
ఇక్కడి వ్యవసాయంపై అమెరికా ఆసక్తి
♦ ఆ దేశ వ్యవసాయ వ్యవహారాల అధికారి స్కాట్ సిండేలర్ వెల్లడి
♦ ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తామని మంత్రి పోచారానికి లేఖ
♦ అమెరికా ఆసక్తిపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల ఆశ్చర్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ విధానంపై అమెరికా ఆసక్తి ప్రదర్శిస్తోంది. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న పద్ధతులను అధ్యయనం చేయాలని యోచిస్తోంది. అమెరికాకు, తెలంగాణకు మధ్య వ్యవసాయరంగంలో అభివృద్ధికి గల అవకాశాలపై అధ్యయనం చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు అమెరికా ఎంబసీలోని వ్యవసాయ వ్యవహారాల మినిస్టర్-కౌన్సిలర్ స్కాట్ ఎస్.సిండేలర్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ రాశారు. ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అమెరికా వ్యవసాయ శాఖ కార్యకలాపాలు ఏవిధంగా ఉండాలనే దానిపై మంత్రి పోచారంతో చర్చిస్తానని వెల్లడించారు.
భారతదేశ వ్యవసాయరంగంలో తెలంగాణ ఒకానొక ఆదర్శవంతమైన రాష్ట్రమని స్కాట్ సిండేలర్ కొనియాడారు. వ్యవసాయరంగం ఎదుర్కొనే సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన విధానాలను అవలంభిస్తుందన్న అంశాన్ని అధ్యయనం చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగంపై అమెరికా ఎందుకు ఆసక్తి ప్రదర్శిస్తుందన్న అంశం రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. అకస్మాత్తుగా అమెరికాకు చెందిన ఒక కీలకాధికారి రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు లేఖ ద్వారా తెలియజేయడం ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. అధికారులూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనే తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని, ప్రపంచంలోనూ ఒకానొక కీలకమైన ప్రాంతంగా చేయాలని ఇటీవల జరిగిన జాతీయ విత్తన కాంగ్రెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్దేశాలను వెల్లడించింది. ప్రపంచంలో అవకాశం ఉన్నచోట్లా విత్తన ఎగుమతులు చేపట్టాలని నిర్ణయించింది. వ్యవసాయరంగంలో ఎగుమతులకు సంబంధించి ఇదే తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న కీలకమైన కార్యక్రమం. మరోటి జన్యుమార్పిడి పరీక్షలకు అనుమతి ఇవ్వాలన్న దానిపైనా కమిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బహుళజాతి విత్తన కంపెనీలకు వరంగా మారింది. ఈ ఉత్తర్వులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా తెలంగాణకు సంబంధించి కీలకమైన అంశాలు ఇవేనని అంటున్నారు. ఇంతకుమించి అమెరికా ఆసక్తి ప్రదర్శించడానికి ఇతర అంశాలు ఏమీ లేవంటున్నారు. ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో స్కాట్ సిండేలర్ సమావేశం కానున్నారు.