
మద్యం కల్తీ.. వ్యాపారుల కక్కుర్తి
ప్రొద్దుటూరు క్రైం:
కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి తదితర ప్రాంతాలలో గతంలో కల్తీ మద్యం కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు ఎక్సైజ్ డివిజన్‌ల పరిధిలో 214 మద్యం షాపులు, 18 బార్‌లు ఉన్నాయి. ప్రొద్దుటూరు పరిధిలో 8 బార్‌లు, 112 మద్యం దుకాణాలు ఉండగా, కడప ఈఎస్ పరిధిలో 10 బార్‌లు, 102 వైన్ షాపులు ఉన్నాయి.
కల్తీ ఘటనలు ఎన్నెన్నో..
ప్రొద్దుటూరులో ఈఎస్ కార్యాలయంతో పాటు ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ ఉంది. కల్తీ మద్యం, సారా, అక్రమ మద్యాన్ని నియంత్రించడానికి డీటీఎఫ్ స్క్వాడ్ ఉంది. అయినప్పటికీ ఇక్కడి కొన్ని దుకాణాలు, బార్లల్లో మద్యం కల్తీ జరుగుతున్నట్లు మద్యం ప్రియులు వాపోతున్నారు. మూడు రోజుల క్రితం రెడ్డిబార్‌లో కల్తీ జరుగుతోందని సమాచారం రావడంతో విజయవాడకు చెందిన ఎస్‌టì ఎఫ్ అధికారులు దాడులు చేశారు. నీళ్లు కలిపిన 68 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇదే బార్‌పై ఎస్‌టిఎఫ్ అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అధికారులు, బార్‌లో పని చేస్తున్న సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా అధికారుల వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. రామేశ్వరం రోడ్డులో మద్యం కల్తీ చేస్తుండగా అప్పటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంభూప్రసాద్ స్వయంగా దాడి చేసి పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో గాంధీరోడ్డు, రామేశ్వరం రోడ్డు, మైదుకూరు రోడ్డులలో ఉన్న మద్యం షాపులపై కేసులు నమోదు కాగా, రూ. 1 లక్ష జరిమానాతో పాటు వారం–పది రోజుల పాటు దుకాణాలు కూడా మూత పడ్డాయి.
అధికారుల చర్యలు శూన్యం..
స్థానికంగానే అధికారులందరూ ఉన్నప్పటికీ కల్తీ మద్యాన్ని నియంత్రించడం లేదనే విమర్శలు జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులతో పాటు డీటీఎఫ్ స్క్వాడ్ అధికారులు ప్రతి రోజూ మద్యం షాపులపై నిఘా పెట్టాల్సి ఉంది. కొన్ని మద్యం సీసాలను తీసుకొని వాటిని పరీక్షలు కూడా చేస్తుండాలి. అయితే వ్యాపారులతో ఉన్న మామూళ్ల సంబంధం కారణంగా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయడంలేదనే విమర్శలు వినిస్తున్నాయి. ఎక్కువగా సామాన్యులు సేవించే 180 ఎంఎల్ చీఫ్ లిక్కర్ కల్తీ జరుగుతున్నట్లు సమాచారం.
తనిఖీలు చేస్తున్నాం..
బార్‌లు, మద్యం షాపుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నాం. రెండు, మూడు రోజులకు ఒక సారి ప్రతి షాపులోనూ షాంపిల్స్ తీస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. కేసులు నమోదు చేసి, అవసరమైతే దుకాణాలను సీజ్ చేస్తాం.
– ఫణీంద్ర, ఎక్సైజ్ సీఐ, ప్రొద్దుటూరు.