వైద్యం అందక గిరిజన విద్యార్థి మృతి
-
జీడిగుప్ప గిరిజన ఆశ్రమ పాఠశాలలో దుర్ఘటన
-
హెచ్‌ఎం, వార్డెన్ నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు l
-
విచారణకు తల్లిదండ్రుల డిమాండ్
జీడిగుప్ప (వీఆర్‌పురం) :
ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్ నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి నిండు ప్రాణం బలైంది. జీడిగుప్ప(రాయిగూడెం) గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న అప్పల నాగరాజు (10) అనే గిరిజన విద్యార్థి అనారోగ్యంతో శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. వసతి గృహంలో ఉంటున్న నాగరాజు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, సరైన వైద్యం అందక మృతి చెందినట్టు సమాచారం. మృతుడి సోదరుడు పైడిరాజు కూడా ఇదే ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి. తన తమ్ముడికి నాలుగు రోజులుగా జ్వరం వస్తోందని, ఎవరూ పట్టించుకోకపోవడంతో, తోటి విద్యార్థులే పక్కనే ఉన్న జీడిగుప్ప(రాయిగూడెం) పీహెచ్‌సీకి గురువారం తీసుకువెళ్లారని తెలిపాడు. ఈ విషయం తెలిసిన తల్లి సింగమ్మ అదే రోజు నాగరాజును స్వగ్రామమైన మొద్దులగూడెం తీసుకువచ్చి వైద్యం అందించింది. అయితే శుక్రవారం రాత్రి నాగరాజు పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు ముందుగా రేఖపల్లి పీహెచ్‌సీకి, అక్కడి నుంచి కూనవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూనవరం ఆస్పత్రి డాక్టర్ ఎ.అమరేందర్ ఆ బాలుడిని పరిశీలించి పరిస్థితి విషమంగా ఉన్నందున భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. అర్ధరాత్రి కావడంతో ఉదయం వెళతామని, ఈలోగా వైద్యం చేయాలని తల్లిదండ్రులు కోరారు. ఆ బాలుడికి వైద్యం అందిస్తుండగా కొద్ది సమయానికే మృతి చెందాడు. సరైన సమయంలో వైద్యం అంది ఉంటే తమ కుమారుడు బతికి ఉండేవాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థి మృత దేహాన్ని తల్లిదండ్రులు స్వగ్రామం మొద్దులగూడెం తీసుకువెళ్లారు.
కనీసం సమాచారం ఇవ్వలేదు
అనారోగ్యంగా ఉన్న తమ బిడ్డను పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందాడని అప్పల నాగరాజు తల్లిదండులు సీతయ్య, సింగమ్మ ఆరోపిస్తున్నారు. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యల తీసుకోవాలని కోరారు.
విచారణ చేపడతాం
జీడిగుప్ప ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి నాగరాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయమై ఏటీడబ్ల్యూఓ ఎస్.అబ్బులును ‘సాక్షి’ వివరణ కోరింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పూర్తి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని బధులిచ్చారు.