చంద్రబాబు విన్నపాన్ని పట్టించుకోని జైట్లీ
గుంటూరు: విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినా విభజన చట్టంలో చేర్చలేదు. దీన్ని సాకుగా చూపి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకుండా, ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. భవిష్యత్లో ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనే ఇదే సమస్య ఎదురవుతుందా? శుక్రవారం ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన సంఘటన సందేహాలకు తావిస్తోంది.
ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటూ టీడీపీ నిన్నటి వరకూ హడావుడి చేసింది. కోర్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటూ వేదికపై నుంచి చంద్రబాబు.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. అయితే కేంద్ర మంత్రి జైట్లీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. అలాగే రైతులకు కేపిటల్ గెయిన్స్ మినహాయింపుపైనా స్పష్టత రాలేదు. ఢిల్లీ వెళ్లి పరిశీలిస్తామని జైట్లీ చెప్పారు.