అభివృద్ధి అంతా అమరావతిలోనేనా?
సీపీఎం రాయలసీమ అభివృద్ధి సబ్ కమిటీ కన్వీనర్ ఓబులు
ధర్మవరంటౌన్: అభివృద్ధిని రాజధాని అమరావతికి పరిమితం చేస్తూ సీఎం చంద్రబాబు రూ. లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, సీమకు మాత్రం గాలి హామీలను ఇస్తున్నారని రాయలసీమ అభివృద్ధి కమిటీæ కన్వీనర్ ఓబులు విమర్శించారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతానికే అభివృద్ధిని పరిమతం చేస్తే మళ్లీ వేర్పాటువాద ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కరువు జిల్లా అనంతలో ఇప్పటికి 13 సార్లు పర్యటించిన సీఎం ఒక్క పరిశ్రమనైన ఏర్పాటు చేశారా...? నిధులను కేటాయించారా..? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆగస్టు 15న అనంతలో జెండా ఎగుర వేయడం వల్ల ఇక్కడి ప్రజలకు ఒరిగేది ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, సీమకు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఎస్‌హెచ్ బాషా, పోలా లక్ష్మీనారాయణ, జేవీ రమణ, ఆదినారాయణ, హైదర్‌వలి పాల్గొన్నారు.