అమృత పథకం ప్రారంభం
కర్నూలు (టౌన్): జనచైతన్య యాత్రల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం.. నగరంలోని కిడ్స్ వరల్డ్ వద్ద అమృత్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం క్రింద రూ. 54.35 కోట్లతో పైపులైన్ నిర్మాణం, రూ. 12 కోట్లతో సిటీ పార్కు ఏర్పాటు చేయనున్నారు. వాటి శిలాఫలకాలను సీఎం అవిష్కరించారు.
పాతబస్తీలో పాదయాత్ర
ముఖ్యమంత్రి చంద్రబాబు నగరంలోని పాతబస్తీలో పాదయాత్ర నిర్వహించారు. కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కళశాల రహదారి మీదుగా నెహ్రూ రోడ్డు వరకు ఓకటిన్నర కిలోమీటర్ పాదయాత్ర గంటకుపైగా కొనసాగింది. ఉస్మానియా కళశాల విద్యార్థులు, ముస్లిం మహిళలతో సీఎం కొద్ది సేపు మాట్లాడారు. కర్నూలు నగరం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.కర్నూలులో ఉర్దూ యూనివర్సీటిని ఏర్పాటు చేశామని, త్వరలోనే ప్రత్యేక డీఎస్పీ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కర్నూలులో రూ.210 కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పాదయాత్రలో సీఎం చంద్రబాబుకు తమ సమస్యలు తెలియజేసేందుకు ప్రయత్నించే అవకాశం రాకపోవడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్
ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్‌ను ఏర్పాటు చేసి చెన్నై కారిడార్‌కు అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శనివారం ఔట్‌డోర్ స్టేడియంలో ఆడబిడ్డ పసుపు– కుంకుమ రెండో విడత పెట్టుబడి నిధి కింద రూ. 126 కోట్లు చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కర్నూలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ. 15 వేల కోట్లతో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంటు త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో రూ. 14 వేల కోట్లతో వివిధ పరిశ్రమలు నెలకొల్పి 15 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఓర్వకల్లు వద్ద విమానాశ్రయం, ఇండస్ట్రియల్ హబ్, కొలిమిగుండ్ల ప్రాంతంలో సిమెంట్ హబ్ పనులు జరుగుతున్నాయన్నారు.