్ద కాలువ నీటిమట్టం 5 అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలువలకు సీలేరు జలాలతో పాటు కర్ర నాచు కూడా చేరిందని, ఈ కారణంగా ప్రవాహం సాఫీగా సాగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాలువలలో పడవల ప్రయాణం జరిగితే కర్ర నాచు దానంతట అదే తొలగిపోతుందని, సాగునీటి కాలువలల్లో పడవలు తిరిగేలా చూడాలని కోరారు. పశ్చిమ డెల్టాకు అదనంగా మరో 3 వేల క్యూసెక్కుల నీటిని అందించాలని కోరుతూ తీర్మానం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఏలూరు ఆర్డీఓ జి.చక్రధరరావు, ఇరిగేషన్ ఎస్ఈ కె.శ్రీనివాస్, నిడదవోలు ఈఈ జి.శ్రీనివాస్, డీఈఈ కె.శివప్రసాద్ పాల్గొన్నారు. అడ్డుకట్టల వల్ల నష్టపోతాం అత్తిలి, ఏలూరు కాలువ మధ్యలో అడ్డుకట్ట వేస్తే ఏలూరు కాలువకు నీటి ప్రవాహం తగ్గిపోతుంది. దాళ్వా పంటకు పూర్తి స్థాయిలో సాగునీరందిస్తామని, వంతుల వారీ విధానం, అడ్డుకట్టలు ఉండవని కలెక్టర్ మొదట్లో చెప్పారు. ఏలూరు కాలువ నందమూరు వద్ద వెడల్పు 36 మీటర్లు ఉన్నప్పటికీ.. కిలోమీటరు దిగువన 14 మీటర్లుకు తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో ఇక్కడ అడ్డుకట్ట వేస్తే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. అడ్డు కట్ట వేస్తే ఏలూరు కాలువపై ఆధారపడిన సాగు భూములకు సాగు నీటికి ఇబ్బందులు తప్పవు. కేపీఎస్వీ ప్రసాదరావు, తాడేపల్లిగూడెం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ 4,500 క్యూసెక్కుల నీరు పెంచాలి దాళ్వాకు 4,500 క్యూసెక్కులకు నీటి ప్రవాహాన్ని పెంచాలి. ఇప్పటివరకూ ఇస్తామన్న నీటిని అధికారులు చెప్పిన ప్రకారం విడుదల చేయలేదు. గుండుగొలను వద్ద ఏలూరు కాలువలో నీటిమట్టం 5 అడుగులు ఉండేలా చూస్తే ఈ ప్రాంత రైతులకు ఇబ్బందులు తీరతాయి. గంధం లక్ష్మణరావు, గుండుగొలను డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అడ్డుకట్ట నిర్మించాల్సిందే ఏలూరు కాలువకు అడ్డుకట్ట వేస్తేనే అత్తిలి కాలువ శివారున ఉన్న ఈడూరు, కంచుమర్రు, కొండేపాడు, కొమ్మర గ్రామాల్లోని పొలాలకు సాగునీరందుతుంది. ఏలూరు కాలువపై నందమూరు వద్ద రింగ్ బండ్ నిర్మించాలి. దీనిని ఏర్పాటు చేస్తేనే అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందుతుంది. నల్లూరు చిన్ని, అత్తిలి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కర్రనాచు తొలగించాలి కాలువల్లో పేరుకుపోయిన కర్ర నాచు కారణంగా నీటి ప్రవాహం తగ్గిపోతోంది. సీలేరు జలాల కారణంగా డెల్టా కాలువల్లో కర్ర నాచు పెరిగిపోయింది. దీనిని తొలగించేందుకు ఉపాధి హామీ పథకం నిబంధనలు సడలిస్తే నీటి సంఘాలకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. జంక్షన్ కెనాల్లో కర్రనాచు కారణంగా దిగువన 7 వేల ఎకరాలు, మధ్యలో 14 వేల ఎకరాలకు సాగు నీరు అందడం కష్టంగా ఉంది. బూరుగుపల్లి వెంకట త్రినాథరావు, పెంటపాడు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ -
సాగు ఆగుతోంది
బ్యాంకు ఖాతాల్లో నగదున్నా చేతికందని దుస్థితి నెలాఖరు నాటికి నాట్లు వేయాలని లక్ష్యం నేటికీ నారుమడులు కూడా వేయలేని పరిస్థితి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటున్న రైతు సంఘాలు పోడూరు, మొగల్తూరు మండలాల్లో సాగు విరామానికి సిద్ధమైన రైతులు పెనుగొండ : వరి నాట్లు పూర్తి చేయాల్సిన తరుణం తరుముకొస్తోంది. మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో కాలువలకు నీటి విడుదల నిలిపివేసే పరిస్థితి ఉన్న దృష్ట్యా డిసెంబర్ నెలాఖరు నాటికి నాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పదేపదే చెబుతున్నారు. లేదంటే దాళ్వా సాగు గట్టెక్కడం కష్టమని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే డిసెంబర్ నెలాఖరు కాదు కదా.. కనీసం జనవరి నెలాఖరు నాటికైనా నాట్లు వేసే అవకాశం లేదు. ఎందుకంటే.. చాలామంది రైతులు నారుమడులే వేయలేదు. ఇప్పటికిప్పుడు నారుమడులు వేసినా.. నెల రోజులపాటు నారు పెంచాల్సి ఉంటుంది. ఏదోలా కష్టపడి నెలాఖరు నాటికి నారుపోస్తే.. జనవరి నెలాఖరు నాటికి గాని నాట్లు వేయలేని పరిస్థితి. రైతుల బ్యాంకు ఖాతాల్లో తగినంత నగదు నిల్వలు ఉన్నా.. చేతికందటం లేదు. పెట్టుబడులకు సొమ్ముల్లేక.. ఎక్కడా అప్పు కూడా పుట్టని పరిస్థితుల్లో పంట వేయాలో మానాలో నిర్ణయించుకోలేక అన్నదాతలు డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గడువు ముగిసిపోయాక నాట్లు వేసినా నీటి కొరత ఏర్పడి పంట ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో చాలాచోట్ల దాళ్వా వరిసాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాగు లక్ష్యం 4.50 లక్షల ఎకరాలు ప్రస్తుత దాళ్వాలో జిల్లాలోని మెట్ట, డెల్టా ప్రాంతాల్లో 4.50 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుంది. మొత్తం విస్తీర్ణానికి సరిపోయేలా 8,300 ఎకరాల్లో రైతులు నారుమడులు వేయాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు కనీసం సగం విస్తీర్ణంలో అయినా నారుమడులు పడలేదు. డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి మొదటి వారానికి పూర్తి విస్తీర్ణంలో నాట్లు పడతాయని, రైతులు ఈ లక్ష్యానికి అనుగుణంగా నాట్లు వేసేలా ఎక్కడికక్కడ చైతన్యపరుస్తున్నామని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. 