core capital
-
ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి
జైట్లీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే విషయంలో మీరు చెప్పారు, మేము విన్నాం అన్నట్లుగా కాకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని తాము కోరుతున్నా ఈ దిశగా ఇప్పటివరకూ ఒక్క అడుగైనా ముందుకు పడలేదన్నారు. ప్రజల్లో ప్రత్యేక హోదా ఆకాంక్ష బలంగా ఉన్నప్పటికీ తాము ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని, దీనికి చట్టబద్ధత కల్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ప్రజల కు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వాపోయారు. రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల శంకుస్థాపనకు వచ్చిన అరుణ్ జైట్లీకి సీఎం చంద్రబాబు శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్లో విందు ఇచ్చారు. చంద్రబాబు వినతిపై స్పందించిన జైట్లీ తాము ఈ విషయమై ఇప్పటి కే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించామని, ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని, వచ్చే మంత్రివర్గ సమావేశం లేదంటే ఆ తరువాతి మంత్రివర్గ సమావేశంలో దీనికి చట్టబద్ధత కల్పించే అంశానికి ఆమోదముద్ర వేస్తామని చెప్పినట్లు సమాచారం. జైట్లీకి చంద్రబాబు వినతిపత్రాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను ‘నాబార్డు’ రుణం రూపంలో ఇస్తుందని జైట్లీ పేర్కొన్నారు. దీనిపై తాము నాబార్డుకు సూచన చేశామని, మీరు ఎంత వేగంగా పనులు చేస్తే అంతేవేగంగా నిధులు రుణం రూపంలో ఆ సంస్థ నుంచి వస్తాయని వెల్లడించారు.రాజధానికి భూములిచ్చిన రైతులకు పన్ను మినహాయింపుల అంశంపై దృష్టి సారించాలని సీఎం కోరారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించగా... రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకూ తానూఒక మాట చెబుతాను, అయినా ఈ విషయంలో ఒడిశా నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని జైట్లీ పేర్కొన్నట్లు తెలిసింది. -
చంద్రబాబు విన్నపాన్ని పట్టించుకోని జైట్లీ
గుంటూరు: విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినా విభజన చట్టంలో చేర్చలేదు. దీన్ని సాకుగా చూపి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకుండా, ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. భవిష్యత్‌లో ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనే ఇదే సమస్య ఎదురవుతుందా? శుక్రవారం ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన సంఘటన సందేహాలకు తావిస్తోంది. ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటూ టీడీపీ నిన్నటి వరకూ హడావుడి చేసింది. కోర్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటూ వేదికపై నుంచి చంద్రబాబు.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. అయితే కేంద్ర మంత్రి జైట్లీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. అలాగే రైతులకు కేపిటల్ గెయిన్స్ మినహాయింపుపైనా స్పష్టత రాలేదు. ఢిల్లీ వెళ్లి పరిశీలిస్తామని జైట్లీ చెప్పారు. -
ఈ గడ్డపై నుంచే ప్రజలకు మేలు జరుగుతుంది
గుంటూరు: హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండేలా విభజన చట్టంలో చేర్చారని, అమరావతి నుంచే పాలించాలని, ఈ గడ్డపై నుంచే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ముందుగా ఇక్కడికి వచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయించామని, తాత్కాలిక రాజధానిని కూడా ప్రారంభించామని చెప్పారు. ఈ రోజు మరో సుదినమని, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. -
గ్రేటర్ అమరావతి అవుతుంది
-
గ్రేటర్ అమరావతి అవుతుంది
