వచ్చే నెల్లో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
కావలి: దగదర్తి మండలం దామవరం వద్ద ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టుకు వచ్చే నెల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ ముత్యాల రాజు తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన ఎయిర్‌పోర్టు భూములపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దామవరం, కొత్తపల్లి కౌరగుంట గ్రామాల్లో ఇంతవరకు 1,399 ఎకరాలు సేకరించినట్లు చెప్పారు. ఈ భూముల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి పరిహారం చెల్లించామని, ఇకపోతే పట్టా భూములకు ఎంత ధర నిర్ణయించాలో అనే విషయంపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు తెలిపారు. 20 రోజుల్లో ఈ ప్రక్రియ ముగించి వచ్చే నెల చివరిలో శంకుస్థాపనకు పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. మళ్లీ రెండు సార్లు ఈ భూముల వ్యవహారంలో సమీక్ష నిర్వహిస్తాన్నారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, ఆర్డీఓ ఎస్‌ఎల్ నరసింహంతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు విషయం మా దృష్టికి రాలేదు
కావలిలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం భూములు సేకరిస్తున్నారా అంటూ ‘సాక్షి’ కలెక్టర్‌ను ప్రశ్నిస్తే అలాంటివేమీ తమ దృష్టికి రాలేదని కలెక్టర్ ముత్యాలారాజు స్పష్టం చేశారు. 13 వందల ఎకరాలు అనధికారికంగా గుర్తించినట్లు ప్రచారం సాగుతుందని అడిగితే అంతా పుకార్లేనని, ఈ విషయమై ప్రభుత్వాలనుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు.