హైదరాబాద్‌పై అల్‌కాయిదా పడగ?
సాక్షి, హైదరాబాద్: అమెరికాను గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా ఛాయలు నగరంలోనూ కనిపిస్తున్నాయి. గతేడాది ఆ సంస్థలో చేరేందుకు వెళ్తూ ఇద్దరు మహారాష్ట్ర వాసులు సికింద్రాబాద్‌లో చిక్కడం.. తాజాగా అల్‌కాయిదాకు ఆర్థిక సాయం చేస్తున్న ఆరోపణలపై అమెరికాలో నివసిస్తున్న ఇద్దరు హైదరాబాదీల్ని ఎఫ్‌బీఐ అరెస్టు చేయడం కలకలం సృష్టిం చింది. వీటికితోడు నాగ్‌పూర్ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసిన హఫీజ్ ఆన్‌లైన్ ద్వారా సిటీకి చెందిన కొందరిని సంప్రదించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరి ణామాలను దృష్టిలో పెట్టుకున్న నిఘా వర్గా లు అత్యంత అప్రమత్తమయ్యాయి. ఇప్పటి వరకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఐఎస్‌ఐఎస్‌కు తోడు అల్‌ఖాయిదాతో నగరంతో ఉన్న లింకులపై లోతుగా ఆరా తీస్తున్నాయి.
ఏటీఎస్‌కు చిక్కిన రెహ్మాన్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు గతవారం యవత్‌మాల్ జిల్లాలోని పూసద్‌కు చెందిన హఫీజ్ ముజిబర్ రెహ్మాన్ అలియాస్ సలీమ్ మాలిక్‌ను అరెస్టుచేశారు. ఓ ప్రార్థనాస్థలంలో పనిచేస్తున్న ఈ యువకుడు ఆన్‌లైన్ ద్వారా అల్‌కాయిదాకు మద్దతుగా ‘జిహాద్’ను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతడికి గత ఏడాది సికింద్రాబాద్‌లో చిక్కిన అహ్మద్‌ఖాన్, ముసద్దీర్‌లతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించారు. రెహ్మాన్ సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన కొందరితో సంప్రదింపులు జరిపినట్లు ఏటీఎస్ అనుమానిస్తూ ఆ కోణంలో ఆరా తీస్తోంది.
సైదాబాద్, మల్లేపల్లి వాసులే:
తాజాగా అల్‌కాయిదాకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ఆ దేశంలో నలుగురిని అరెస్టు చేసింది. ఇలా చిక్కిన వారిలో హైదరాబాద్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన ఇంజనీర్లు మహ్మద్ యహ్యా ఫారూఖ్, మహ్మద్ ఇబ్రహీం జుబేర్ ఉన్నారు. వీరిద్దరూ అన్నదమ్ములే. ఈ విషయంపై ఆరా తీసిన రాష్ట్ర నిఘా వర్గాలు వీరి తండ్రి పేరు మహ్మద్ అహ్మద్ షాకేర్‌గా గుర్తించారు. సైదాబాద్ పరిధిలోని అక్బర్‌బాగ్‌లో యహ్యా నివసించిన ఇంటినీ పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ యహ్యా సోదరి ఉంటున్నట్టు తేలింది. ఇబ్రహీం న్యూ మల్లేపల్లిలోని సీఐడీ క్వార్టర్స్‌లో నివసించాడు.
గతేడాది ఆ ఇద్దరూ...
మహారాష్ట్రలోని ఉమర్‌ఖేడ్ జిల్లా షా కాలనీకి చెందిన షా ముసద్దీర్ అలియాస్ తల్హా, అంగోలీ జిల్లా అఖడ్‌బాలాపూర్‌కు చెందిన షోయబ్ అహ్మద్ ఖాన్ ఉగ్రవాద బాటపట్టి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో చేరారు. ఫేస్‌బుక్ ద్వారా అల్‌కాయిదాకు ఆకర్షితులయ్యారు. ఆ సంస్థలో శిక్షణ పొందేందుకు అఫ్ఘానిస్థాన్‌కు పయనమయ్యారు. ఈ ప్రయాణంలో భాగంగా నగరానికి చేరుకున్న వీరిని గతేడాది అక్టోబర్ 22న సికింద్రాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.