ఏపీకి ఉత్తరాఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వండి: బాబు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి భేటీ ముగిసింది. ఈ సమావేశం సుమారు గంటపాటు సాగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులను బాబు ఈ సందర్భంగా జైట్లీకి వివరించారు.
భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, కొత్త రాజధాని, వనరుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రైతుల రుణమాఫీ విషయాన్ని కూడా జైట్లీతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ తరహా ఆర్థిక, పారిశ్రామిక ప్రోత్సాహక ప్యాకేజీ ఇవ్వాలని కోరినట్లు బాబు చెప్పారు. లోటు బడ్జెట్ నేపథ్యంలో జీతభత్యాలకు ఆర్థిక సాయం అందించాలని బాబు...కేంద్రమంత్రిని కోరారు.
అనంతరం అరుణ్ జైట్లీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం ప్రణాళికా సంఘం పరిధిలో ఉందని జైట్లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణాని తాము సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా పాల్గొన్నారు. మరోవైపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ అథార్టీని ప్రకటించాలని కోరారు. జనవనరులపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు.