వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ కార్యాలయంలో గందరగోళం
కడప రూరల్ : ఎంపీహెచ్‌ఏ(ఎఫ్)లకు చేపట్టిన పదోన్నతుల కౌన్సెలింగ్‌పై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఈ శాఖ పరిధిలోని వైఎస్సార్ జిల్లాతోపాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎంపీహెచ్‌ఏ (ఎఫ్) నుంచి ఎంపీహెచ్‌ఎస్‌గా పదోన్నతులు కల్పించారు. ఈ క్యాడర్‌లో 86మందికి పదోన్నతి లభించింది. అలాగే హెల్త్ ఎడ్యుకేటర్స్‌గా పదోన్నతులకు ఏడుగురికిగాను ఆరుగురికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఒక ఉద్యోగినికి ఒకచోట పోస్టింగ్ ఇచ్చి రిజిష్టర్‌లో సంతకం కూడా తీసుకున్నారు. తర్వాత ఆమెకు మరోచోటికి పోస్టింగ్ ఇవ్వడంతో ఆ ఉద్యోగిని నిర్ఘాంతపోయింది. ఇదేమని ప్రశ్నించినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదు. ఇలా పలువురికి జరగడంతో ఉద్యోగులు బహిరంగంగానే ఆరోపణలకు దిగారు. కార్యాలయ సిబ్బంది తమకు అనుకూలమైన వారికి అనుకున్నచోటికి పోస్టింగ్ ఇచ్చారని వారంతా మండిపడ్డారు.