వృషభాలపై మమకారం
వృషభాలపై మమకారం
Published Tue, Oct 18 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
పుట్లూరు : వ్యవసాయ రంగంలో ఇంత కాలం కీలకంగా ఉన్న పశుసంపదపై పుట్లూరు మండల వాసులు మమకారాన్ని వీడలేకున్నారు. పంట సాగులో సేద్యం మొదలు... దిగుబడులు ఇంటికి.... అనంతరం మార్కెట్‌కు చేర్చే వరకూ తమ కష్టంలో పాలు పంచుకున్న వృషభాలను ఇక్కడి రైతులు ప్రత్యేకంగా చూస్తుంటారు. ఎంతగా అంటే ఆఖరుకు అవి కాలం చేసిన తర్వాత సగౌరవంగా ఖననం చేసి, సమాధులు కట్టి పూజిస్తున్నారు.
వృlషభాలు లేనిదే ఒక్కప్పుడు సేద్యం చేయలేకపోయేవారు. రైతు అనేబడే ప్రతి ఒక్కరి ఇంటిలోనూ ఓ జత వృlషభాలు తప్పనిసరిగా ఉండేవి. అయితే వర్షాభావ పరిస్థితులతో కరువు ఛాయలు నెలకొనడంతో వాటిని పోషించుకోలేక రైతులు మదనపడుతూ వచ్చారు. అర్ధాకలితో అలమటిస్తున్న పశుసంపదను కాపాడుకునే మార్గం కానరాక... మరోకరి పంచనైనా వాటికి గ్రాసం దక్కుతుందన్న ఆశతో మనసు చంపుకుని విక్రయాలు సాగించారు. అయితే తమ ఆశయాలను వమ్ము చేస్తూ మధ్య దళారీలు పశుసంపదను కబేళాలకు తరలిస్తుండడంతో అన్నదాతలు కంగు తిన్నారు. దీంతో ఎంతటి కష్టనైనా భరిస్తూ తమ వద్ద ఉన్న పశువులు బతికున్నంత వరకూ మంచిగా చూసుకుంటూ... అవి కాలం చేసిన తర్వాత ఖననం చేసి, సమాధులు కట్టారు. పుట్లూరు గ్రామ పొలాల్లో ఇలాంటి సమాధులు కొకొల్లలుగా కనిపిస్తున్నాయి.
Advertisement