ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యమించాలి
కడప వైఎస్సార్ సర్కిల్ :
జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రజా ఉద్యమంలా పోరాటం సాగించాలని ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా పేర్కొన్నారు. శనివారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక రా.రా. గ్రంథాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పొందుపరిచి ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాల్సిందిపోయి తనకేమి పట్టనట్లు వ్యవహారించడం తగదన్నారు. రాయలసీమలో నిరుద్యోగం తాండవించి, వలసలు వెళుతుంటే వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపడం సరికాదన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రంతో పోరాడాల్సిందిపోయి కేంద్ర పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ఎలాంటి అభివృద్ది నిధులు కేటాయించకుండా చేయడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తకపోవడం సహించరాని విషయమన్నారు.
పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చి రెండున్న సంవత్సరాలు దాటుతున్నా ఎటువంటి అభివృద్దిగానీ, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసిన పాపాన పోలేదన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, పారిశ్రామికంగా అభివృద్ది జరగాలంటే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తప్పనిసరి అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించడానికి సిద్దం కావాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ది కోసం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అందుకు న్యాయవాదులు తమవంతు మద్దతుగా ఆందోళనలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ కన్వీనర్ జేవీ రమణ మాట్లాడుతూ సీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బండి జకరయ్య మాట్లాడుతూ వెఎస్సార్ జిల్లా అన్ని విధాలా వెనుకబడి ఉందన్నారు.ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మహాజన రాజ్యం పార్టీ అధ్యక్షులు సంగటి మనోహర్, సంఘ సేవకుడు సలావుద్దీన్, సీపీఎం కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు పి.అంకుశం, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేశు, పీడీఎస్‌యూ నాయకులు నాగేంద్ర పాల్గొన్నారు.