మద్యం కేరాఫ్‌ హైవే | Alcohol at Highways | Sakshi
Sakshi News home page

మద్యం కేరాఫ్‌ హైవే

Published Tue, Jul 4 2017 4:23 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

మద్యం కేరాఫ్‌ హైవే - Sakshi

మద్యం కేరాఫ్‌ హైవే

సాక్షి ప్రతినిధి: కడప
 రోడ్డు ప్రమాదాల కట్టడికి హైవేల వెంట 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటు చేయకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు ప్రభుత్వం లొసుగులు వెతికింది. రాష్ట్ర హైవేలన్నీ జిల్లా రోడ్లుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే జనం నుంచి నిరసనల సెగ ఎదుర్కొంటున్న మద్యం వ్యాపారులంతా పోలోమని ప్రస్తుత హైవేల పక్కకు వాలిపోవడానికి మార్గం సుగమమైంది. జిల్లాలో జనావాసాల్లోకి దూసుకుపోవాలనుకున్న 161 మద్యం దుకాణాలు మళ్లీ ఎంచక్కా రోడ్ల పక్కకు రెక్కలు కట్టుకుని వాలిపోవడానికి రంగం సిద్ధమైంది. లైసెన్సుల రూపంలో ఇప్పటికే వ్యాపారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ప్రభుత్వం దుకాణం చిరునామా మార్పు పేరుతో మరింత సొమ్ము వసూలు చేయడానికి సిద్ధ పడింది. 
 
2017–19 కాలానికి జిల్లాలో 255 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. అయితే సుప్రీం తీర్పును అనుసరించి ఇందులో 161 దుకాణాలు ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. దీంతో వ్యాపారులు నివాస ప్రాంతాల మధ్యలోను, గుడి, బడి, మసీదు, చర్చి లాంటి నిబంధనలు పట్టించుకోకుండా ఎక్కడ రూము బాడుగకు దొరికితే అక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి వెనుకాడటం లేదు. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి దుకాణాల యజమానులు అద్దెలు విపరీతంగా పెంచేశారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దెబ్బ తినకుండా సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసేలా ఆదేశాలు రావడంతో ఎక్సైజ్‌ అధికారులు నిబంధనలు కఠినంగా అమలు చేసే ధైర్యం చేయలేక పోతున్నారు. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు వెలుస్తున్నాయి.

మహిళల ఇబ్బందులు, విద్యార్థుల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదు. మద్యం వ్యాపారులు, అధికారుల చర్యలపై జనం తీవ్రంగా మండిపడుతున్నారు. గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటొచ్చి ఎటు పోతుందోననే భయంతో జిల్లాలో 255 మద్యం దుకాణాల ఏర్పాటుకు గాను సోమవారం వరకు 160 మందే లైసెన్సులు తీసుకున్నారు. మిగిలిన వారు వేచి చూసే ధోరణితో వ్యవహరించారు. కడప సాయిపేట, రాయచోటి లోని గున్ని కుంట్ల రోడ్డు, రాజంపేట మండలం మన్నూరు, చక్రంపేట, సిద్ధవటంలోని జయదేవనగర్, రాజంపేట పట్టణం, పీలేరు– సుండుపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల ఎత్తివేత కోసం జనం ఆందోళనకు దిగారు. సిద్ధవటంలో మద్యం దుకాణం ఎదుటే రెండు రోజుల పాటు బైఠాయించారు. కడప సాయిపేటలో వైన్‌ షాపు మీద దాడి చేసి బాటిళ్లు పగులగొట్టారు. రాయచోటిలో కూడా రెండు రోజులు నిరసనలు వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా జిల్లాలో రోజు రోజుకు తీవ్రమవుతున్న నిరసనలతో వ్యాపారులు, అధికారులు అదిరి పడ్డారు.
 
ముందే అనుకున్న విధంగా ...
సుప్రీం కోర్టు తీర్పును తు.చ. తప్పకుండా అమలు చేసి  వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోవడానికి ప్రభుత్వం సిద్ధపడదనీ, ఇందుకు ఏదో ఒక దొడ్డి దారి వెదుకుతుందని మద్యం వ్యాపారులు గట్టిగా నమ్మారు. ఈ కారణంతోనే దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు తీసుకోవడానికి జిల్లాలో సుమారు 100 మంది వ్యాపారులు ముందుకు రాలేదు. హైవేలకు ఆనుకుని షాపులు ఏర్పాటు చేసే అవకాశం దొరక్క పోతే లైసెన్సు రద్దు చేసుకుందామని వారు భావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ హైవేలన్నీ జిల్లా మేజర్‌ రోడ్లుగా స్థాయి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ విషయం తెలియడంతో మద్యం వ్యాపారం పొందడానికి లైసెన్సులు తీసుకున్న వారు మళ్లీ హైవేల వెంట పడబోతున్నారు. లైసెన్సుల షిఫ్టింగ్‌కు రుసుము వసూలు చేసి కోరుకున్న చోట మద్యం దుకాణం ఏర్పాటుచేయడానికి అనుమతి ఇవ్వడానికి ఎక్సైజ్‌ శాఖ సిద్ధమైంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మద్యం వ్యాపారం ఆరుపువ్వులు పన్నెండు కాయలు, 24 బెల్ట్‌ షాపులుగా మళ్లీ  ఊపందుకోనుంది.
 
గళమెత్తిన చక్రంపేట మహిళలు
చక్రంపేట(పెనగలూరు): మండలంలోని చక్రంపేట గ్రామంలో వెలసిన మద్యందుకాణం మూతవేయాలంటూ మహిళలు గళమెత్తారు. మద్యం దుకాణం మూతవేయాలంటూ రాజంపేట–నెల్లూరురోడ్డుపై మహిళలు బైఠాయించారు. మద్యం దుకాణం ఏర్పాటుకు భూమి ఇచ్చిన రైతు వెంకటేష్‌ 15రోజుల్లో దుకాణాన్ని ఎత్తివేస్తానని గ్రామస్తులు, పోలీసుల సమక్షంలో హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement