యాసిడ్‌తో డ్రిప్ మన్నిక
అనంతపురం అగ్రికల్చర్ : అంతంత మాత్రంగా ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలంటే డ్రిప్ యూనిట్ల వాడకంలో జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీలు ఆర్.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్ తెలిపారు. నీటి విలువ తెలుసుకుకుని పొదుపుగా వాడుకోవడంతో పాటు డ్రిప్ పరికరాల మన్నిక విషయంలో అవగాహన పెంచుకోవాలని వారు సూచించారు.
డ్రిప్ వాడకంలో మెలకువలు
డ్రిప్ యూనిట్లు అమర్చుకున్న రైతులు 1.5 రేంజ్‌లో ప్రెషర్ ఉండేలా చూసుకోవాలి. వాల్వులు ఒకేసారి ఓపెన్ చేయకూడదు. ప్రెషర్ మెయింటెయిన్ చేయడం వల్ల లవణాలు, మలినాలు శుభ్రమవుతాయి. ప్రెషర్ వల్ల మొక్కలకు సమానంగా నీళ్లు అందుతాయి. ఫ్లష్ వాల్వులను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. లేదంటే లవణాలు పేరుకుపోయి రంధ్రాలు పూడిపోతాయి. లాటరల్‌లు నెలకోసారి క్లీన్ చేసుకోవాలి. లేదంటే మలినాలు డ్రిప్పర్ల దగ్గర పేరుకుపోతాయి. నీటి తడులకు ఇబ్బంది లేకుండా ఐదు ల్యాటరల్‌లను ఒక బ్యాచ్‌గా చేసుకుని శుభ్రం చేసుకోవచ్చు. ఫిల్టర్ లోపల ఉండే జల్లెడను వారానికి ఒకసారి క్లీన్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో బోర్ల నుంచి ఇసుక వస్తుంది. అలాంటి ప్రాంతాల్లో రైతులు హైడ్రోసైక్లోన్ ఫిల్టర్‌ను వాడాలి. డ్రిప్ ద్వారా ఎరువులు (ఫర్టిగేషన్) వాడే సమయంలో మోటార్ ఆఫ్ చేసే 15 నిమిషాల ముందు ఎరువులు వదలాలి. ముందుగా ఎరువులు వదిలితే పోషకాలు మొక్కల వేరు వ్యవస్థ కన్నా కిందకు వెళ్లడం జరుగుతుంది.
యాసిడ్ ట్రీట్‌మెంట్
ఉప్పు లవణాలతో కూడిన నీరు పైపుల ద్వారా వెళ్లడం వల్ల లేటరల్, డ్రిప్పర్లు మూసుకొని పోతాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం (హెచ్‌సీఎల్)తో యాసిడ్ ట్రీట్‌మెంట్ æ(ఆమ్లచికిత్స) మూడు లేదా ఆరు నెలలకోసారి చేసుకోవాలి. ట్రీట్‌మెంట్ చేసేముందు మొదట ఫిల్టర్లను, పీవీసీ పైపులను, లేటరల్ పైపులను శుభ్రం చేసుకోవాలి. సరైన మోతాదులో నీటిని కలుపుకుని తయారు చేసుకున్న ఆమ్ల ద్రావణాన్ని ఫర్టిలైజర్ ట్యాంకు లేదా ప్లాస్టిక్ బకెట్‌లో పోసుకుని వెంచురీ ద్వారా డ్రిప్ యూనిట్‌లోకి పంపించాలి. లేటరల్ చివర ఆమ్ల ద్రావణాన్ని నీటితో పాటు సబ్‌మెయిన్ లేదా లేటరల్, డ్రిప్పర్లలోకి చేరిన నీటిని పీహెచ్ పేపరుతో ముంచి పీహెచ్‌ను 4 రీడింగ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఆమ్ల ద్రావణం పూర్తిగా సిస్టంలోకి పంపిన తర్వాత మోటారు ఆపేసి 24 గంటలపాటు నీటిని సిస్టంలో నిల్వ ఉంచాలి. దీనివల్ల పైపులలో పేరుకుపోయిన ఉప్పు లవణాలు కరిగిపోతాయి. యాసిడ్ ట్రీట్‌మెంట్‌పై ఏపీఎంఐపీ ఎంఐఏవోలు, డ్రిప్ కంపెనీ నిర్వాహకులను సంప్రదించాలి.