ఉత్సవాలకు సర్వం సిద్ధం
- నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది వేడుకలు ప్రారంభం
- భారీగా తరలి వచ్చిన కన్నడిగులు
- ఆర్జిత సేవలు నిలుపుదల
శ్రీశైలం: స్వస్తిశ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది మహోత్సవాలకు శ్రీశైల మహాక్షేత్రం సిద్ధమైంది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఇప్పటికే రెండు లక్షలకు పైగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈఓ నారాయణ భరత్‌గుప్త ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు చేరుకోవడంతో శ్రీశైల ఆలయ ప్రధాన పురవీధులు మొదలుకొని ఉచిత, ప్రత్యేక, అతిశీఘ్ర దర్శన క్యూలు నిండిపోయాయి. ఆదివారం ఉదయం 8.30 గంటలకు యాగశాల ప్రవేశం చేసి ప్రత్యేకపూజలతో ఉగాది ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఉదయం పది గంటలకు అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, 10.30గంటల నుంచి అమ్మవారికి విశేషకుంకుమార్చనలు, నవావర ణార్చన, చండీహోమాలు విశేష పూజలుంటాయి. అదే రోజు సాయంత్రం భ్రమరాంబాదేవిని మహాలక్ష్మి రూపంలో అలంకరించి, స్వామిఅమ్మవార్లను భృంగి వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8గంటల నుంచి శ్రీస్వామివార్లకు కల్యాణోత్సవం, శయనోత్సవ పూజలను నిర్వహిస్తారు.
భక్తులందరికీ దర్శన భాగ్యం..
ఉగాది ఉత్సవాల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తుల సౌకర్యం కోసం ఆలయ పూజావేళలో మార్పు చేశారు. అందరికీ స్వామివార్ల çదర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వేకువజామున 2.30గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. రద్దీ దృష్ట్యా మల్లన్న గర్భాలయంలో జరిగే అభిషేకాలు, అమ్మవారి అంతరాలయంలో జరిగే కుంకుమార్చన తదితర ఆర్జితసేవలను నిలుపుదల చేశారు.