సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
ఏఐటీయూసీ డిమాండ్
కలెక్టరేట్ వద్ద ధర్నా
కాకినాడ సిటీ : సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కిర్ల కృష్ణారావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. తీర్పు వచ్చి మూడు నెలలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, నాయకులు దాసు, తోకల ప్రసాద్, మున్సిపల్ సంఘ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.