ఉద్యానతోటల్లో ‘ఆగస్టు’ యాజమాన్యం
అనంతపురం అగ్రికల్చర్: ద్రాక్ష, దానిమ్మ, మామిడి తోటల్లో ఆగస్టు నెలలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ టెక్నికల్ అధికారి, ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్ తెలిపారు.
+ ద్రాక్ష తోటల్లో కత్తిరింపులు పూర్తయ్యాక 40 నుంచి 65 రోజులైన తర్వాత నీళ్లు ఎక్కువగా ఇవ్వకూడదు. ఎకరాకు 5,500 లీటర్లు నీరు మాత్రమే పెట్టాలి. ఎక్కువగా నీళ్లు పెడితే పూమొగ్గ ఏర్పడే అవకాశం తగ్గిపోతుంది. అలాగే నీళ్లు తక్కువైనా కూడా కష్టమే. సరైన మోతాదుల్లో నీళ్లు పెడితే పంట బాగొస్తుంది. ఈ దశలో నత్రజని ఎరువులు కూడా ఎక్కువగా వేయకూడదు. నత్రజని వేస్తే పుల్ల ఎక్కువగా సాగి పూత తగ్గిపోతుంది. హార్మోన్ల వాడకం విషయానికి వస్తే కత్తిరింపులైన 40వ రోజు 1 గ్రాము 6–బీఏ 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 45వ రోజు 5 గ్రాములు యురాసిల్ 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. 55వ రోజు 1 మి.లీ లెహోసీన్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. 65వ రోజు 3 గ్రాములు యురాసిల్ 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 70వ రోజు 2 గ్రాములు యురాసిల్ 100 లీటర్ల నీటికి పిచికారి చేయాలి. 80 నుంచి 90వ రోజు మధ్య 0.5 మి.లీ లెహోసీన్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ద్రాక్షలో బూజుతెగులు, తామర పురుగులు (త్రిప్స్) నివారణకు 1.5 గ్రాములు నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
+ దానిమ్మలో కాయ ఎదుగుదల దశలో ఉన్న తోటల్లో బ్యాక్టీరియా మచ్చతెగులు సోకే అవకాశం ఉన్నందున 0.5 శాతం మైలుతుత్తం (బోర్డో మిశ్రమం) పిచికారి చేయాలి. రోగం సోకిన కాయలు, కొమ్మలు ఏరివేసి నాశనం చేయాలి. పండుఈగ ఆశిస్తే కాయలపై సూది లాంటి రంధ్రాలు ఏర్పడి కాయ కుళ్లిపోతుంది. నివారణకు 1.5 మి.లీ లాంబ్డాసైలోత్రీన్ ఒక లీటర్ నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. కత్తిరింపులు చేసిన తోటల్లో వెంటనే 1 శాతం బోర్డోమిశ్రమం పిచికారి చేయాలి. నేలపైన బ్లీచింగ్ పౌడర్ + బట్టీ సున్నం చల్లుకోవాలి.
+ పంటకోతలు పూర్తయిన తర్వాత మామిడితోటల్లో ఎండుకొమ్మలు, తొడిమలు, అడ్డదిడ్డమైన కొమ్మలు, గత పంట అవశేషాలు పూర్తిగా కత్తిరించాలి. గాలి, వెలుతురు, సూర్యరశ్మి బాగా ప్రసరించేలా చెట్టు కత్తిరింపులు జాగ్రత్తగా చేయాలి. కత్తిరింపులు తర్వాత 3 గ్రాములు బ్లైటాక్స్ + 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కొత్త చిగుర్లు వచ్చిన వెంటనే 3 గ్రాములు సూక్ష్మధాతులోప మిశ్రమం + 1 మి.లీ నువాన్ + 1 గ్రాము బావిస్టన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.