అకాల వర్షం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అకాల వర్షం మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో అపార నష్టం కలిగించింది. మామిడి రైతులు భారీగా నష్టపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అదివారం వరకూ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సోమవారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం
కురిసింది. చింతలపూడి మండలం యర్రంపాలెంలో పిడుగుపడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామానికి చెందిన తగరం దిలీప్ (14) మృత్యువాత పడ్డాడు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో పిడుగుపడి జంపన రామకృష్ణరాజు అనే వ్యక్తికి చెందిన తాటాకిల్లు కాలిపోయింది. ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కాలిపోయాయి. నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో కసుకుర్తి ప్రేమశేషారావు అనే రైతుకు చెందిన కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో రెండు చెట్లు కాలిపోయాయి. ఎస్సీ కాలనీలో 10 టీవీలు దగ్ధమయ్యాయి. కొందరి ఇళ్లల్లో కేబుల్ టీవీకి సంబంధించిన సెటాప్ బాక్స్‌లు మాడిపోయాయి. చింతలపూడి సెక్షన్ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సుమారు 40 స్తంభాలు పడిపోయినట్టు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో మామిడి, అరటి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. టి.నర్సాపురం మండలంలో మామిడికాయలు రాలిపోయాయి, ఆయిల్‌పామ్, అరటి తోటలు దెబ్బ తిన్నాయి. జీలుగుమిల్లి, పోలవరం, బుట్టాయిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పోలవరం, కొయ్యలగూడెంలో మొక్కజొన్న, చింతలపూడి, బుట్టాయగూడెం, జీలుగువిుల్లి, కామవరపుకోట మండలాల్లో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. జీలుగువిులి్ల–దేవరపల్లి మధ్య జాతీయ రహదారిపై చెట్లు నేలకొరి గాయి. రౌతుగూడెంలో విద్యుత్ స్తంభాలు కూలిపోగా, దర్భగూడెం వద్ద తాడి చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. టి.నర్సాపురం, శ్రీరామవరం తదితర గ్రామాల్లో నిమ్మతోటలు పక్కకు వాలిపోయాయి. ఈదురుగాలులకు మామిడి రైతులతోపాటు వేరుశనగ, మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లింది.
డెల్టాలోనూ..
తాళ్లపూడిలో మొక్కజొన్న పొత్తులు, ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పెనుమంట్ర మండలం ఇలింద్రపర్రు, జుత్తిగ, బ్రాహ్మణచెరువు గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లోను, ఆచంట మండలం ఆచంట, వల్లూరు, కరుగోరుమిల్లి గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లోను కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. వాతావరణంలో మార్పుల వల్ల నరసాపురం ప్రాంతంలో వరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఇంకా 1,500 ఎకరాల్లో వరికోతలు పూర్తి కాలేదు. నియోజకవర్గంలో సుమారు 300 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా కాయలు రాలిపోయాయి. నష్టం విలువను అంచనా వేసే పనిలో ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.