ఎయిమ్స్ కోసం మంగళగిరిలో ప్రతిపాదించిన భూములు
సాక్షి, విజయవాడ బ్యూరో: మంగళగిరిలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వైద్యవిద్యా సంస్థ కోసం కేటాయించిన భూములపై వివాదం నెలకొనడంతో ఆరు నెలలుగా అడుగు ముందుకు పడడంలేదు. అందుకే ఈ సంస్థ ఏర్పాటుపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు.
ఎయిమ్స్ ఏర్పాటుకు మంగళగిరిలోని టీబీ శానిటోరియం ఉన్న 200 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి చూపించింది. అయితే అప్పటికే అందులోని 50 ఎకరాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) పదో బెటాలియన్ ఏర్పాటైంది. అయితే కచ్చితంగా 250 ఎకరాలు కావాలని ఎయిమ్స్ బృందం చెప్పడంతో ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్న భూమితోపాటు పక్కనున్న భూములన్నింటినీ కలిపి 220 ఎకరాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది.
దీనికి వారు అయిష్టంగానే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత భూములు ఖాళీ చేస్తే, వేరేచోట అనువైన భూములిస్తామని ఎన్డీఆర్‌ఎఫ్‌ను ప్రభుత్వం కోరింది. కానీ ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో గుంటూరు జిల్లా కలెక్టర్ భూములను ఖాళీ చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్‌కు నోటీసులు కూడా ఇచ్చారు. వాటిని కూడా ఎన్డీఆర్‌ఎఫ్ లెక్క చేయలేదు. తమది అత్యంత ప్రాముఖ్యమైన సంస్థని, కేంద్రానికి చెందిన తమ సంస్థకు ఒకసారి భూములిచ్చాక తిరిగి తీసుకోవడం కుదరదని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. తాజాగా అక్కడే మరో భవన నిర్మాణానికి ఎన్డీఆర్‌ఎఫ్ శ్రీకారం చుట్టింది.
దీంతో మంగళగిరి ఎయిమ్స్ ప్రతిపాదనను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పెండింగ్‌లో పెట్టేసింది. దేశంలో మూడో దశలో ఏర్పాటయ్యే ఎయిమ్స్‌ల జాబితాలోనూ ఏపీ ఎయిమ్స్‌ను చేర్చలేదు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నిజానికి టీబీ శానిటోరియంలో ఉన్న భూమి 170 ఎకరాలే. దానికి ఆనుకుని మరో 50 ఎకరాల కొండ పోరంబోకు భూములను కలుపుకొని మొత్తం 220 ఎకరాలున్నట్లు ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది.
పక్కా భూమిలో ఎన్డీఆర్‌ఎఫ్‌కిచ్చిన 50 ఎకరాలు పోవడంతో మిగిలింది 120 ఎకరాలే. కొండ పోరంబోకును కేంద్ర బృందం పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఎన్డీఆర్‌ఎఫ్‌కిచ్చిన భూమిని తిరిగి తీసుకున్నా భూములు తమకు చాలవని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంగళగరిలో ఎయిమ్స్ లేనట్లేనని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు కొద్దికాలం నుంచి చెబుతున్నాయి.