90 శాతం విస్తీర్ణంలో నారుమడులు పడినట్టు వ్యవసాయ శాఖ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బ్యాంకుల్లో నగదు ఉన్నా.. సాగు ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు అల్లాడుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మాసూలు చేసిన పంటను అమ్మినా చేతికి మాత్రం నగదు అందడం లేదు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేసి రోజంతా వేచి చూస్తే 10 రోజులకు చేతికి కేవలం రూ.10వేలు మాత్రమే వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారుమడులకు కనీస పెట్టుబడులు లేవని వాపోతున్నారు. విత్తనాలు కొనుగోలు, దమ్ములు చేయడానికి అప్పులు చేద్దామన్నా ఇచ్చేవాళ్లు కరువయ్యారని చెబుతున్నారు. నగదు కొరతతో అప్పులు సైతం పుట్టడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు సాగడం కష్టసాధ్యమేనని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఽప్రత్యామ్నయ మార్గాలు చూపాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. 25 ఎకరాల సాగుకు రూ.25 వేలు అందాయి నానాకష్టాలు పడి 25 ఎకరాలు సాగు చేశాను. ధాన్యం అమ్మితే చేతికి రూ.25 వేలు మాత్రమే వచ్చాయి. దాళ్వా పెట్టుబడులకు కనీసం లక్ష రూపాయలు కావాలి. సార్వా పెట్టుబడుల కోసం అప్పులు ఇంకా తీర్చలేదు. నగదు లేక నారుమడులు వేయలేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. చిన్నం చినవెంకటరెడ్డి, చిన్నంవారి పాలెం, రైతు ఆదుకోకపోతే కష్టమే రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే సాగు చేయడం కష్టమే. బ్యాంకుల్లో రూ.2 వేలు ఇచ్చి సరిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయడం దుర్లభం. పట్టాదారు పుస్తకాల ఆధారంగాను, కౌలు రైతుల గుర్తింపు కార్డుల ఆధారంగాను బ్యాంకుల్లో జమైన నగదు మొత్తం రైతులకు అందించే ఏర్పాట్లు చేయాలి. పి.సత్యనారాయణ, రైతు, జాంపేట -
ఎల్ఎండీ దిగువకు నీటి విడుదల
పది రోజులు విడుదల చేస్తాం ఎస్సారెస్పీ సీఈ శంకర్ తిమ్మాపూర్ : లోయర్ మానేరు డ్యాం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువకు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఎల్ఎండీ నుంచి హెడ్ రెగ్యులేటరీ వద్ద కాకతీయ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని ఏఈలు కాళిదాసు, రాంబాబు, శ్రావణ్ విడుదల చేశారు. రాత్రి వరకు వెయ్యి క్యూసెక్కులకు పెంచుతామని తెలిపారు. సీఈ శంకర్ ఫోన్లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు సాగు, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున పది రోజులు ఒక టీఎంసీ నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఎల్ఎండీ దిగువన రైతులు వేసుకున్న పంటలు వర్షాలు లేక ఎండిపోతున్న దృష్ట్యా ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 1075.10 అడుగులు (39.953 టీఎంసీలు) నీరు ఉండగా 693 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉందన్నారు. ఎల్ఎండీలో 889.30 అడుగులు (5.741 టీఎంసీలు) నీటి మట్టం ఉండగా 119 క్యూసెక్కులు తాగునీటికి, వెయ్యి క్యూసెక్కులు ఎల్ఎండీ దిగువకు విడుదల చేసినట్లు వివరించారు. నీటి విడుదల కార్యక్రమంలో మానకొండూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాడ తిరుపతిరెడ్డి, ఎల్ఎండీ వర్క్ ఇన్స్పెక్టర్ లక్షా్మరెడ్డి, ఆపరేటర్ దుర్గారెడ్డి పాల్గొన్నారు. 2015 ఫిబ్రవరిలో... ఎల్ఎండీ నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ఆయకట్టుకు 2015, ఫిబ్రవరి 21న చివరిసారి నీటిని విడుదల చేశారు. అప్పుడు ఎల్ఎండీలో 7.91 టీఎంసీల నీటి మట్టం ఉండగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన ఏప్రిల్ 6వ తేదీ వరకు నీటిని వదిలారు. 4.4 టీఎంసీల వద్ద నిలిపివేశారు. గతేడాది మే నెలాఖరున వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం హెడ్ రెగ్యులేటర్ సమీపంలో నీటి నిల్వ చేసేందుకు మూడు రోజులు రోజుకు 300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. తాజాగా ఆదివారం తాగు, సాగునీటి అవసరాలకు నీటిని వదిలారు.