‘అంధ’గాడు సందడి
‘అంధ’గాడు సందడి
Published Sun, Jun 11 2017 12:16 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : అంధగాడు చిత్ర యూనిట్ శనివారం హేలాపురిలో సందడి చేసింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా స్థానిక సాయి బాలాజీ థియేటర్‌ను చిత్ర బృందం సందర్శించింది. ప్రేక్షకులను పలకరించింది. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బాపటేల్ వారితో ముచ్చటించారు. చిత్రంలోని సన్నివేశాలు, తమ నటన, పాటలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. డైలాగులు చెప్పి మెప్పించారు. అనంతరం రాజ్‌తరుణ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ తాను నటించిన అన్ని చిత్రాలనూ ప్రేక్షకులు ఆదరించారని ఆనందం వ్యక్తం చేశారు. తనపై విశేష ఆదరణ చూపుతున్న జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు మరిచిపోలేనన్నారు. త్వరలో అన్నపూర్ణా స్టూడియోస్ సంస్థ నిర్మించే చిత్రంతోపాటు దిల్ రాజు నిర్మాణంలో మరో చిత్రం చేస్తున్నట్టు వివరించారు. అంధగాడు చిత్ర నిర్మాతలతోనే మరో చిత్రం చేయనున్నట్టు వెల్లడించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ రాజ్ తరుణ్‌తో తాను మూడు చిత్రాల్లో నటించానని, అన్నీ ప్రేక్షకాదరణ పొందాయని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ రాజ్‌తరుణ్‌తో చేసే అవకాశం వస్తే వదులుకోనని పేర్కొన్నారు. దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కథా రచయితగా బలుపు, పండగచేస్కో, బెండు అప్పారావు వంటి చిత్రాలకు కథలు అందించానని, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాతలు, హీరో రాజ్ తరుణ్ ప్రోత్సాహంతోనే దర్శకుడిగా మారానని పేర్కొన్నారు. తొలిచిత్రమే విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో చిత్ర పంపిణీదారు ఉషా పిక్చర్స్ అధినేత వి.వి.బాలకృష్ణారావు మాట్లాడుతూ రాజ్‌తరుణ్ నటించిన ఏడు చిత్రాల్లో నాలుగు చిత్రాలను తానే పంపిణీ చేశానని వివరించారు. అనంతరం వారిని పుష్పగుచ్ఛాలతో అభినందించారు. సమావేశంలో విలన్ పాత్రధారి రాజారవీంద్ర, నిర్మాత కిషోర్ గరికపాటి, ఉషా పిక్చర్స్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు, సాయిబాలాజీ థియేటర్ మేనేజర్ మొహిద్దీన్, సీహెచ్ సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement