ముత్తబాబు మృతదేహం
- వ్యవసాయ కూలీ దుర్మరణం
- బోరుడబ్బా వద్ద కర్ర బిగిస్తుండగా ప్రమాదం
- తున్కిఖాల్సాలో విషాదం
వర్గల్: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యవసాయ కూలీ దుర్మరణం చెందాడు. పొలంలో బోరుబావి డబ్బా వద్ద కర్ర పాతేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ కాటుకు బలయ్యాడు. ఈ విషాదకర ఘటన గురువారం సాయంత్రం వర్గల్ మండలం తున్కిఖాల్సాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... తున్కిఖాల్సాకు చెందిన ముత్త బాబు (35)కు రెండెకరాల లోపు భూమి ఉంది.
ఆయనకు భార్య కవితతోపాటు కీర్తన (10), అర్చన (8), వరుణ్ (5) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వరుస కరువుతో భార్యాభర్తలు కూలీలుగా మారారు. గత 8 నెలలుగా గ్రామ సమీపంలోని మామిడితోటలో ముత్త బాబు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తోటలో బోరు ఆనుకుని కొద్దిపాటి వరి పొలం ఉన్నది.
స్తంభం నుంచి బోరు దూరంగా ఉండడంతో మధ్యలో కర్రలు బిగించి వాటి మీదుగా బోరు వరకు సర్వీస్ వైర్‌ను తీసుకొచ్చారు. అక్కడ కడీకి బోరు ప్యానెల్ బాక్సు బిగించి సర్వీస్ వైర్ కనెక‌్షన్ ఇచ్చారు. గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ముత్త బాబు బోరు పక్కనే సర్వీస్ వైరుతో ఉన్న కర్ర పడిపోవడంతో దాన్ని సరిచేస్తుండగా కాలుజారి పొలంలో కర్ర, ప్యానెల్ బాక్సుతో సహా పడిపోయాడు.
వెంటనే కరెంట్ షాక్‌కు గురై దుర్మరణం చెందాడు. భర్త మృతితో భార్య కవిత, పిల్లలు ఇతర బంధువుల రోదనలు మిన్నంటాయి. పెద్ద దిక్కు కోల్పోయిన నిరుపేద కుటుంబాన్ని తోట యజమాని పరిహారం అందించి ఆదుకోవాలని మృతుని సంబంధీకులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు గౌరారం ఏఎస్‌ఐ దేవీదాస్ తెలిపారు.