ఎల్‌ఎండీ దిగువకు నీటి విడుదల
-
పది రోజులు విడుదల చేస్తాం
-
ఎస్సారెస్పీ సీఈ శంకర్
తిమ్మాపూర్ : లోయర్ మానేరు డ్యాం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువకు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఎల్‌ఎండీ నుంచి హెడ్ రెగ్యులేటరీ వద్ద కాకతీయ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని ఏఈలు కాళిదాసు, రాంబాబు, శ్రావణ్ విడుదల చేశారు. రాత్రి వరకు వెయ్యి క్యూసెక్కులకు పెంచుతామని తెలిపారు. సీఈ శంకర్ ఫోన్‌లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు సాగు, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున పది రోజులు ఒక టీఎంసీ నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఎల్‌ఎండీ దిగువన రైతులు వేసుకున్న పంటలు వర్షాలు లేక ఎండిపోతున్న దృష్ట్యా ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 1075.10 అడుగులు (39.953 టీఎంసీలు) నీరు ఉండగా 693 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉందన్నారు. ఎల్‌ఎండీలో 889.30 అడుగులు (5.741 టీఎంసీలు) నీటి మట్టం ఉండగా 119 క్యూసెక్కులు తాగునీటికి, వెయ్యి క్యూసెక్కులు ఎల్‌ఎండీ దిగువకు విడుదల చేసినట్లు వివరించారు. నీటి విడుదల కార్యక్రమంలో మానకొండూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాడ తిరుపతిరెడ్డి, ఎల్‌ఎండీ వర్క్ ఇన్‌స్పెక్టర్ లక్షా్మరెడ్డి, ఆపరేటర్ దుర్గారెడ్డి పాల్గొన్నారు.
2015 ఫిబ్రవరిలో...
ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ఆయకట్టుకు 2015, ఫిబ్రవరి 21న చివరిసారి నీటిని విడుదల చేశారు. అప్పుడు ఎల్‌ఎండీలో 7.91 టీఎంసీల నీటి మట్టం ఉండగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన ఏప్రిల్ 6వ తేదీ వరకు నీటిని వదిలారు. 4.4 టీఎంసీల వద్ద నిలిపివేశారు. గతేడాది మే నెలాఖరున వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం హెడ్ రెగ్యులేటర్ సమీపంలో నీటి నిల్వ చేసేందుకు మూడు రోజులు రోజుకు 300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. తాజాగా ఆదివారం తాగు, సాగునీటి అవసరాలకు నీటిని వదిలారు.