అమ్మపాలు..అమృతం!
►ముర్రుపాలతో బిడ్డకు శ్రేయస్కరం
►పుట్టిన అరగంటలోగా తాగించాలి
►‘నిరంతర’ అవగాహనతోనే సత్ఫలితాలు
⇒బాలింతలు : 34,698
⇒గర్భిణులు : 37,024
⇒ ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు : 1,50,668
అనంతపురం మెడికల్: మహిళ జీవితంలో ‘మాతృత్వం’ ఓ వరం. తల్లిపాలలో పోషకాలు అధికంగా ఉంటాయి. పుట్టిన వెంటనే శిశువుకు పట్టించే తల్లిపాలు అమృతంతో సమానమని వైద్యులు చెబుతున్నారు. ముర్రుపాలు శిశువుకు ఎలాంటి జబ్బు రాకుండా శ్రీరామరక్షలా కాపాడుతుందని అంటున్నారు. పుట్టినప్పుడు చంటి బిడ్డలకు పాలిచ్చే విషయంలో కొందరు బాలింతలు కొన్ని అపోహలకు లోనవుతున్నారు. ఈ క్రమంలో చిన్నారులకు తల్లిపాలను దూరం చేస్తూ మాతృత్వపు మాధుర్యాన్ని కోల్పోవడమే కాకుండా బిడ్డ అనారోగ్యం బారిన పడేందుకు కారణమవుతున్నారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వైద్యులు వివరించారు.
అవన్నీ అపోహలు మాత్రమే..!
పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు పడితే 22 శాతం మరణాలు నివారించవచ్చని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తల్లి పాలు శిశువులో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే దురదృష్ణవశాత్తూ కొందరు తల్లులు వారికున్న కొన్ని అపోహల వల్ల బిడ్డలకు తల్లిపాలకు బదులు పోతపాలు పట్టిస్తూ శిశువు అనారోగ్యం బారిన పడేందుకు కారణమవుతున్నారు. మాటిమాటికీ బిడ్డకు పాలుపడితే రొమ్ము ఆకృతి పాడవుతుందనీ.. రొమ్ములో గడ్డలు వస్తాయనీ.. చిన్నారికి తల్లిపాలు పట్టించడం వల్ల బలహీనమవుతామని చాలా మంది మహిళల్లో అపోహలు ఉన్నాయి. ఇది ఏ మాత్రం సరికాదని, ముర్రుపాలే బిడ్డకు శ్రేయస్కరమని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు.
బిడ్డ ఎదుగుదలకు ‘తల్లిపాలు’
ప్రసవమైన తొలిరోజుల్లో ముర్రుపాలు పట్టడం వల్ల శిశువుకు కలిగే ఉపయోగాలు అనేకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. తల్లిపాలలో విటమిన్ ‘ఏ’ అధికంగా ఉంటుంది. ముర్రుపాలు తాగనివారితో పోలిస్తే తాగిన వారిలో శిశు మరణాలు ఐదారురెట్లు తగ్గాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పుట్టిన బిడ్డ మొదటి ఆరు నెలల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదిగేందుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. తల్లిపాలు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మలేరియా రాకుండా కాపాడే ‘పారా ఎమిన్ బెంజాయిక్’ ఆమ్లం తల్లిపాల ద్వారానే బిడ్డకు అందుతుంది. చిన్నారుల్లో విరేచనాలకు కారణమయ్యే సూక్ష్మజీవుల్ని నాశనం చేసే రక్షక కణాలు అమ్మపాలలో ఉంటాయి. వివిధ వ్యాధులకు కారణమై బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి సంపూర్ణ సంరక్షణ తల్లిపాలలో దొరుకుతుంది. ముర్రుపాలలో ఎలాంటి వ్యాధికారక క్రిములు ఉండవు.
తల్లులకూ మంచిదే
బిడ్డకు పాలు పట్టడం వల్ల తల్లులకు అధిక రక్తస్రావం తగ్గుముఖం పడుతుంది. బిఽడ్డకుపాలు పట్టే వారు సులభంగా బరువు తగ్గి మునుపటి ఆకృతిని అతి త్వరలోనే సొంతం చేసుకుంటారు. రొమ్ముపాలు పట్టడం వల్ల దీర్ఘకాలంలో ఆస్టియోపోరోసిస్, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.
‘నిరంతర’ అవగాహన అవసరం
తల్లిపాలపై ప్రతి ఏటా వారోత్సవాలను నిర్వహిస్తూ ప్రచారం కల్పిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో చైతన్యం రావడం లేదన్నది వాస్తవం. బిడ్డలకు తల్లిపాలు పుష్కలంగా అందించడంలో మహిళలకు ఎన్నో అపోహలున్నాయి. వారికి తల్లిపాల ఆవశ్యకతను తెలియజేసేందుకు కేవలం తల్లిపాల వారోత్సవాలతోనే సరిపెట్టకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించి వారిలో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది. ఇందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖలు సమష్టిగా బాలింతల్లో చైతన్యం కల్పించాలి.
రోగ నిరోధకశక్తి అధికం
తల్లిపాలలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. బిడ్డ పుట్టగానే అరగంటలోగా తల్లిపాలు పట్టించాలి. ముర్రుపాలు శ్రేష్టమైనవి. పాలు పట్టించే విషయంలో చాలా మందికి అపోహలున్నాయి. వాటిని వీడండి. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తప్పనిసరి.
- డాక్టర్ దినకర్, పురిటి పిల్లల వైద్య నిపుణుడు, సర్వజనాస్పత్రి
రెండేళ్ల వరకు పాలు పట్టచ్చు :
బిడ్డకు రెండేళ్ల వయసు వచ్చే వరకు పాలు పట్టవచ్చు. తల్లి పాలలో పోషకాలు ఎక్కువ. ఇతర పిల్లలతో పోలిస్తే తల్లిపాలు తాగే పిల్లల్లో ఐక్యూ కూడా అధికం. రొమ్ము ఆకృతి, ఇతరత్రా అపోహలుంటే వీడి పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
– డాక్టర్ ప్రవీణ్‌దీన్ కుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, సర్వజనాస్పత్రి