సాగు ఆగుతోంది | saagu agutomdi | Sakshi
Sakshi News home page

సాగు ఆగుతోంది

Published Fri, Dec 23 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

సాగు ఆగుతోంది

సాగు ఆగుతోంది

బ్యాంకు ఖాతాల్లో నగదున్నా చేతికందని దుస్థితి
 నెలాఖరు నాటికి నాట్లు వేయాలని లక్ష్యం
 నేటికీ నారుమడులు కూడా వేయలేని పరిస్థితి
 ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటున్న రైతు సంఘాలు
 పోడూరు, మొగల్తూరు మండలాల్లో సాగు విరామానికి సిద్ధమైన రైతులు
 
 
 
పెనుగొండ :
వరి నాట్లు పూర్తి చేయాల్సిన తరుణం తరుముకొస్తోంది. మార్చి లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో కాలువలకు నీటి విడుదల నిలిపివేసే పరిస్థితి ఉన్న దృష్ట్యా డిసెంబర్‌ నెలాఖరు నాటికి నాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పదేపదే చెబుతున్నారు. లేదంటే దాళ్వా సాగు గట్టెక్కడం కష్టమని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే డిసెంబర్‌ నెలాఖరు కాదు కదా.. కనీసం జనవరి నెలాఖరు నాటికైనా నాట్లు వేసే అవకాశం లేదు. ఎందుకంటే.. చాలామంది రైతులు నారుమడులే వేయలేదు. ఇప్పటికిప్పుడు నారుమడులు వేసినా.. నెల రోజులపాటు నారు పెంచాల్సి ఉంటుంది. ఏదోలా కష్టపడి నెలాఖరు నాటికి నారుపోస్తే.. జనవరి నెలాఖరు నాటికి గాని నాట్లు వేయలేని పరిస్థితి. రైతుల బ్యాంకు ఖాతాల్లో తగినంత నగదు నిల్వలు ఉన్నా.. చేతికందటం లేదు. పెట్టుబడులకు సొమ్ముల్లేక.. ఎక్కడా అప్పు కూడా పుట్టని పరిస్థితుల్లో పంట వేయాలో మానాలో నిర్ణయించుకోలేక అన్నదాతలు డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గడువు ముగిసిపోయాక నాట్లు వేసినా నీటి కొరత ఏర్పడి పంట ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో చాలాచోట్ల దాళ్వా వరిసాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 
 
సాగు లక్ష్యం 4.50 లక్షల ఎకరాలు
ప్రస్తుత దాళ్వాలో జిల్లాలోని మెట్ట, డెల్టా ప్రాంతాల్లో 4.50 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుంది. మొత్తం విస్తీర్ణానికి సరిపోయేలా 8,300 ఎకరాల్లో రైతులు నారుమడులు వేయాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు కనీసం సగం విస్తీర్ణంలో అయినా నారుమడులు పడలేదు. డిసెంబర్‌ నెలాఖరు లేదా జనవరి మొదటి వారానికి పూర్తి విస్తీర్ణంలో నాట్లు పడతాయని, రైతులు ఈ లక్ష్యానికి అనుగుణంగా నాట్లు వేసేలా ఎక్కడికక్కడ చైతన్యపరుస్తున్నామని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. 90 శాతం విస్తీర్ణంలో నారుమడులు పడినట్టు వ్యవసాయ శాఖ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బ్యాంకుల్లో నగదు ఉన్నా.. సాగు ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు అల్లాడుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మాసూలు చేసిన పంటను అమ్మినా చేతికి మాత్రం నగదు అందడం లేదు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేసి రోజంతా వేచి చూస్తే 10 రోజులకు చేతికి కేవలం రూ.10వేలు మాత్రమే వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారుమడులకు కనీస పెట్టుబడులు లేవని వాపోతున్నారు. విత్తనాలు కొనుగోలు, దమ్ములు చేయడానికి అప్పులు చేద్దామన్నా ఇచ్చేవాళ్లు కరువయ్యారని చెబుతున్నారు. నగదు కొరతతో అప్పులు సైతం పుట్టడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు సాగడం కష్టసాధ్యమేనని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఽప్రత్యామ్నయ మార్గాలు చూపాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
 
 
 
25 ఎకరాల సాగుకు రూ.25 వేలు అందాయి
నానాకష్టాలు పడి 25 ఎకరాలు సాగు చేశాను. ధాన్యం అమ్మితే చేతికి రూ.25 వేలు మాత్రమే వచ్చాయి. దాళ్వా పెట్టుబడులకు కనీసం లక్ష రూపాయలు కావాలి. సార్వా పెట్టుబడుల కోసం అప్పులు ఇంకా తీర్చలేదు.  నగదు లేక నారుమడులు వేయలేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
 చిన్నం చినవెంకటరెడ్డి, చిన్నంవారి పాలెం, రైతు
 
ఆదుకోకపోతే కష్టమే
రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే సాగు చేయడం కష్టమే. బ్యాంకుల్లో రూ.2 వేలు ఇచ్చి సరిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయడం దుర్లభం. పట్టాదారు పుస్తకాల ఆధారంగాను, కౌలు రైతుల గుర్తింపు కార్డుల ఆధారంగాను బ్యాంకుల్లో జమైన నగదు మొత్తం రైతులకు అందించే ఏర్పాట్లు చేయాలి.
పి.సత్యనారాయణ, రైతు, జాంపేట 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement