మద్యం అమ్మకాలపై కఠిన ఆంక్షలు
మద్యం అమ్మకాలపై కఠిన ఆంక్షలు
Published Fri, Aug 12 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
సాక్షి, అమరావతి :
కృష్ణా పుష్కరాల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పుష్కర ఘాట్‌లకు 500 మీటర్ల దూరంలో మద్యం అమ్మకాలు నిషేధించినట్లు చెప్పారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ఘాట్‌ల వద్ద మద్యం అమ్మకాలు ఉండవని, పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో మద్యం షాపుల వారు కచ్చితంగా సమయం పాటించాలన్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరుగుతాయని, ఎన్‌ఫోర్స్‌మెంట్ వారు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారని చెప్పారు. కృష్ణా జిల్లాలో విజయ బార్ అండ్ రెస్టారెంట్, కృష్ణా బార్ అండ్ రెస్టారెంట్, విజయదుర్గ బార్ అండ్ రెస్టారెంట్, పున్నమి టూరిజం బార్, గుంటూరు జిల్లాలో లోటస్ బార్ అండ్ రెస్టారెంట్స్ మూసివేసినట్లు తెలిపారు. అదే విధంగా కృష్ణా జిల్లాలోని భవానీపురంలో లలితా వైన్స్, ఉయ్యూరులో స్నేహ వైన్స్, కేఎస్‌ఆర్ వైన్స్, గుంటూరు జిల్లాలోని పెదకూరపాడులో ధరణి ఎంకే వైన్స్, రేపల్లెలో శ్రీచైతన్య వైన్స్, దుగ్గిరాలలో ఎస్‌ఎస్ వైన్స్‌లు మూసి వేశారు. సిబ్బందిని సమస్యలుంటే ఎకైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ టోల్‌ఫ్రీ నెంబరు: 18004254868కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
Advertisement
Advertisement