నాడు దణ్ణాలు... నేడు .... | Amaravathi people takes on chandrababu | Sakshi
Sakshi News home page

నాడు దణ్ణాలు... నేడు ....

Published Wed, Jan 27 2016 9:36 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

నాడు దణ్ణాలు... నేడు .... - Sakshi

నాడు దణ్ణాలు... నేడు ....

రాజధాని గ్రామాలపై మాట మార్చిన ముఖ్యమంత్రి
మాస్టర్ ప్లాన్‌లో మార్పులు ఉండవని పరోక్ష హెచ్చరికలు
మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ హామీలను సైతం పక్కన పెట్టిన బాబు
సీఎం వైఖరిపై రాజధాని గ్రామాల్లో ఆగ్రహావేశాలు

 
గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తాజాగా మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసినఅన్నదాతలపై చిర్రుబుర్రులాడుతున్నారు. అత్యాశకు పోవద్దని, మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు ఉండకపోవచ్చని రైతులను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.

ఆరులైన్ల రహదారి నిర్మాణం, స్థలాల కేటాయింపు, కోర్ కేపిటల్ నిర్మాణం, రుణ మాఫీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విజయవాడలో చేసిన వ్యాఖ్యలు రాజధాని గ్రామాల్లో చర్చనీయాంశమయ్యాయి. భూసమీకరణ సమయంలో ఇచ్చిన హామీలకు సీఎంతోపాటు మంత్రులు, పార్టీ నాయకులు భిన్నంగా  వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రధాని సాక్షిగా హామీ ఇచ్చి కాదంటున్నారు..
రైతుల ప్రయోజనాలు కాపాడతానని, రైతులు ఏ గ్రామంలో పొలం ఇస్తారో ఆ గ్రామంలోనే స్థలం ఇస్తానని, రైతులు సందేహపడాల్సిన పనిలేదని రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని నరేంద్రమోదీ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ‘ మా భూమి ఇక్కడే ఉంది...మేం ఇక్కడే ఉంటామంటే ఎలా కుదురుతుందని’  రైతులనుద్దేశించి మాట్లాడారు. అంటే, రైతులు ఏ గ్రామంలో పొలం ఇచ్చారో అక్కడే స్థలం ఇచ్చే అవకాశం లేదని సీఎం నర్మగర్భంగా చెపుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  
 
రైతుల ఆమోదం లేకుండా ఆరులైన్ల రహదారి నిర్మాణం జరగదని మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు ఇటీవల హామీ ఇచ్చారు.  వారి హామీని సీఎం  పరిగణనలోకి తీసుకోకుండా ‘ రోడ్లు, ప్రాజెక్టులు, మా ఊరి పక్కనే ఉండాలి...కానీ ..మా ఊళ్లోకి రాకూడదంటే ఎలా’ అని రైతులను ప్రశ్నించారు. అంటే రైతులకు ఇష్టం లేకపోయినా ఆరులైన్ల రహదారి నిర్మాణం ఆ గ్రామాల మీదుగానే సాగుతుందని పరోక్షంగా వివరించారు.
 
కోర్ కేపిటల్‌లో భయాందోళనలు..

ఆధునీకరణలో భాగంగా ఊళ్లన్నీ మారతాయని సీఎం చేసిన వ్యాఖ్యకు కోర్ కేపిటల్ నిర్మాణానికి ఎంపిక చేసిన ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మాస్టర్ ప్లాన్ అమలు పరిస్తే తమ గ్రామాలు గల్లంతు అవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ మూడు గ్రామాల విస్తీర్ణంలో 80 శాతానికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల నిర్మాణాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు.
 
దీనిని పరిశీలించిన రైతులు  మంత్రులను ప్రశ్నిస్తే, ఒక్క గ్రామాన్ని కూడా కదిలించేది లేదని హామీ ఇచ్చారు. ఆధునీకరణలో భాగంగా ఊళ్లన్నీ మారతాయని సీఎం చేసిన వ్యాఖ్య కోర్‌కేపిటల్ గ్రామాల గురించేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సీఎం ప్రకటనతో మబ్బులు వీడి రైతులు వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారు.
 
రుణమాఫీపై ప్లేటు ఫిరాయింపు...

ఇక రుణమాఫీపై సీఎం పూర్తిగా ప్లేటు మార్చారని రాజధాని గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. రాజధాని రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయనే హామీ తాను ఇవ్వలేదని, తాను చేస్తానన్న రుణమాఫీ చేసేశానన్న ప్రకటన రైతుల్ని మరింత కుంగదీసింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినందుకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇతర బాధ్యతలకు కూడా సరిపోలేదని, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు అలానే ఉన్నాయంటున్నారు. రుణమాఫీ హామీ ద్వారా అవన్నీ మాఫీ అవుతాయని భావిస్తున్న రైతులకు సీఎం ప్రకటన దిగ్భ్రాంతికి గురిచేసింది. వడ్డీతో కలిపి ఆ రుణాన్ని ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 అగ్నికి ఆజ్యం పోసిన సీఎం ప్రకటన ...
సీఎం వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా తయారయ్యాయి. ఇప్పటి వరకు టీడీపీ మంత్రులు, నాయకులు రైతులకు నచ్చచెప్పుకుంటూ వస్తున్నారు. రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెబుతూ గ్రామాల్లో ఆందోళనలు పెరగనీయకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు  సీఎం ప్రకటనతో రైతులకు నిజాలు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇవ్వం ..ఏం చేస్తారో చూస్తాం అంటూ తెగేసి చెపుతున్నారు.
 
మనోవేదనకు గురవుతున్నాం..
మాస్టర్‌ప్లాన్‌లో ఎక్స్‌ప్రెస్ రోడ్లు నిర్మాణం ప్రతిపాదించారు. అయితే మా ఇళ్ళు వదులుకునేందుకు సిద్ధంగా లేం.ఇప్పటికే భూములు ఇవ్వడం ద్వారా ఆవేదనగా ఉన్న సమయంలో గృహాలను కూడా త్యాగం చేయాలంటూ  ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం.
 -గుడిపూడి రాంబాబు,  తుళ్ళూరు
 
ప్రత్యామ్నాయం చూశాక మాట్లాడాలి..
పరిహారం కాదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాక ప్రభుత్వం గృహాల తొలగింపుపై మాట్లాడితే బాగుంటుంది. ఈ విషయం పై ప్రభుత్వం సీఆర్‌డీఏ అధికారులు అలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
 - సఫావత్ శ్రీనివాసరావు, తుళ్ళూరు
 
ప్రభుత్వంపై నమ్మకం పోయింది..

అధికారులు, ప్రజాప్రతినిధుల మాటలకు పొంతనలేదు. ఇక మాకెలా నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే భూములను కోల్పోయి నిరాశతో ఉన్న మాకు గ్రామకంఠాల విషయంలో ప్రభుత్వ తీరుపై పూర్తిగా నమ్మకం పోయింది.
 - పువ్వాడ వెంకట్రావ్, తుళ్ళూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement