అంబేడ్కర్ విగ్రహ తొలగింపుపై ఉద్రిక్తత
ఆర్డీవో, సీఐలను అడ్డుకున్న దళితులు
తీవ్ర వ్యతిరేకతతో అధికారుల వెనకడుగు
హనుమాన్‌జంక్షన్ రూరల్ :
స్థానిక గుడివాడ రోడ్డులోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహ తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే... ఎంఎన్‌కే రహాదారికి పక్కనే అంబేడ్కర్ విగ్రహాన్ని దళిత సంఘాలు ఏర్పాటు చేశాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని కొందరు హైకోర్టుకెళ్లారు. ఈ నేప«థ్యంలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించాలని హైకోర్టు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్ భరత్, ఏలూరు రూరల్ సీఐ అడపా నాగ మురళీ తమ సిబ్బందితో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు వచ్చారు. దీంతో అప్పనవీడుకు చెందిన దళితులు పెద్దసంఖ్యలో తరలివచ్చి తొలగింపును వ్యతిరేకించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్, ఎంఆర్‌పీఎస్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు ఐనంపూడి ఆశీర్వాదం ఆధ్వర్యంలో విగ్రహాం వద్ద అందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించటాన్ని సహించబోమంటూ పెద్ద ఎత్తున దళితులు నిరసనకు దిగటంతో ఉద్రిక్తత ఏర్పడింది.
వచ్చే నెల 10వ తేది వరకు గడువు ఇవ్వాలని వెలగపల్లి ప్రదీప్, ఐనంపూడి ఆశీర్వాదం కోవటంతో ఆర్డీవో సమ్మతించారు. దీంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. ఏలూరు డీఎల్‌పీవో రాజ్యలక్ష్మీ, పెదపాడు తహశీల్దార్ జి.జె.ఎస్.కుమార్, ఏలూరు త్రీటౌన్ ఎస్సై మాతంగి సాగర్‌బాబు, ఈవోఆర్డీ కె.మహాలక్ష్మీ, ఎంపీటీసీ సభ్యురాలు వల్లె జ్యోతి, కె.వి.పి.ఎస్. మండల కార్యదర్శి కొత్తూరు రంగారావు పాల్గొన్నారు.