సమాజ సేవలోనే దైవత్వం
బుక్కరాయసముద్రం : సమాజ సేవ చేయడంలోనే దైవత్వం దాగి ఉంటుందని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. శనివారం మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆలూరి నారాయణమ్మ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆలూరి సాంబశివారెడ్డి మాతృమూర్తి ఆలూరి నారాయణమ్మ 10వ వర్ధంతి సందర్భంగా బోధన, బోధనేతర ఉద్యోగులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి«థులుగా జొన్నలగడ్డ పద్మావతితో పాటు కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి హాజరయ్యారు. జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ 2007 నవంబర్‌లో ఆలూరి నారాయణమ్మ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి.. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలు, విలువలతో కూడిన ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఎస్‌ఆర్‌ఐటీ స్థాపించామన్నారు. అలాగే ప్రతియేటా పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామన్నారు. అలాగే కళాశాలలో మానవతా రక్తదాతల సంస్థ కన్వీనర్ తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి, సలీం సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్నదానం కూడా చేపట్టారు. కార్యక్రమంలో కళాశాల సీఈఓ జగన్మోహన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, ఆలూరి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.