గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. శుక్రవారం లింగాయపాలెం గ్రామంలో జైట్లీ భూమిపూజ చేసి శిలఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏపీ పర్యటనలో భాగంగా జైట్లీ పరిపాలనా భవనాలతో పాటు రూ. 1,016 కోట్లతో నిర్మించే ఏడు గ్రిడ్ రోడ్లు, రూ. 461 కోట్లతో నిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జైట్లీ పాల్గొన్నారు. బహిరంగ సభ కోసం దాదాపు 100 ఎకరాలలో భూమిని చదును చేసినట్లు అధికారులు తెలిపారు. వీవీఐపీలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణనాయక్ చెప్పారు. ఈ రోజు సాయంత్రం విజయవాడ నుంచి జైట్లీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.
రెండున్నరేళ్లు గడిచినా అమరావతిలో రాజధానికి సంబంధించిన ఒక్క నిర్మాణాన్నీ మొదలు పెట్టలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పదేపదే శంకుస్థాపనలు మాత్రం చేసుకుంటూ పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2015 జూన్ 6న రాజధానికి తాళ్లాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. 2015 అక్టోబర్ 22 దసరా నాడు ఉద్ధండరాయునిపాలెంలో భారీ ఖర్చుతో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. 2016 ఫిబ్రవరి 17న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేశారు. తాజాగా డిజైన్ కూడా ఖరారు కాని కోర్ కేపిటల్ నిర్మాణానికి జైట్లీతో శంకుస్థాపన చేయించారు.
కోర్ కేపిటల్ నిర్మాణానికి జైట్లీ శంకుస్థాపన
Published Fri, Oct 28 2016 3:39 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
Advertisement