ఆరని నిరసన జ్వాల
ఆరని నిరసన జ్వాల
Published Thu, Oct 27 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
* సంధ్యారాణి మృతికి కారణమైన ఫ్రొఫెసర్ లక్ష్మిని
అరెస్టు చేయాలని కొనసాగుతున్న ధర్నా
* లేదంటే నిరసన కొనసాగిస్తాం
* జూడాల సంఘం వెల్లడి
* నగరంలో భారీ ర్యాలీ
పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.వి.వి.లక్ష్మిని అరెస్టు చేసేంతవరకు సమ్మె కొనసాగిస్తామని గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. గురువారం మృతురాలి చిత్రపటాలను పట్టుకుని.. నల్లబ్యాడ్జీలు ధరించి నగరంలో ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలను కలిసి న్యాయం కోరుతూ వినతిపత్రాలు అందజేశారు.
గుంటూరు మెడికల్: డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిని అరెస్టు చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు(జూడా) స్పష్టం చేశారు. గురువారం డాక్టర్ సంధ్యారాణి చిత్రపటాన్ని పెట్టుకుని, నల్లబ్యాడ్జిలు ధరించి, డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుంటూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆస్పత్రి నుంచి హిందూ కళాశాల మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తొలుత బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు సూపరింటెండెంట్ చాంబర్ వద్దే నేలపై బైఠాయించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ సుబ్బారావు జీజీహెచ్‌కు వచ్చి జూడాలతో మాట్లాడారు. తొలుత ఏర్పాటు చేసిన కమిటటీపై తమకు నమ్మకం లేదని జూడాలు చెప్పటంతతో ముగ్గురు సభ్యులతో హైపవర్ కమిటీ వేశామని వెల్లడించారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శశాంక్, విజయవాడ జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్, నెల్లూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి హైపవర్ కమిటీలో ఉన్నారని తెలిపారు. డీఎంఈ చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని జూడాలు ప్రొఫెసరల్ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఆస్పత్రి వర్గాలంతా లక్ష్మిపై ఫిర్యాదు...
ఆసుపత్రిలో జూడాలు చేస్తున్న సమ్మెకు ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం నేతలు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం మద్దతుగా గంటసేపు నిరసన తెలిపారు. వీరు డాక్టర్ లక్ష్మిపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు. బహిరంగ విచారణలోనైనా ఆమెపై ఫిర్యాదు చేస్తామన్నారు. తదుపరి డీఎంఈ ఆస్పత్రి అధికారులు, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పోలీస్ అధికారులతో చర్చించి వెళ్లిపోయారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు, డీఎస్సీలు సరిత, సంతోష్ ఆస్పత్రికి వచ్చి జూడాలతో చర్చించారు. లక్ష్మిని తక్షణమే అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు వివరించారు.
హైపవర్ కమిటీ విచారణ
హైపవర్ కమిటీ సభ్యులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రొఫెసర్ లక్ష్మిపై వస్తున్న ఆరోపణల గురించి విచారణ చేశారు. వైద్యుల నుంచి రోగుల వరకు ఆస్పత్రిలో అందరితో మాట్లాడారు.
24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఎమర్జెన్సీ సేవలు నిలిపేస్తాం..
గురువారం అత్యవసర సేవలు మినహా మిగతా వైద్య సేవలకు హాజరైన జూనియర్ డాక్టర్లు ప్రొఫెసర్ లక్ష్మిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే అత్యవసర వైద్య సేవలను నిలిపివేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
Advertisement