యాంత్రీకరణకు గ్రహణం
Published Wed, Sep 6 2017 12:46 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
మంత్రి ఓకే చేయలేదు...
ప్రారంభం కాని రైతు రథం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
వ్యవసాయ శాఖలో యాంత్రీకరణకు గ్రహణం పట్టింది. ఈ ఏడాది ఖరీఫ్ పూర్తి అయ్యే దశకు చేరుకుంటున్నా ఇంతవరకూ యాంత్రీకరణ ప్రారంభం కాలేదు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి ఈ ఏడాది రూ. 110 కోట్లతో వ్యవసాయ శాఖకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యి ఆరు నెలలు గడిచినా ఇంతవరకూ ఆమోదం లేదు. గత ఏడాది కూడా కేవలం రూ. 24.56 కోట్ల రూపాయల విలువతో 4,892 మంది రైతులకు యంత్ర పరికరాలు అందచేశారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనాలు నాలుగింతలు పెంచి పంపినా ఇంతవరకూ ఆమోదానికి నోచుకోలేదు. ప్రస్తుతం రైతు రథం పథకం కింద సబ్సిడీ ట్రాక్టర్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. జిల్లాకు మొదట ఐదు వందల పైచిలుకు మంజూరు కాగా, వాటిని ఇప్పుడు 858కి పెంచారు. ఈ ప్రక్రియ మొత్తం ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉండటంతో అడుగు ముందుకు పడటం లేదు. జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేలకు లబ్ధిదారులు ఎంపిక బాధ్యత అప్పగించారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదనలను జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదించాల్సి ఉంటుంది. మొత్తం 858 ట్రాక్టర్లలో 140 ట్రాక్టర్లు 4 వీల్ రకం ఉండగా, మిగిలినవి 2 వీల్ రకం. 4 వీలర్ రకం ట్రాక్టర్లకు అదనంగా యంత్రపరికరాలు ఉంటే రూ. 2.50 లక్షలు, మామూలు వాటికి రూ. 2 లక్షలు సబ్సిడీ కాగా, 2 వీల్ ట్రాక్టర్‌కు అదనపు హంగులు ఉంటే రూ. 2 లక్షలు, మామూలు వాటికి రూ. 1.50 రూపాయల సబ్సిడీ ఉంది. వీటికి రైతుల నుంచి పోటీ ఎక్కువ ఉంది. ఎమ్మెల్యేలపై కూడా స్థానిక నాయకుల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి లబ్ధిదారుల ఎంపిక తమకు తలనొప్పిగా మారిందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే వ్యతిరేకత పెరుగుతుందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంఛార్జి మంత్రి కూడా ఈ జాబితాకు ఆమోద ముద్ర వేయకపోవడంతో రైతు రథం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రైతు రథంలో ఇచ్చే ట్రాక్టర్లు కూడా రైతు కోరుకున్న కంపెనీవి కాకుండా తమకు అనుకూలమైన వాటినే ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. అమరావతిలో మంత్రిని కలిసి అమోద ముద్ర వేయించుకున్న బ్రాండ్లకు మాత్రమే ఇందులో ఆమోదం లభించినట్లు తెలిసింది. జిల్లాలో ఎక్కువగా వినియోగించే కంపెనీలకు చెందిన ట్రాక్టర్లకు ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న ట్రాక్టర్ల బ్రాండ్లపై రైతుల్లో వ్యతిరేకత వస్తోంది. మరోవైపు వ్యవసాయ శాఖలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేరుగా వినియోగదారునికే లబ్ధి అనే పథకం కింద జిల్లాకు రూ. 23.45 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఇదివరకు ఇచ్చే సబ్సిడీ యంత్రాలకు భిన్నమైన పథకం. ఈ స్కీం ఇప్పటి వరకూ ప్రారంభించలేదు. ఇటువంటి పథకం ఒకటి ఉందన్న విషయం కూడా రైతులకు తెలియలేదు. జిల్లాలో యాంత్రీకరణ ప్రక్రియ మాత్రం ముందుకు కదలని పరిస్థితి నెలకొంది.
Advertisement