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాదిరిగా అమరావతి కూడా గ్రేటర్ అమరావతి అవుతుందని చెప్పారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వెంకయ్య మాట్లాడుతూ.. తమ భవిష్యత్, బిడ్డల భవిష్యత్ బాగుండాలని రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని, వారిని అభినందిస్తున్నట్టు చెప్పారు. సభలో వెంకయ్య ఇంకా ఏ మాట్లాడారంటే.. ప్రపంచంలో భారత్ వేగంగా దూసుకెళ్తోంది ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే భారత్ బలోపేతంగా ఉంది దేశంలో రామరాజ్యం కోసం ప్రధాని మోదీ తపిస్తున్నారు దేశం మారుతూ ఉంది. దేశాన్ని అవినీతిరహితంగా, శక్తివంతంగా చేయడంలో అందరూ భాగస్వాములు కావాలి ఏపీ విభజన సందర్భంగా జరిగిన పరిస్థితులు తెలుసు ఏపీని ఆదుకోవడానికి గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా కేంద్ర సాయం చేస్తోంది మన భవిష్యత్ బాగుంటుంది. మన కలలు నెరవేరుతాయి విభజన చట్టంలోని అన్ని హామీలను కేంద్రం నెరవేరుస్తోంది విభజన చట్టంలో చేర్చని వాటిని కూడా అమలు చేస్తాం కేంద్రాన్ని విమర్శించేవాళ్లను పట్టించుకోవడం లేదు ఏపీకి కేంద్రం ఎన్నో విద్యా సంస్థలను మంజూరు చేసింది రాష్ట్ర రాజధానికి మెట్రో రైలు ఏర్పాటు చేస్తాం ఏపీలో కరెంట్ కొరత లేదు కేంద్రం సాయంతో ఏపీలో 24 గంటలూ విద్యుత్ ఇస్తున్నారు రాజ్యసభలో ఆనాడు నేను మాట్లాడబట్టే రాష్ట్రానికి మేలు జరిగింది 64 వేల కోట్లతో జాతీయ రహదారులను విస్తరిస్తాం మోదీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా -
కోర్ కేపిటల్ నిర్మాణానికి జైట్లీ శంకుస్థాపన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. శుక్రవారం లింగాయపాలెం గ్రామంలో జైట్లీ భూమిపూజ చేసి శిలఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ పర్యటనలో భాగంగా జైట్లీ పరిపాలనా భవనాలతో పాటు రూ. 1,016 కోట్లతో నిర్మించే ఏడు గ్రిడ్ రోడ్లు, రూ. 461 కోట్లతో నిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జైట్లీ పాల్గొన్నారు. బహిరంగ సభ కోసం దాదాపు 100 ఎకరాలలో భూమిని చదును చేసినట్లు అధికారులు తెలిపారు. వీవీఐపీలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణనాయక్ చెప్పారు. ఈ రోజు సాయంత్రం విజయవాడ నుంచి జైట్లీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. రెండున్నరేళ్లు గడిచినా అమరావతిలో రాజధానికి సంబంధించిన ఒక్క నిర్మాణాన్నీ మొదలు పెట్టలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పదేపదే శంకుస్థాపనలు మాత్రం చేసుకుంటూ పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2015 జూన్ 6న రాజధానికి తాళ్లాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. 2015 అక్టోబర్ 22 దసరా నాడు ఉద్ధండరాయునిపాలెంలో భారీ ఖర్చుతో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. 2016 ఫిబ్రవరి 17న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేశారు. తాజాగా డిజైన్ కూడా ఖరారు కాని కోర్ కేపిటల్ నిర్మాణానికి జైట్లీతో శంకుస్థాపన చేయించారు. -
నాడు దణ్ణాలు... నేడు ....
రాజధాని గ్రామాలపై మాట మార్చిన ముఖ్యమంత్రి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు ఉండవని పరోక్ష హెచ్చరికలు మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ హామీలను సైతం పక్కన పెట్టిన బాబు సీఎం వైఖరిపై రాజధాని గ్రామాల్లో ఆగ్రహావేశాలు గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తాజాగా మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసినఅన్నదాతలపై చిర్రుబుర్రులాడుతున్నారు. అత్యాశకు పోవద్దని, మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు ఉండకపోవచ్చని రైతులను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఆరులైన్ల రహదారి నిర్మాణం, స్థలాల కేటాయింపు, కోర్ కేపిటల్ నిర్మాణం, రుణ మాఫీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విజయవాడలో చేసిన వ్యాఖ్యలు రాజధాని గ్రామాల్లో చర్చనీయాంశమయ్యాయి. భూసమీకరణ సమయంలో ఇచ్చిన హామీలకు సీఎంతోపాటు మంత్రులు, పార్టీ నాయకులు భిన్నంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని సాక్షిగా హామీ ఇచ్చి కాదంటున్నారు.. రైతుల ప్రయోజనాలు కాపాడతానని, రైతులు ఏ గ్రామంలో పొలం ఇస్తారో ఆ గ్రామంలోనే స్థలం ఇస్తానని, రైతులు సందేహపడాల్సిన పనిలేదని రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని నరేంద్రమోదీ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ‘ మా భూమి ఇక్కడే ఉంది...