చి’వరి’లో కలవరం
చి’వరి’లో కలవరం
Published Sun, Mar 5 2017 10:55 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
మార్చి 29 నాటికి కాలువలకు నీరు నిలిపివేత
కలెక్టర్ ప్రకటనతో అన్నదాతల్లో ఆందోళన
80వేల ఎకరాలకు నీరందడం గగనమే!
మార్చి నెలాఖరు నాటికి పంట కాలువలకు నీరు నిలిపివేస్తామంటూ కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేసిన ప్రకటన అన్నదాతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఇప్పటికే తీవ్ర సాగునీటి ఎద్దడి ఉన్నా.. అష్టకష్టాలు పడి పంటలను బతికించుకున్న రైతులు ఇప్పుడు పూర్తిగా నీరు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటా అని మదనపడుతున్నారు. ఏప్రిల్ 15వరకూ నీటి విడుదలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కొవ్వూరు :
పశ్చిమ డెల్టా ప్రాంతంలో ఇప్పటికే రైతులు తీవ్ర సాగునీటి ఎద్దడితో తల్లడిల్లుతున్నారు. అధికారులు వంతులవారీ విధానం అమలు చేస్తున్నా.. అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. రాత్రింబవళ్లు చేల వద్దే పడిగాపులు కాసి పంటలను కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అత్తిలి మండలంలో చుక్కనీరు అందక పొలాలు బీటలువారుతుంటే పాలకోడేరు మండలంలో నీటి ఎద్దడిని తాళలేక రైతులు పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. కాళ్ల, ఆకివీడు, ఉండి, మొగల్తూరు, గణపవరం మండలాల్లోని కొన్ని గ్రామాలల్లోనూ నీటి తడులు అందక అన్నదాతలు సతమతమవుతున్నారు.
ఏప్రిల్ 15 వరకూ తడులు అవసరం
జిల్లాలో పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలో 4.60లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీటి ఇబ్బందుల దృష్ట్యా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 11వేల హెక్టార్లు(27,500 ఎకరాలు) చేపల చెరువులుగా మారిపోయాయి. ఇంకా మిగిలిన 4.33 లక్షల ఎకరాల్లో డిసెంబర్ నెలాఖరు నాటికి అరవై శాతం నాట్లు పడినట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన ఆయకట్టులో జనవరి 15లోపు ఇరవై శాతం, అదే నెలాఖరులోపు మరో ఇరవై శాతం నాట్లు పడినట్టు సమాచారం. దాళ్వాలో వరిసాగు కాలం 110 నుంచి 120 రోజులు. దీనిలో 80వ రోజు నుంచి 95రోజుల మధ్య గింజపాలు పోసుకుని గట్టిపడే దశలో ఉంటుంది. ఈ సమయంలో నీరు అధికంగా అవసరం. నాట్లు పడిన తీరు ప్రకారం చూస్తే ఏప్రిల్ 15వ తేదీ వరకు చేలకు నీటితడుల అవసరం. అయితే 15 రోజులకు ముందే (మార్చినెలాఖరుకు) కాలువలకు నీటి విడుదలను నిలిపివేస్తే పంట కీలక దశలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతికి నాట్లు పడిన ఆయకట్టులో మార్చి నెలాఖరులో చివరి తడిపెడితే పంట గట్టెక్కినట్టేనని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే సంక్రాంతి తర్వాత సుమారు 80వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఈ ఆయకట్టుకు ఏప్రిల్ 15 వరకు నీరు అందించాల్సి ఉంది. కనీసం పది నుంచి పదిహేను శాతం ఆయకట్టుకు ఏప్రిల్ మొదటి వారంలో నీటితడులు ఇవ్వాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చినెలాఖరు నాటికి కాలువలు కట్టేయడం శ్రేయస్కరం కాదనే వాదన సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.
చెరువులు నింపితే మరింత జఠిలం
ఇదిలాఉంటే ఈఏడాది వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఇప్పటికే జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 35 డీగ్రీలు దాటాయి. దీంతో మార్చి 13 నుంచే జిల్లాలో ఉన్న 441 తాగునీటి చెరువులన్నీ పూర్తిస్థాయిలో నింపుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఇప్పటికే సాగునీటికి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మంచినీటి చెరువులు నింపితే సాగుకు నీటిఎద్దడి మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గోదావరిలోనూ అదే దుస్థితి
ఎన్నడూ లేనిది ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం 13.11 అడుగులకు పడిపోయింది. ఒక వైపు సీలేరు నుంచి నీటి విడుదలను భారీగా పెంచినా సహజ జలాల లభ్యత పడిపోవడంతో నీటిమట్టం తగ్గిపోతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం పంటలు పాలు పోసుకునే, గింజపోసుకునే దశల్లో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఈనిక దశలో ఉన్నాయి. దీంతో నీటి వినియోగం పెరిగింది. ఈ దశలో మడిలో ఐదు సెంటీ మీటర్ల నీరు ఉండాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సీలేరు నుంచి 6,500 క్యూసెక్కుల నుంచి ఏడు వేల క్యూసెక్కులు వరకు వదులుతున్నా.. నీరు ఆవిరిరూపంలో కొంత వృథా అవుతోంది. దీంతో ఉండాల్సిన మేరకు చేలల్లో నీరు నిలచి ఉండడం లేదు. దీనికితోడు గత వారం నుంచి ఎండల తీవ్రత పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో గోదావరిలో నీటిమట్టం పడిపోతుండడం అటు అధికారుల్లోనూ, ఇటు రైతుల్లోనూ ఆందోళన రేపుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఈనెల 2న 13.20 మీటర్లున్న నీటిమట్టం క్రమేణా తగ్గుముఖం పట్టింది.
ఆధునీకరణ పనుల పూర్తి కావాలని లక్ష్యం:
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 80 డెల్టా ఆధునీకరణ పనుల్లో 18 పనులు మాత్రమే పూర్తయినందున ఈ సీజన్‌లో మిగిలిన 62 పనులు పూర్తి చేయాల్సి ఉంది.ఎనిమిది చోట్ల పాత షటర్ల స్ధానంలో కొత్త షటర్లు అమర్చాలని అధికారులు చెబుతున్నారు.మార్చి నెలాఖరు నాటికి కాలువలకు నీటివిడుదల నిలిపివేస్తే తప్పా ఈపనులు పూర్తి చేసే పరిస్ధితి ఉండదని అధికారులు భావిస్తున్నారు.
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరిలో నీటిమట్టం గడిచిన వారం రోజుల నుంచి 13.20 మీటర్లు వద్ద నిలకడగా ఉంది. మూడు రోజుల నుంచి నీటి విడుదల నుంచి స్వల్పంగా పెంచడంతో నీటిమట్టం పడిపోతుంది.నాలుగురోజు నుంచి డౌన్‌పాల్ ప్రారంభమైంది.
గత నాలుగు రోజుల్లో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం వివరాలు
తేదీ నీటిమట్టం
మార్చి 2న 13.20 మీటర్లు
మార్చి 3న 13.17
మార్చి 4న 13.14
మార్చి 5న 13.11 మీటర్లు
............................................................
Advertisement