
ప్రత్యేకహోదా కోసం విద్యార్థుల వినూత్న నిరసన
ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో మడకశిరలో మంగళవారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న రీతిలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
మడకశిర : ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో మడకశిరలో మంగళవారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న రీతిలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. తొలుత పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కే మనోహర్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ టీడీపీలు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ మంత్రులు తమ స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఏఐఎస్‌ఎఫ్ తాలూకా కార్యదర్శి టీ శంకర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలు సమైక్యంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలికింది. పార్టీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలో పాల్గొని ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు చేసే పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగివచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో తాలూకా ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి టీ శంకర్, స్థానిక ఏఐఎస్‌ఎఫ్‌నాయకులు సురేష్, యశ్వంత్, మహంతేష్, మంజునాథ్, రవి, వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీరాములు, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.