‘జీవ భద్రత’ పరిష్కరించాకే జన్యుమార్పిడి
♦ దేశ విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
♦ ఆసియా విత్తన సదస్సులో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ, జీవ, ఆరోగ్య భద్రత అంశాలను పరిష్కరించిన తర్వాతే జన్యుమార్పిడి పంటల వాణిజ్యం గురించి ఆలోచించాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. విత్తనాన్ని కేవలం వాణిజ్య అంశంగానే కాకుండా దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశంగా చూడాలన్నారు. గోవాలో సోమవారం ప్రారంభమైన ఆసియా విత్తన సదస్సు-2015లో ‘తెలంగాణను భారత విత్తన రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సదస్సు ఈ నెల 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ విత్తన వ్యాపారం ద్వారా వచ్చే లాభాలు రైతులకు అందేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విత్తనరంగం అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నామని తెలిపారు.
విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్‌కు నిరంతర విద్యుత్ సరఫరా, గ్రామాలను విత్తన కేంద్రాలుగా మార్చేందుకు ప్రాసెసింగ్, రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా ప్రపంచానికి హైదరాబాద్ అనుసంధానమైందన్నారు. 400 పైగా విత్తన కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. భారత విత్తన హబ్‌గా హైదరాబాద్ ఉంటుందన్నారు. దేశ విత్తన భాండాగారంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నమన్నారు. దేశ విత్తన అవసరాల్లో 60 శాతం తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతుందని... 90 శాతం హైబ్రీడ్ విత్తనోత్పత్తి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచే జరుగుతోందని వివరించారు.
వ్యవసాయ వర్సిటీలో ప్రత్యేక విత్తన కేంద్రంతోపాటు విత్తన ఎగుమతులు పెంచడానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన విత్తన ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో విత్తనోత్పత్తి సాధించడానికి మొబైల్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, సాగునీటి సదుపాయం కల్పిస్తామన్నారు. పాలీహౌస్‌ల్లో పూలు, కూరగాయల విత్తనోత్పత్తి, ప్రత్యేకించి తెలంగాణ విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. రైతుకు మేలైన జీవనోపాధిగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దేందుకు, లాభసాటి వ్యాపకంగా మార్చేం దుకు కృషిచేస్తున్నట్లు, అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.