గొలుసులు మళ్లీ తెగాయ్!
గొలుసులు మళ్లీ తెగాయ్!
Published Wed, Mar 15 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
- కర్నూలులో చైన్ స్నాచర్స్ హల్‌చల్
- గంట వ్యవధిలో నాలుగుచోట్ల చైన్‌స్నాచింగ్
- ఆరు తులాల బంగారు గొలుసులు అపహరణ
- ఓ మహిళ మెడలో గిల్ట్ నగలు కూడా తెంపుకెళ్లిన దండగులు
కర్నూలు: కర్నూలు నగరంలో రెండు వారాల విరామం తర్వాత చైన్ స్నాచర్స్ హల్‌చల్ చేశారు. మంగళవారం గంట వ్యవధిలో నాలుగు చోట్ల చేతివాటం ప్రదర్శించారు. రెండు చోట్ల నలుగురు మహిళల మెడలో రెండు గొలుసులకు తెంచే ప్రయత్నం చేశారు. కాగా ఓటో వారికి గిల్ట్ నగలు చేతికందక, మరో చోట మహిళ ప్రతి ఘటించడంతో పరారయ్యారు. మరో ఇద్దరి మహిళల నుంచి ఆరు తులాల బంగారు గొలుసులు అపహరించారు.
చైన్‌స్నాచింగ్‌కు పాల్పడింది ఇలా..
ఉదయం 6.30 గంటలకు..
అనంతపురం జిల్లా యాడికి పట్టణానికి చెందిన చంద్రారెడ్డి ఆయన భార్య సత్యవతి కర్నూలులోని కేశవరెడ్డి స్కూలు సమీపంలోని అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా, ఇద్దరు డిగ్రీ, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. చంద్రారెడ్డి భార్య సత్యవతి ఇంటి నుంచి ఉదయం 6.30గంటల సమయంలో నడుచుకుంటూ వాకింగ్‌కు వెళ్తుండగా, ఇద్దరు యువకులు పల్సర్ వాహనంపై ఆమెను సమీపించి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు. అయితే అవి గిల్టు నగలు (రోల్డ్‌గోల్డ్) కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
6.45 గంటలకు..
వెంకట రమణ కాలనీ నుంచి బయలుదేరిన దొంగలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూకృష్ణానగర్‌లోకి ప్రవేశించారు. నర్సింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న అన్నపూర్ణ నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమె మెడలో ఉన్న మూడు తులాల గొలుసు లాక్కొని పారిపోయారు.
7.00 గంటలకు..
న్యూ కృష్ణా నగర్ నుంచి గాయత్రి ఎస్టేట్‌లోకి ప్రవేశించి మోడ్రన్ ఐ హాస్పిటల్ సమీపంలో సుజాత అనే మహిళ ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను సమీపించి మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులను లాక్కునేందుకు విఫలయత్నం చేశారు. ఆమె అప్రమత్తమై ప్రతిఘటించి కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
7.15 గంటలకు..
గాయంత్రి ఎస్టేట్ నుంచి రాధానగర్ (హనుమాన్ కాట వద్ద) నివాసం ఉంటున్న నిర్మల మెడలో కూడా మూడు తులాల బంగారు గొలుసును లాక్కున్నారు. ఇంటి ముందు ఆమె పూలు తెంచుకుంటుండగా పల్సర్ వాహనంపై ఆమెను సమీపించి, మెడలో ఉన్న గొలుసును లాక్కొని ఉడాయించారు.
పోలీసులు అప్రమత్తమైనా పరార్..
గొలుసు దొంగలు పలు కాలనీల్లో హల్‌చల్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. శివారు కాలనీలపై ప్రత్యేక నిఘా ఉంచి ‘సెట్’లో గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేసినప్పటికీ దొంగలు తప్పించుకొని పారిపోయారు. బాధితుల కథనం ప్రకారం పల్సర్ వాహనంపై ఇద్దరు యువకులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తుంది. వాహనం వెనుక కూర్చున్న యువకుడు ఆనంద్ కలర్ టీషర్టు ధరించాడని బాధితురాలు నిర్మల పోలీసులకు తెలిపింది.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
దొంగల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు టౌన్ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. స్టేషన్ల వారీగా మఫ్టీలో ప్రత్యేక బృందాలను నియమించి దొంగల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలు నగలు ధరించి బయటికి వెళ్లేటపుడు అవి కనిపించకుండా కొంగుపైట కప్పుకోవాలని సూచించారు. అనుమానితుడు కాలనీలో సంచరిస్తే డయల్ 100కు కానీ, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు గానీ సమాచారం అందించాలని సూచించారు.
Advertisement