కౌలు రైతులకు ‘పెట్టుబడి’ ఇవ్వలేం | Minister Pocharam Clarification In the legislative council | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు ‘పెట్టుబడి’ ఇవ్వలేం

Published Tue, Mar 20 2018 1:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Minister Pocharam Clarification In the legislative council - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాళ్లూ రప్పలున్న భూముల రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అన్నిరకాల భూములకు సాయం అందుతుందని చెప్పారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, టి.భానుప్రసాద్, భూపాల్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పోచారం సమాధానమిచ్చారు. కౌలుదారులకు పెట్టుబడి సాయం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. భూ యజమానులకే ఇస్తామన్నారు. ఉద్యాన పంటలకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామన్నారు.

పెట్టుబడి సాయం కింద చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో నగదు కొరత లేకుండా చూసేందుకు సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని, తాము కూడా కేంద్ర ఆర్థికమంత్రిని కలిశామని తెలిపారు. పెట్టుబడి పంపిణీ చేపట్టేనాటికి అవసరమైన కరెన్సీ రాష్ట్రానికి రానుం దని తెలిపారు. ఏ బ్యాంకులోనైనా చెల్లుబాటయ్యేలా ఆర్డర్‌ చెక్కులను పంపిణీ చేస్తామని, చెక్కుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 1.42 కోట్ల ఎకరాలకు చెందిన 72 లక్షల మంది రైతులకు ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం చేస్తామని, రబీ లో మాత్రం సాగయిన భూములకే ఇస్తామన్నారు. పెట్టుబడి సాయాన్ని ఖరీఫ్‌కు వచ్చే నెల 19 నుంచి మే నెలాఖరు వరకు అందజేస్తామన్నారు. రబీ సాయాన్ని నవంబర్‌ 20 నుంచి ఇస్తామన్నారు. ప్రజాప్రతినిధులంతా పెట్టుబడి పంపిణీలో భాగస్వాములవుతారన్నారు. రాష్ట్రం లో 2,638 రైతు మందిరాలను నిర్మిస్తామన్నారు. వాటికోసం 654 చోట్ల ఇప్పటికే భూమి సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడి సాయాన్ని తాను వదులుకుంటున్నట్లు సభ్యుడు భూపాల్‌రెడ్డి సభలో ప్రకటించారు.  

భాషాపండితులకు న్యాయం 
రాష్ట్రంలో 2,487 మంది భాషా పండితులను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేయడానికి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టును ఆశ్రయించారని, నియామక నియమావళి సవరించే వరకు స్కూలు అసిస్టెంట్‌ పదవులను భర్తీ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోపే అడ్వకేట్‌ జనరల్‌తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని కడియం హామీ ఇచ్చారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని రాములు నాయక్‌ విజ్ఞప్తి చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116కు పెంచు తున్నట్లు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement