శరీరదానం.. కళాకారుడి ఔన్నత్యం
తాడేపల్లిగూడెం : ఆయన వృత్తిరీత్యా ఆర్టీసీ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రవృత్తి కళారంగం. నాటకాలు, సందేశాత్మక నాటికలంటే ఇష్టం. ప్రాచీన కళారూపాలు, సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణకు కళాకారులు కారకులని నమ్ముతారు. సామాజిక రుగ్మతలను కళారూపాల ద్వారా పారద్రోలవచ్చని విశ్వసిస్తారు తాడేపల్లిగూడేనికి చెందిన ధవళసత్యం కళామిత్రమండలి కార్యదర్శి కాళ్ల నారాయణరావు. ఆయన శరీరదానం చేసి ఆదర్శంగా నిలిచారు. తన శరీరంలోని అవయవాలు పదిమంది ప్రాణం నిలపడానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. మరణానంతరం తన శరీరాన్ని పీఎంఆర్ ట్రస్టు ద్వారా ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి అప్పగించాలని కోరుతూ నోటరీ చేసిన అంగీకారపత్రాన్ని మంగళవారం మంత్రి మాణిక్యాలరావుకు ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. భార్య, ముగ్గురు కుమారులతో అంగీకార సంతకాలు, పాత్రికేయులు దూసనపూడి సోమసుందర్, చిట్యాల రాంబాబును సాక్షులుగా ఉంచారు. నారాయణరావు నిర్ణయాన్ని మంత్రి మాణిక్యాలరావు అభినందించారు. కవి నర్తించును ప్రజల నాలుకల యందు అన్న చందంగా కళాకారుడు నారాయణరావు శరీరదానంతో ప్రాణదానం చేయాలనుకోవడం అభినందనీయమని పలువురు కొనియాడారు.