10 దాటితే..20 ఇవ్వాల్సిందే
10 దాటితే..20 ఇవ్వాల్సిందే
Published Wed, Jul 27 2016 4:55 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
ఆటోవాలాల దోపిడీ
బైపాస్ రైడర్లతో ప్రయాణికులకు ఇక్కట్లు
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్ నుంచి 2 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉన్న ఆత్మకూరుకు చేరుకునేందుకు రాత్రి 10 గంటలు దాటితే రూ.20 చెల్లించాల్సిందేనని, ఆటోవాలాలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఆత్మకూరుకు రావడానికి నెల్లూరు నుంచి రాత్రి 8 గంటల తర్వాత బస్సు లేకపోవడంతో ప్రయాణికులు తప్పనిసరై అనంతపురం, కర్నూలు, కడప, పొద్దుటూరు, బళ్లారి తదితర బైపాస్ రైడర్ల బస్సు సర్వీసుల్లో ప్రయాణించక తప్పని పరిస్థితి ఉంది. లేకుంటే చెన్నై–ఆత్మకూరు బస్సు కోసం రాత్రి 10.30 గంటల వరకు నెల్లూరులో ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో విధి లేక అధిక చార్జీ అయినా చెల్లించి బైపాస్ బస్సు సర్వీసుల్లో ఆత్మకూరుకు చేరుకునేందుకు ప్రయాణిస్తున్నారు.
2 కిలోమీటర్లకు రూ.20
నెల్లూరు నుంచి నెల్లూరుపాళెం వరకు మాములుగా చార్జీ రూ.35లు ఉండగా ఈ బస్సుల్లో రూ.65 వసూలు చేస్తున్నారు. అయితే ఈ బస్సులు నెల్లూరుపాళెంసెంటర్ నుంచి పట్టణంలోకి రాకపోవడంతో ఆటోలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. దీంతో ఆటోవాలాలు ఇదే అదునుగా ప్రయాణికులను దోచుకుంటున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరానికి రూ.20 వసూలు చేయడం దారుణమని ప్రయాణికులు వాపోతున్నారు. ఆటో ఎక్కి దిగితే రూ.20 ఇవ్వాల్సిందేనని ఆటోవాలాలు పట్టుబడుతున్నారు. మంగళవారం రాత్రి ఆటోచార్జీ విషయమై ప్రయాణికులకు ఓ ఆటోవాలాకు తీవ్ర వాదోపవాదాలు జరిగినా చివరకు ఆటోవాలా డిమాండ్ మేరకు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపంతో ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు. గత కొన్నేళ్లుగా దూర ప్రాంత బస్సులను ఆత్మకూరు పట్టణంలోకి కనీసం ఆర్టీసీ డిపో వరకైనా నడపాలని ప్రజలు కోరుతున్నా నాయకులు ఎన్ని హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చడం లేదు. ప్రయాణికులను దోచుకుంటున్న ఆటోవాలాలను కట్టడి చేయాల్సిన ఆర్టీఏ, పోలీసు తదితర శాఖల అధికారుల నిర్వాకంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో ప్రయాణికుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కిమ్మనక ఆటోవాలాలు అడిగిన మేరకు ఇవ్వక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. బైపాస్‌రైడర్ల, ఆటోవాలాల దోపిడీని ఎవరు అరికడతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Advertisement
Advertisement