మేం ఇక్కడే ఉంటామంటే ఎలా కుదురుతుందని’ రైతులనుద్దేశించి మాట్లాడారు. అంటే, రైతులు ఏ గ్రామంలో పొలం ఇచ్చారో అక్కడే స్థలం ఇచ్చే అవకాశం లేదని సీఎం నర్మగర్భంగా చెపుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రైతుల ఆమోదం లేకుండా ఆరులైన్ల రహదారి నిర్మాణం జరగదని మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు ఇటీవల హామీ ఇచ్చారు. వారి హామీని సీఎం పరిగణనలోకి తీసుకోకుండా ‘ రోడ్లు, ప్రాజెక్టులు, మా ఊరి పక్కనే ఉండాలి...కానీ ..మా ఊళ్లోకి రాకూడదంటే ఎలా’ అని రైతులను ప్రశ్నించారు. అంటే రైతులకు ఇష్టం లేకపోయినా ఆరులైన్ల రహదారి నిర్మాణం ఆ గ్రామాల మీదుగానే సాగుతుందని పరోక్షంగా వివరించారు. కోర్ కేపిటల్లో భయాందోళనలు.. ఆధునీకరణలో భాగంగా ఊళ్లన్నీ మారతాయని సీఎం చేసిన వ్యాఖ్యకు కోర్ కేపిటల్ నిర్మాణానికి ఎంపిక చేసిన ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మాస్టర్ ప్లాన్ అమలు పరిస్తే తమ గ్రామాలు గల్లంతు అవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ మూడు గ్రామాల విస్తీర్ణంలో 80 శాతానికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల నిర్మాణాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. దీనిని పరిశీలించిన రైతులు మంత్రులను ప్రశ్నిస్తే, ఒక్క గ్రామాన్ని కూడా కదిలించేది లేదని హామీ ఇచ్చారు. ఆధునీకరణలో భాగంగా ఊళ్లన్నీ మారతాయని సీఎం చేసిన వ్యాఖ్య కోర్కేపిటల్ గ్రామాల గురించేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సీఎం ప్రకటనతో మబ్బులు వీడి రైతులు వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారు. రుణమాఫీపై ప్లేటు ఫిరాయింపు... ఇక రుణమాఫీపై సీఎం పూర్తిగా ప్లేటు మార్చారని రాజధాని గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. రాజధాని రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయనే హామీ తాను ఇవ్వలేదని, తాను చేస్తానన్న రుణమాఫీ చేసేశానన్న ప్రకటన రైతుల్ని మరింత కుంగదీసింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినందుకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇతర బాధ్యతలకు కూడా సరిపోలేదని, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు అలానే ఉన్నాయంటున్నారు. రుణమాఫీ హామీ ద్వారా అవన్నీ మాఫీ అవుతాయని భావిస్తున్న రైతులకు సీఎం ప్రకటన దిగ్భ్రాంతికి గురిచేసింది. వడ్డీతో కలిపి ఆ రుణాన్ని ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసిన సీఎం ప్రకటన ... సీఎం వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా తయారయ్యాయి. ఇప్పటి వరకు టీడీపీ మంత్రులు, నాయకులు రైతులకు నచ్చచెప్పుకుంటూ వస్తున్నారు. రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెబుతూ గ్రామాల్లో ఆందోళనలు పెరగనీయకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సీఎం ప్రకటనతో రైతులకు నిజాలు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇవ్వం ..ఏం చేస్తారో చూస్తాం అంటూ తెగేసి చెపుతున్నారు. మనోవేదనకు గురవుతున్నాం.. మాస్టర్‌ప్లాన్‌లో ఎక్స్‌ప్రెస్ రోడ్లు నిర్మాణం ప్రతిపాదించారు. అయితే మా ఇళ్ళు వదులుకునేందుకు సిద్ధంగా లేం.ఇప్పటికే భూములు ఇవ్వడం ద్వారా ఆవేదనగా ఉన్న సమయంలో గృహాలను కూడా త్యాగం చేయాలంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం. -గుడిపూడి రాంబాబు, తుళ్ళూరు ప్రత్యామ్నాయం చూశాక మాట్లాడాలి.. పరిహారం కాదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాక ప్రభుత్వం గృహాల తొలగింపుపై మాట్లాడితే బాగుంటుంది. ఈ విషయం పై ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులు అలోచించుకోవాల్సిన అవసరం ఉంది. - సఫావత్ శ్రీనివాసరావు, తుళ్ళూరు ప్రభుత్వంపై నమ్మకం పోయింది.. అధికారులు, ప్రజాప్రతినిధుల మాటలకు పొంతనలేదు. ఇక మాకెలా నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే భూములను కోల్పోయి నిరాశతో ఉన్న మాకు గ్రామకంఠాల విషయంలో ప్రభుత్వ తీరుపై పూర్తిగా నమ్మకం పోయింది. - పువ్వాడ వెంకట్రావ్, తుళ్ళూరు