అన్ని దస్త్రాలు ఈ- ఆఫీసులోకే
అన్ని దస్త్రాలు ఈ- ఆఫీసులోకే
Published Wed, Mar 15 2017 12:11 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
- 20లోగా మార్పు చేయాలి
- ఆ తర్వాత ఏ ఫైలూ మాన్యువల్‌గా ఉండరాదు
- జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశం
కర్నూలు(అర్బన్): అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి వందశాతం దస్త్రాలు ఈ-ఆఫీసులోకి మార్చాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తి కావాలని, అటు తర్వాత అన్ని ఫైళ్లు డిజిటల్ పద్ధతిలోనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్ సమావేశ భవనంలో ఈ-ఆఫీసుపై మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ-ఆఫీసు విధానంలో వెనుకబడి ఉండటాన్ని ప్రస్తావించిన కలెక్టర్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మన జిల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే దిగువన ఉండడం శోచనీయమన్నారు.
సంబంధిత అధికారులు శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు కారణమని, ఇది మంచి పరిణామం కాదని తెలిపారు. ఈ-ఆఫీసు విధానం అమలుకు ఈ నెల 20వతేదీని డెడ్‌లైన్‌గా పెట్టిన కలెక్టర్ .. 21వ తేదీ నుంచి ఏ ఒక్క దస్త్రమూ ఫిజికల్‌గా, మ్యాన్యువల్‌గా కనిపించరాదని ఆదేశించారు. 20వ తేదీ నాటికి అన్ని దస్త్రాలను డిజిటల్ చేయాలని, నిర్దేశించిన గడువు అనంతరం ఏ శాఖ నుంచైనా ఫిజికల్ దస్త్రాలు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ - ఆఫీసు ప్రక్రియను ప్రతి శాఖలోనూ యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలన్నారు. నోడల్ ఏజెన్సీగా ఎన్‌ఐసీ ఉంటూ బాధ్యతగా ప్రతి శాఖాధికారికి సరైన గైడెన్స్ ఇవ్వాలని, ఈ అంశం ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రగతి చూపాలన్నారు.
ఈ- ఆఫీసుకు మారిన ప్రతి దస్త్రమూ రికార్డు రూమ్ చేరాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్, స్కానర్‌ను కొనుగోలు చేయాలన్నారు. నిధుల సమస్య ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధిపతులు ఎన్‌ఐసీ నుంచి శిక్షణ తీసుకొని కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. తద్వారా అన్ని విభాగాలు ఈ-ఆఫీసులోకి మారేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement