జైట్లీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే విషయంలో మీరు చెప్పారు, మేము విన్నాం అన్నట్లుగా కాకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని తాము కోరుతున్నా ఈ దిశగా ఇప్పటివరకూ ఒక్క అడుగైనా ముందుకు పడలేదన్నారు. ప్రజల్లో ప్రత్యేక హోదా ఆకాంక్ష బలంగా ఉన్నప్పటికీ తాము ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని, దీనికి చట్టబద్ధత కల్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ప్రజల కు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వాపోయారు. రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల శంకుస్థాపనకు వచ్చిన అరుణ్ జైట్లీకి సీఎం చంద్రబాబు శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో విందు ఇచ్చారు. చంద్రబాబు వినతిపై స్పందించిన జైట్లీ తాము ఈ విషయమై ఇప్పటి కే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించామని, ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని, వచ్చే మంత్రివర్గ సమావేశం లేదంటే ఆ తరువాతి మంత్రివర్గ సమావేశంలో దీనికి చట్టబద్ధత కల్పించే అంశానికి ఆమోదముద్ర వేస్తామని చెప్పినట్లు సమాచారం.
జైట్లీకి చంద్రబాబు వినతిపత్రాలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను ‘నాబార్డు’ రుణం రూపంలో ఇస్తుందని జైట్లీ పేర్కొన్నారు. దీనిపై తాము నాబార్డుకు సూచన చేశామని, మీరు ఎంత వేగంగా పనులు చేస్తే అంతేవేగంగా నిధులు రుణం రూపంలో ఆ సంస్థ నుంచి వస్తాయని వెల్లడించారు.రాజధానికి భూములిచ్చిన రైతులకు పన్ను మినహాయింపుల అంశంపై దృష్టి సారించాలని సీఎం కోరారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించగా... రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకూ తానూఒక మాట చెబుతాను, అయినా ఈ విషయంలో ఒడిశా నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని జైట్లీ పేర్కొన్నట్లు తెలిసింది.
ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి
Published Sat, Oct 29 2016 1:58 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
Advertisement