- రేపటి నుంచి మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
- జిల్లా సరిహద్దుల్లో భద్రత పెంపు
- జిల్లా కేంద్రానికి తరలిన నాయకులు
ఏజెన్సీలో హై అలర్ట్
Published Tue, Jul 26 2016 11:57 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
ములుగు : ఏజెన్సీలో ఒకప్పుడు ప్రాభల్యాన్ని చాటిన మావోయిస్టులు ఉనికి చాటేందుకు కొన్ని నెలలుగా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చాలామంది సానుభూతిపరులు, మావోయిస్టు విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇది ప్రస్తుతం జిల్లా పోలీసులకు సవాల్‌గా మారింది. ఖమ్మం జిల్లా వెంకటాపురం రోడ్డుపై నాలుగు రోజుల క్రితం మావోయిస్టులు టిఫిన్ బాంబును పెట్టి హెచ్చరికలు జారీ చేయగా పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇతర జిల్లాల నుంచి సరిహద్దులోకి వచ్చే ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లాలో ప్రవేశించే ముళ్లకట్ట–పూసురు బ్రిడ్జి ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు.
ఏడాది నుంచి కదలికలు
మూడేళ్లు స్తబ్దుగా ఉన్న మావోయిస్టుల కదలికలు ములుగు ఏజెన్సీలో ఏడాది కాలంగా మెుదలయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ 15న గోవిందరావుపేట మండలం మొద్దుగుట్ట ఎన్‌కౌంటర్‌లో శ్రుతి, విద్యా సాగర్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతకుముందు 2015 సెప్టెంబర్‌లో ములుగు మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో పొక్లెయిన్ దహనం చేసి అక్కడ కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆతర్వాత 2016 ఏప్రిల్‌లో తాడ్వాయి మండలకేంద్రంలోని అటవీశాఖ హార్ట్స్‌లో జీపు, గుడిసెను దహనం చేశారు. తర్వాత మే నెలలో మళ్లీ మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో జేసీబీని దహనం చేసి పోస్టర్ ఉంచారు. వరుస ఘటనలతో పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టిసారించింది. పక్కా ప్రణాళికతో మే 5న ఏటూర్‌నాగారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మావోయిస్టు యాక్షన్ టీం దళకమాండర్ బుట్టాయిగూడెంకు చెందిన మధు అలియాస్ కుమ్మరి సడవలయ్యను అరెస్ట్ చేశారు. ఇదే నెల 24న తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) పేరుతో బయటి నుంచి మావోయిస్టులకు సహకరిస్తున్న జిల్లా అధ్యక్షుడు నర్సంపేట మండలం ఖమ్మంపల్లికి చెందిన మిట్టగడప చిరంజీవి, ములుగు మండలం మల్లంపల్లికి చెందిన మేర్గు రాజును అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి టీమ్‌లీడర్, సంఘం రాష్ట్ర కార్యదర్శి బౌతు ఓదెలు అలియాస్ ఆజాద్ తప్పించుకున్నాడు. జూన్ 6న గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన నకిలీ నక్సలైట్ పేరాల వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు వెంకటేశ్‌కు సహకరించిన తాడ్వాయికి చెందిన చింత సురేశ్‌ను పోలీసులు పట్టుకున్నారు. 13న మావోయిస్టు కొరియర్‌గా పనిచేస్తున్న తాడ్వాయి మండలం నార్లాపురానికి చెందిన సిద్దబోయిన శివరాజ్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా జూలై 15న టీవీవీ రాష్ట్ర కార్యదర్శి ములుగు మండలం మల్లంపల్లికి చెందిన బౌతు ఓదెలును పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు అప్రమత్తం
వరుస సంఘటనలతో ఇప్పటికే పోలీసు యంత్రాంగం ఏజెన్సీపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతివ్యూహం ర చించినట్లు సమాచారం. ఇందులో భాగంగా మూడు రోజులుగా జిల్లా సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. గోదావరి ఫెర్రి పాయింట్ల వద్ద భద్రతను మరింత పెంచారు.
నాయకుల్లో గుబులు
మావోయిస్టు అమవీరుల సంస్మరణ వారోత్సవాల సమయంలో ప్రతిసారి నాయకులు జిల్లా కేంద్రాలకు తరలుతూనే ఉన్నారు. గత మూడేళ్లతో పోల్చితే ఈ సారి పరిస్థితి కొంత మారింది. ఎన్‌కౌంటర్, మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌లతో ఏజెన్సీలో వేడెక్కింది. ఈ తరుణంలో స్థానికంగా ఉండటం మంచిదికాదని భావించి చాలామంది నాయకులు జిల్లా, రాజధాని కేంద్రానికి వెళ్లినట్లు సమాచారం.
Advertisement